వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఇరాన్‌పై అమెరికా దాడులు చేసింది. ఆ దేశ మిలటరీ స్థావరాలే లక్ష్యంగా (బుధవారం) అమెరికా వైమానిక దళాలు విరుచుకపడ్డాయి. ఆ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడం ఇది వరుసగా 12వ రాత్రి కావడం ఆందోళన కలిగించే విషయం
అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన ప్రకటనలో "ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు అమెరికా దళాలు ఇరాన్ సైనిక లక్ష్యాలపై మరిన్ని దాడులను ప్రారంభించాయి. ఆ ప్రాంతీయ జలాల్లో పయనించే పౌర నావికులకు ,వాణిజ్య నౌకలకు ఇరాన్ నుండి ఎదురవుతున్న ముప్పును పూర్తిగా మట్టుబెట్టే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుంది." అని ప్రకటన విడుదల చేసింది.
మధ్యప్రాచ్య సముద్ర మార్గాల్లో నౌకాయాన భద్రతను కాపాడటమే లక్ష్యంగా ఇరాన్ సైనిక శక్తులను దెబ్బతీసేందుకు ఈ దాడులు తీవ్రతరం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. కాగా ఇరాన్ సైతం అమెరికాకు ఘాటుగా బదులిచ్చింది. ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ మేరకు కొద్ది సేపటి క్రితమే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. అమెరికా తమపై దాడులు చేస్తే కన్నుకు కన్ను అన్న రీతిలోనే సమాధానం ఉంటుందని తెలిపారు.


