వీళ్ళు బయట మనల్ని ఎలా చూపుతున్నారు? | Sakshi Guest Column On How do Alliance Govt show AP People outside | Sakshi
Sakshi News home page

వీళ్ళు బయట మనల్ని ఎలా చూపుతున్నారు?

Apr 2 2026 4:56 AM | Updated on Apr 2 2026 9:01 AM

Sakshi Guest Column On How do Alliance Govt show AP People outside

అభిప్రాయం

తెలుగు ప్రజలు రెండుగా విడిపోయి పదేళ్ళు అయింది. ఈ అనుభవం తర్వాత కూడా ఇంకా మనగురించి మనం చెప్పు కునేప్పుడు; ‘నేను’ అనాలా, లేక ‘మేము’ అనాలా అనే మీమాంస అలాగే ఉంది. ఇది ‘జీఐ’ (జియోగ్రాఫికల్‌ ఐడెంటిటీ) అనే మన భౌగోళిక గుర్తింపు దృష్టి నుంచి అంటున్న మాట. సీఎం అంటేనే ‘ప్రభుత్వం’ అయినప్పుడు, రాష్ట్ర ‘ప్రజలు’, ‘ప్రాంతము’– ఈ రెండింటికి ఆయన ప్రతినిధి. అటువంటిది, ఏపీ గురించి ముఖ్యమంత్రి బయట మాట్లాడేటప్పుడు, ఆయన రాష్ట్ర ప్రజలైన మనల్ని కూడా కలుపుకుని ‘మన’ అంటున్నారా, లేక తనమట్టుకు మాత్రమే పరిమితం చేసుకుని ‘నేను’ అంటున్నారా? ఇటీవల పార్లమెంట్‌లో జరిగింది చూసినప్పుడు, ఈ అంశం చర్చించకుండా ఉండలేకపోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో ఏపీ చారిత్రక వైభవాన్ని పరిరక్షించి మన ‘హెరిటేజ్‌’ని కొత్త తరాలకు చేర్చే ‘ఆర్కియాలజీ’ శాఖ పనితీరు గురించి, దానికి నిధుల కేటాయింపు గురించి చిత్తూరు ఎంపీ డి. ప్రసాదరావు (కూటమి) ఒక ప్రశ్న అడిగారు. దానికి ఆ శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెఖావత్‌ ఆసక్తికరమైన జవాబు ఇచ్చారు. ‘అందుకు కారణం కేంద్రం వద్ద నిధులు లేకపోవడం కాదు, మీ రాష్ట్రం నుంచి ఎటువంటి ప్రతిపాదనలు కేంద్రానికి రానందున, మీ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదు’ అని మంత్రి అన్నారు. 

తరుచూ ‘టూరిజం’ చుట్టూ పెరిగే వృద్ధి గురించి, దాని విస్తరణ గురించి మాట్లాడే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఇటువంటి లోపానికి కారణం ఏమిటి అని చూస్తే, మళ్ళీ అది మరొక ‘అకడమిక్‌’ అంశం అవుతున్నది. సామాజిక శాస్త్రాలకు తల్లి వంటి చరిత్ర కనుక ఈ ప్రభుత్వానికి గుర్తు ఉండివుంటే, పురావస్తు శాస్త్రం (ఆర్కియాలజీ) దానితో జంటగా కలిసే ఉంటుంది కనుక, అది కూడా వారికి గుర్తు ఉండి ఉండేది. మూడు దశాబ్దాల క్రితం సామాజిక శాస్త్రాల చదువులు అక్కరలేదు అనే వైఖరి ఈ ప్రభుత్వం తీసుకుంది కనుక; ఇక ఇప్పుడు వారికి ‘టూరిజం’ అంటే హోటళ్లు, కాటేజీలు, ‘ఫుడ్‌’, వినోదం, విలాసం మాత్రమే ‘టూరిజం’  అవుతుంది. అందుకే గడచిన పదేళ్ళలో ఇంకా దొరకాల్సిన చరిత్ర కోసం ఇక్కడ వెతకాలని, అందుకు ‘ఆర్కియాలజీ’ కార్యకలాపాలు అవసరం అని ఈ ప్రభుత్వం అనుకోలేదు. 

ఢిల్లీలో మార్చి 5–7 మధ్య ‘అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌’ జరిపిన పదకొండవ ‘రైసీనా డైలాగ్‌– 26’ సదస్సులో మన తీరు కూడా అటువంటిదే. పైగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ దీనికి స్పాన్సర్‌ కూడా. ప్రధాని మోదీ ప్రారంభించిన ఈ సదస్సుకు ఫిన్లాండ్‌ ప్రెసిడెంట్‌ ముఖ్య అతిథిగా హాజరై కీలక ఉపన్యాసం ఇచ్చారు. బీజేపీ తన ముద్రకోసం దాన్ని – ‘సంస్కార’ అనే బ్యానర్‌ కింద జరిపినా ‘ధ్రువీకరణ, వసతి, పురోగతి’ అనే మూడు అంశాల దృష్టితో ఇది జరిగింది. కానీ కొత్త రాష్ట్రానికి ప్రతినిధిగా మాట్లాడిన ఏపీ సీఎం బాబు వెయ్యి కిలోమీటర్ల తీరం ఉన్న ఈ రాష్ట్రం ఉనికిని ఇతరులకు అదొక భౌగోళిక అవకాశంగా ఆ వేదికపై  చూపలేదు. దీని పర్యాటక ప్రాధాన్యం గురించి అక్కడ చెప్పకుండా పర్యాటక రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాన్ని చేజేతులా వదిలివేశారు. 

ఆ వేదికమీద నుంచి ‘ప్రపంచం అంతా ఇండియన్స్‌ ఉన్నారు, సిలికాన్‌ వ్యాలీ, అమరావతి ‘టెక్నాలజీ హబ్‌’, ‘ఏఐ’, ‘డేటా సెంటర్‌’, ‘క్వాంటమ్‌ వ్యాలీ’, ‘వరల్డ్‌ క్లాస్‌ ఎకో సిస్టం’ అంటూ చెప్పాక, చివరికి ఈ మధ్య మన జిల్లాల్లో ఎక్కువ పిల్లల్ని కనండి అని చెబుతున్నట్టుగా, అక్కడ కూడా ఇద్దరు ముగ్గురు పిల్లలకు 25 వేలు ఇస్తాము అని చెప్పేశారు. పైగా దీన్ని– ఫైవ్‌ పిల్లర్‌ మోడల్‌’ అని వెల్లడించారు. అంటే– అమ్మా నాన్న, ముగ్గురు పిల్లలు కలిసి ‘ఐదు స్తంభాలు నమూనా’ అని. పైగా ఇది ‘పాపులేషన్‌ కేర్‌’ కార్యక్రమం అని కూడా అన్నారు. అయితే, ఇందులో ఎక్కడ ‘మనం’ ఉన్నామో వెతకడం ఎలా?

జాన్‌సన్‌ చోరగుడి
వ్యాసకర్త అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత 

Advertisement
 
Advertisement
Advertisement