ఇక ఫేస్‌ను కూడా అమ్ముకోవచ్చు! | The latest trend in China entertainment industry | Sakshi
Sakshi News home page

ఇక ఫేస్‌ను కూడా అమ్ముకోవచ్చు!

Jul 23 2026 4:16 AM | Updated on Jul 23 2026 4:16 AM

The latest trend in China entertainment industry

ఇప్పటివరకు మనం ఇళ్లు, భూములు, బంగారం, వాహనాల కొనుగోళ్లు, అమ్మకాల గురించి విన్నాం, చూశాం. కానీ ‘ఫేస్‌వాల్యూ’అనే మాటను నిజం చేస్తూ... మనుషులు తమ ముఖాలను కూడా అమ్ముకునే రోజులు వచ్చేశాయని మీకు తెలుసా? వినడానికి వింతగా ఉన్నా, చైనా వినోద రంగంలో ఇప్పుడిదే లేటెస్ట్‌ ట్రెండ్‌! చైనాలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రూపొందించే షార్ట్‌ డ్రామాల పరిశ్రమ ఊహించని వేగంగా విస్తరిస్తోంది. రోజుకు వందలాది కొత్త వీడియోలు విడుదలవుతున్నాయి. 

అయితే, పరిమిత బడ్జెట్‌ కారణంగా ఒకే నటుడి ముఖం వేర్వేరు పాత్రల్లో, భిన్నమైన రూపాల్లో కనిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులు విసుగెత్తిపోతున్నారు. ఒక వీడియోలో ప్రేమకథలో హీరోగా కనిపించిన వ్యక్తి... మరో వీడియోలో హంతకుడిగా, ఇంకో దాంట్లో డాక్టర్‌గా దర్శనమిస్తుండటంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు కొత్త నటీనటులను ఎంపిక చేసి, షూటింగ్‌లు చేయడం నిర్మాతలకు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు కొందరు నిర్మాతలు ఫేస్‌ బయ్యింగ్‌ అనే క్రేజీ ఐడియాను తెరపైకి తెచ్చారు. 

అందంగా ఉండి, ఎలాగైనా స్క్రీన్‌పై కనిపించాలనే కోరిక ఉన్న సామాన్యులను ఆహ్వానించి వారి ముఖాలను త్రీడీ స్కాన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత సదరు వ్యక్తులతో ఒప్పందం కుదుర్చుకుని, కొంత డబ్బు ఇచ్చి వారి డిజిటల్‌ రూపాన్ని భద్రపరుచుకుంటారు. ఈ డిజిటల్‌ ఫేస్‌లను ఏఐ సాయంతో తమ డ్రామాలు, సిరీస్‌లలో వాడుకుంటారు. దీనివల్ల సదరు వ్యక్తులు ప్రత్యక్షంగా షూటింగ్‌కు రావాల్సిన అవసరమే ఉండదు. అయితే, ఒక్కసారి ఆ ఒప్పందంపై సంతకం చేస్తే... తమ ముఖాలపై ఆ అమ్మకందారులకు ఎలాంటి హక్కులు ఉండవు. అయినా ఫర్వాలేదంటూ కేవలం 500 యువాన్లు (సుమారు రూ. 6 వేలు) ఆశపడి చాలామంది తమ ముఖ హక్కులను నిర్మాతలకు రాసిచ్చేస్తున్నారట. 

డిజిటల్‌ అస్తిత్వానికే ప్రమాదమా? 
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన ఈ ట్రెండ్‌పై సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి మన డిజిటల్‌ ఫేస్‌ డేటా ఇతరుల చేతుల్లోకి వెళ్తే, దాన్ని ఎక్కడ, ఎలా ఉపయోగిస్తారనే దానిపై మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు. భవిష్యత్తులో ఈ డేటాను సైబర్‌ నేరాలు, డీప్‌ఫేక్‌ వీడియోలు, నకిలీ ప్రకటనలకు ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కొద్దిపాటి డబ్బు కోసం మన డిజిటల్‌ గుర్తింపునే శాశ్వతంగా అమ్మేసుకోవడం... నిజంగా లాభమా? లేక కొరివితో తలగోక్కున్నట్టా? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

-సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement