న్యూఢిల్లీ: జపాన్‌లో ఎంతగానో ప్రాచుర్యం పొందిన ‘రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్’ (అద్దెకు ప్రియుడు) అనే వింత కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశంలోనూ అడుగుపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్, ఒక వెబ్‌సైట్ ద్వారా బాయ్‌ఫ్రెండ్‌ను అద్దెకు తీసుకుని, అతనితో రోజంతా మాల్‌లో గడిపిన వీడియోను పంచుకోవడంతో నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రారంభ ధర కేవలం రూ. 1,500 లకే లభిస్తున్న ఈ వినూత్న సేవలు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చర్చకు దారితీశాయి.
రూ. 1,500 లతో మొదలు.. షాపింగ్ మాల్‌లో..
ఇషా భల్లా అనే ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘Kopartner.in’ అనే ప్లాట్‌ఫారమ్ నుండి ఆమె ఒక పురుష తోడును (Male Companion) అద్దెకు తీసుకున్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రదేశంలో అతడిని కలిసి, ఆపై మాల్‌కు వెళ్లినట్లు ఆమె తెలిపారు. అక్కడ అతను తనకు షాపింగ్‌లో సహాయం చేశాడని, బ్యాగులు మోసాడని, అలాగే తన మాజీ ప్రియుడి గురించి చెబుతూ, ఎమోషనల్ అయినప్పుడు జోకులు వేస్తూ తనను ఓదార్చాడని ఆమె పేర్కొన్నారు. చివరగా ఆ సేవలకు గానూ అతనికి డబ్బులు చెల్లించి వీడ్కోలు పలికినట్లు ఇషా వివరించారు.
గంటల లెక్కన రేట్లు.. దేశవ్యాప్తంగా సేవలు
ఈ అధికారిక వెబ్‌సైట్ నేరుగా ‘బాయ్‌ఫ్రెండ్’ అని పేర్కొననప్పటికీ, సామాజిక మద్దతు, విభిన్న జీవనశైలి సేవలను అందిస్తోంది. ఇందులో మూవీ కంపానియన్, క్లబ్బింగ్ వంటి సేవలకు గంటకు రూ. 2,000, షాపింగ్ బడ్డీ సర్వీస్‌కు గంటకు రూ. 1,200, ట్రావెల్ పార్టనర్‌కు గంటకు రూ. 2,500 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే వృద్ధుల సంరక్షణ, గృహ సహాయం వంటి సేవలు గంటకు రూ. 1,000 నుండి ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నట్లు సంస్థ తెలిపింది.
ఉద్యోగాల్లేకనే ఈ వింత పోకడలు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుండి భిన్నమైన స్పందనలు వస్తున్నాయి. కొందరు ‘మనం ఏ కాలంలో బతుకుతున్నాం?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు ‘ఇదంతా పచ్చి అబద్ధం, ఎవరూ డబ్బులు వృథా చేయకండి’ అని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరైతే దేశంలో ‘నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరింది’ అనడానికి ఇదే నిదర్శనమని ఘాటుగా విమర్శించారు. కాగా, తాము పూర్తిగా ధృవీకరించిన, సురక్షితమైన ప్రొఫెషనల్స్ ద్వారానే ఈ సేవలను అందిస్తున్నామని సదరు వెబ్‌సైట్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: ‘లింగ వివక్ష బస్సులు’.. ఉచిత బస్సులపై రచ్చ!


