జ్యోతి మల్హోత్రాను జైల్లోనే ఉంచాలని సుప్రీం ఆదేశం | SC Denies Bail to Spy-Accused YouTuber Jyoti Malhotra | Sakshi
Sakshi News home page

జ్యోతి మల్హోత్రాను జైల్లోనే ఉంచాలని సుప్రీం ఆదేశం

Jun 6 2026 11:10 AM | Updated on Jun 6 2026 11:26 AM

SC Denies Bail to Spy-Accused YouTuber Jyoti Malhotra

న్యూఢిల్లీ: దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న హర్యానాకు చెందిన  ట్రావెల్ బ్లాగర్ జ్యోతి మల్హోత్రాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలకు భారతదేశ వ్యూహాత్మక, రక్షణ సంస్థల అత్యంత సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది. జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడలేమని, ఆమెపై ఉన్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని న్యాయస్థానం స్పష్టం చేసింది.

జాతీయ భద్రతే ముఖ్యం: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎస్.సి. శర్మలతో కూడిన ధర్మాసనం ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. గతంలో పంజాబ్, హర్యానా హైకోర్టు మార్చి 7న ఆమె బెయిల్‌ను నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను జ్యోతి మల్హోత్రా సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అయితే, జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. గతేడాది మే 16 నుంచి ఆమె కస్టడీలో ఉన్నారని, అంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేదని ఆమె తరపు న్యాయవాది వాదించినప్పటికీ, అవన్నీ విచారణ సమయంలో తేలాల్సిన అంశాలని కోర్టు కొట్టిపారేసింది. ఆమె పాకిస్తాన్‌ పర్యటనలు, అక్కడి ప్రభుత్వ అధికారులతో జరిపిన భేటీలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది.

‘ట్రావెల్-విత్-జో’ వెనుక పాక్ నిఘా నీడ
హర్యానాలోని హిసార్‌కు చెందిన జ్యోతి మల్హోత్రా యూట్యూబ్‌లో ‘ట్రావెల్-విత్-జో’ అనే పాపులర్ ఛానల్‌ను నడుపుతున్నారు. ప్రయాణాల పేరుతో ఆమె పాకిస్తాన్ నిఘా విభాగం ప్రతినిధులతో నిరంతరం సంబంధాలు కొనసాగించినట్లు హర్యానా పోలీసులు గుర్తించారు. నవంబర్ 2023 నుండి పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బంది ఎహసాన్-ఉర్-రహీమ్ (అలియాస్ డానిష్) అనే వ్యక్తితో ఆమె నిరంతరం టచ్‌లో ఉన్నట్లు ఆధారాలు లభించాయి. సదరు డానిష్‌ను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 14, 2025నే ‘పర్సనా నాన్ గ్రాటా’ (అవాంఛనీయ వ్యక్తి)గా ప్రకటించి భారత్ నుండి బహిష్కరించడం గమనార్హం. జ్యోతిని తమ దేశానికి అనుకూలమైన వ్యక్తిగా మార్చుకోవడానికి పాక్ నిఘా వర్గాలు ప్రయత్నించాయని పోలీసులు తమ దర్యాప్తులో తేల్చారు.

రక్షణ రహస్యాల చేరవేత.. డిలీట్ చేసిన చాట్లు
జ్యోతి మల్హోత్రాపై హర్యానా పోలీసులు అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్,  భారతీయ న్యాయ సంహిత  సెక్షన్ 152 కింద దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. ఆమె వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పాకిస్థాన్ ఆపరేటివ్‌లతో మాట్లాడి, ఆ చాటింగ్‌లను క్రమం తప్పకుండా డిలీట్ చేసేవారని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. భారతదేశానికి చెందిన వ్యూహాత్మక రక్షణ స్థావరాలు, భద్రతా వ్యవస్థల వీడియో ఫుటేజీలను సైతం ఆమె అవతలి వైపుకు చేరవేసినట్లు బలమైన ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ఇదివరకే స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: మన దేశంలోనూ ‘అద్దె ప్రియుళ్లు’.. జాబితాలో హైదరాబాద్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement