పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు | Iran War: Indian Man Killed Who is Coming To Ujjain To Attend Nieces Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లికి రావాల్సినవాడు.. శవమై వచ్చాడు

Jun 6 2026 10:51 AM | Updated on Jun 6 2026 11:23 AM

Iran War: Indian Man Killed Who is Coming To Ujjain To Attend Nieces Wedding

పశ్చిమాసియాలో ఉద్రికత్తల మధ్య కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ చేసిన దాడిలో ఒక భారతీయుడు మరణించిన వైనం విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన మంజూర్ అహ్మద్ (55) దాదాపు 30 ఏళ్లుగా కువైట్‌లో టైలర్‌గా పని చేస్తున్నారు. మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.

జూన్ 8న  రత్లాం జిల్లాలో జరగాల్సిన మేనకోడలు వివాహానికి హాజరయ్యేందుకు మంజూర్ ఇంటికి తిరిగి  రావాలనుకున్నాడు. బుధవారం ఉదయం 7:30 గంటలకు ముంబైకి విమానంలో  వచ్చి, అక్కడి నుండి రైలులో తన సొంత ఊరైన ఉజ్జయినికి వెళ్లాలని అనుకున్నారు. విమానం ఎక్కడానికి ఒక రోజు ముందు, తన కుమారుడు అనస్ అహ్మద్‌తో మాట్లాడి, రైల్వే స్టేషన్ నుండి తనను తీసుకువెళ్లడానికి రమ్మని చెప్పారు. గత ఏడాది అక్టోబర్ తర్వాత భారత్‌కు తిరిగి వస్తున్న అతనికి ఎంతో సంతోషంగా పూలమాలలతో స్వాగతం చెప్పేందుకు సిద్ధమవు తుండగా, ఈ విషాద వార్త వారి చెవిని పడిందని అహ్మద్‌  కుమారుడు అనస్, తండ్రితో జరిగిన ఆ చివరి ఫోన్ సంభాషణను గుర్తు చేసుకున్నారు. 

నాగదా రైల్లో వస్తానని చెప్పారు.. రిసీవ్‌ చేసుకోడానికి రమ్మన్నారు.. కానీ అది చివరి కాల్‌ అవుతుందని అనుకోలేదని కంటతడిపెట్టారు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. శుక్రవారం ఆయన మృతదేహాన్ని అహ్మదాబాద్ విమానాశ్రయానికి తరలించారు, ఆ తర్వాత బంధువులు అంత్యక్రియల కోసం రోడ్డు మార్గంలో ఉజ్జయినికి తీసుకువెళ్లారు.

మరోవైపు భారత్ ఈ దాడిని ఖండించింది. దాడులను నిలిపివేయాలని  విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) పిలుపునిచ్చింది.ఆ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలు , కేంద్రాలు అప్రమత్తంగా ఉన్నాయని, అక్కడి భారతీయ సమాజానికి చురుకుగా మద్దతునిస్తూనే ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.


 కాగా ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్‌పై దాడి చేసి, 86 ఏళ్ల సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని హతమార్చడంతో మధ్యప్రాచ్య యుద్ధం చెలరేగింది. దీనికి ప్రతిస్పందనగా, టెహ్రాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా, ఇజ్రాయెల్ ఆస్తులపై దాడులు ప్రారంభించింది. మార్చిలో కువైట్‌లోని ఒక విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారంపై ఇరాన్ జరిపిన దాడుల్లో  ఒకరు ,  అదే నెలలో యూఏఈ రాజధాని అబుదాబిలో క్షిపణిని అడ్డగించడం వల్ల వెలువడిన శకలాల కింద పడి  మరికొరు ఇలా  ఈ దాడుల్లో ఇప్పటివరకు 10 మంది భారతీయులు మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement