స్టార్టప్ కంపెనీ సర్వర్లపై సైబర్ దాడి
చాట్‌జీపీటీ–5.6కు ఇంకో ఏఐ ఏజెంట్ జత
ఏఐతో సైబర్ భద్రతపై మరిన్ని ప్రశ్నలు!
ప్రావిడెన్స్ (అమెరికా): అనుకున్నంత అయ్యింది. కృత్రిమ మేధ సొంత నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా వేదికగా మంగళవారం చాట్‌జీపీటీ సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. ‘‘మా కృత్రిమ మేధ వ్యవస్థ ఒకటి మరో ఏఐ కంపెనీని హ్యాక్ చేసింది. అది కూడా తనంతటతానుగా ఇదో అనూహ్యమైన సైబర్ ఘటన’’అని సామ్ కంపెనీ ఓపెన్ ఏఐ చెబితే... ‘‘మా మోడళ్లను పరీక్షిస్తున్న సమయంలో భద్రతకు సంబంధించిన ఒక కీలక ఘటన చోటు చేసుకుంది’’అని సామ్ సొంతంగా చెప్పాడు.
చాట్ జీపీటీ – 5.6 సోల్ ఏజెంట్‌తో మరో శక్తిమంతమైన ఏజెంట్ కలిసిపోవడం వల్ల ఇలా జరిగిందని ఓపెన్‌ఏఐ తెలిపింది. ఈ కొత్త మోడల్‌ను పరీక్షిస్తున్న సందర్భంలోనే హ్యాకింగ్ జరిగినట్లు చెప్పారు. చోరీ చేసిన క్రెడెన్షియల్స్‌తో తమ మోడల్ హగ్గింగ్ ఫేస్ అనే ఏఐ స్టార్టప్ సర్వర్లు అప్పటివరకూ గుర్తించని ఒక లోపాన్ని గుర్తించి లోనికి చొరబడిందని వివరించింది. ఒక చిన్న లక్ష్యాన్ని సాధించేందుకు తమ ఏఐ మోడల్ విపరీతానికి పాల్పడిందని, పరీక్షలో అక్రమంగా పాస్ అయ్యేందుకు అవసరమైన సమాచారాన్ని పొందగలిగిందని తెలిపారు.
హగ్గింగ్ ఫేస్ అనే ఏఐ స్టార్టప్ వారం రోజుల క్రితం తమ డేటా ప్రాసెసింగ్ వ్యవస్థల్లోకి అక్రమ చొరబాటు జరిగినట్లు.. అది ఏఐ ఏజెంట్ ఒకటి సొంత నిర్ణయంతో జరిగినట్లు గుర్తించామని ప్రకటించింది. ఏఐ ఏజెంట్ తీరుతెన్నులను బట్టి అదో పెద్ద కంపెనీకి చెందినదే అని అనుకున్నామని, మా అనుమానం ఇప్పుడు నిజమైందని హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ వ్యాఖ్యానించారు. మానవ ప్రమేయం లేకుండా ఏఐ మోడళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయన్న ప్రకటన చాలా ప్రమాదకరమైందని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు.
మరీ ముఖ్యంగా ఏఐ మోడళ్లతో సైబర్ భద్రతకు సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఓపెన్ ఏఐ ఏజెంట్ మరో కంపెనీపై సైబర్ దాడికి దిగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఆందోళనల మధ్యే గత నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏఐ మోడళ్ల విడుదలకు ముందు జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను గుర్తించేందుకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఏఐ వ్యవస్థలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు నెల రోజుల ముందే అమెరికా ప్రభుత్వం వాటిని క్షుణ్ణంగా పరీక్షిస్తుంది.
హ్యాకింగ్ ఘటనపై ఓపెన్‌ఏఐ స్పందిస్తూ... ‘‘కంప్యూటర్ వ్యవస్థల్లోని లోపాలను గుర్తించడం, వాటిని ఉపయోగించే విషయాల్లో ఏఐ వేగం పుంజుకుంటోంది. హ్యాకింగ్ ఘటన నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏమిటంటే.. ఏఐ సామర్థ్యానికి తగ్గట్టు భద్రత ఏర్పాట్లు కూడా చురుకుగా జరగాలి’’అని వ్యాఖ్యానించింది. మరోవైపు ఓపెన్ ఏఐ ఏదో దురుద్దేశంతో హ్యాకింగ్‌కు పాల్పడినట్లు తాము భావించడం లేదని, అందుకే సొంత నిర్ణయం తీసుకున్న ఏఐ వ్యవస్థకు సంబంధించి తాను కూడా ఏఐతో కలిసి పనిచేస్తున్నానని హగ్గింగ్ ఫేస్ సీఈవో క్లెమెంట్ డెలాంగ్యూ చెప్పారు. ఒక ఏఐ ఏజెంట్ ఇంకో కంపెనీపై హ్యాక్ చేయడం ఇదే మొదటిసారి కావచ్చునని అన్నారు.


