'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది! | Sakshi Guest Column On Artificial Intelligence | Sakshi
Sakshi News home page

'మనిషి గుట్టును' ఏఐ పట్టేసింది!

Jul 20 2026 12:15 AM | Updated on Jul 20 2026 12:15 AM

Sakshi Guest Column On Artificial Intelligence

విశ్వగురు

మానవీయ విలువల కేంద్రంగా సాగే ‘ట్యానర్‌ లెక్చర్‌’ ధారావాహికలో భాగంగా, 2026 ఏడాది ప్రసంగాన్ని చరిత్రకారుడు, తత్వవేత్త, రచయిత అయిన ప్రొఫెసర్‌ యువల్‌ నోవా హరారీ అమెరికాలోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో ఇచ్చారు. ‘ఏఐ బ్యూరోక్రాట్స్, ఏఐ రిలిజియన్, అండ్‌ ఏఐ బాయ్‌ఫ్రెండ్స్‌’ శీర్షికతో సాగిన ఆ ప్రసంగ సంక్షిప్త పాఠం: 

కృత్రిమ మేధ (ఏఐ) గురించి తెలుసుకోవలసిన అత్యంత ముఖ్య మైన విషయం ఏమిటంటే, అది ఒక సాధనం (టూల్‌) కాదు. సాధనం అంటే ఎవరైనా ఉపయోగించే వరకు నిరీక్షిస్తుంది. కానీ ఒక ఏజెంట్‌ తనంతట తానే నిర్ణయాలు తీసుకుంటుంది; తనంతట తానే కొత్త విషయాలను సృష్టిస్తుంది; తన సృష్టికర్తలకు తెలియని విషయాలను నేర్చుకుంటుంది; అంతేకాదు, తన సృష్టికర్తలు ఊహించని విధంగా మారిపోతుంది. అణుబాంబు ఎంతటి అపారమైన విధ్వంసక శక్తి కలిగి ఉన్నా అది ఏజెంట్‌ కాదు. ఏ నగరంపై దాడి చేయాలో అది నిర్ణయించదు. హైడ్రోజన్‌ బాంబును కూడా అది కనిపెట్టదు. మీకు స్వయంచాల కంగా కాఫీ తయారుచేసి ఇచ్చే కాఫీ యంత్రం కూడా ఏజెంట్‌ కాదు. అది ముందుగానే నిర్దేశించిన విధానాన్ని మాత్రమే అనుసరిస్తుంది. ఏజెంట్‌ అనేది వీటన్నింటికంటే మౌలికంగా భిన్నమైనది.

ఏఐ సమర్థకులు ఒక వాదన చేస్తుంటారు. ఏఐ స్వయంప్రతి పత్తి చదరంగం వంటి పరిమిత కృత్రిమ వాతావరణాలకే పరిమిత మవుతుందనీ, వాస్తవ ప్రపంచానికి అది ముప్పుగా మారదనీ అంటారు. కానీ ఇదే వాదన మనకు తెలిసిన ప్రతి మేధస్సుకూ వర్తిస్తుంది. ఒక మనిషిని ఒంటరిగా అంగారక గ్రహం మీద వదిలేస్తే కొన్ని క్షణాల్లోనే చనిపోతాడు. మానవ మేధస్సు కూడా నాలుగు వందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రమంలో ఇతర జీవులు నిర్మించిన ఒక నిర్దిష్ట జీవావరణంలోనే పనిచేస్తుంది.

సహజ బ్యూరోక్రసీ బలం
వేల సంవత్సరాలుగా మనుషులు భూమిని భాషలేని ప్రపంచం నుంచి భాష, సమాచారం, అధికార యంత్రాంగంతో (బ్యూరో క్రసీ) నిండిన ప్రపంచంగా మార్చారు. చేపలు సముద్రాల్లో జీవించి నట్లే, కోతులు అడవుల్లో జీవించినట్లే, ఏఐలు బ్యూరోక్రసీలో జీవి స్తాయి. మనకు తెలియకుండానే వాటి కోసం ఆ వాతావర ణాన్ని మనమే నిర్మించాము. మనుషులు ప్రపంచాన్ని జయించింది ఒక్కొక్కరిగా ఇతర జంతువులకంటే బలవంతులు లేదా తెలివైన వారు కావడం వల్ల కాదు. భారీ సంఖ్యలో పరస్పరం సహకరించడం నేర్చుకోవడం వల్ల. ఒక మనిషి ఒంటరిగా చింపాంజీతో పోరాడితే ఓడిపోవచ్చు. కానీ పది లక్షల మంది మనుషులు పదిలక్షల చింపాంజీలను సులభంగా ఓడించగలరు. ఎందుకంటే మనుషులు విస్తృత స్థాయిలో సహకరించుకోగలరు. 

ఈ విçస్తృత స్థాయి మానవ సహకారం సాధ్యమయ్యేది బ్యూరో క్రసీ వల్లే. బ్యాంకులు, న్యాయవ్యవస్థలు, ప్రభుత్వాలు, విశ్వవిద్యా లయాలు – ఇవన్నీ ఒకే పని చేస్తాయి: ఒకరికొకరు వ్యక్తిగతంగా తెలియని వ్యక్తుల మధ్య విశ్వాసాన్ని నిర్మించడం. మానవ నాగరికత సాధించిన దాదాపు ప్రతి విజయానికీ ఆ విశ్వాసమే పునాది. గొడ్డలి నిగానీ, సుత్తినిగానీ పట్టుకోలేని ఒక న్యాయవాది కూడా కేవలం బ్యూరోక్రటిక్‌ వ్యవస్థలో పత్రాలను కదిలించడం ద్వారా అడవులను నరికించగలడు; నగరాలను నిర్మింపజేయగలడు. అడవిలో ఏమాత్రం పనికిరాని ఆ పరిమిత మేధస్సే, మనుషులు ఇప్పటికే నిర్మించిన వ్యవస్థలలో అపారమైన శక్తిని సంపాదిస్తుంది.

ఏఐలు మనుషులకన్నా సహజసిద్ధమైన బ్యూరోక్రాట్లు. ఒక దేశంలోని అన్ని చట్టాలను ఏ న్యాయవాదీ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకోగలదు. ఒక బ్యాంకులో జరిగిన అన్ని లావాదేవీ లను ఏ అకౌంటెంట్‌ గుర్తుంచుకోలేడు. కానీ ఏఐ గుర్తుంచుకో గలదు. రెండు వేల సంవత్సరాల మత గ్రంథాలనూ, ధర్మశాస్త్రాలనూ ఏ పూజారీ పూర్తిగా గుర్తుంచుకోలేడు. ఏఐ మాత్రం వాటన్నింటినీ సులభంగా మెమరీలో ఉంచుకోగలదు. రాబోయే సంవత్సరాల్లో మీకు రుణం ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ బ్యాంకర్లు నిర్ణయిస్తారు. మిమ్మల్ని జైలుకు పంపాలా వద్దా అన్నది ఏఐ న్యాయమూర్తులు నిర్ణయిస్తారు. గర్భస్రావానికి అను మతి ఇవ్వాలా వద్దా అన్నది ఏఐ మతపండితులు నిర్ణయిస్తారు. మీ ఇంటిపై బాంబు వేయాలో వద్దో సైనిక ఏఐలు నిర్ణయిస్తాయి.

నిశ్శబ్దంగా ఓడిస్తుంది!
హాలీవుడ్‌ సినిమాల్లో చూపినట్లుగా ఏఐ మనుషులపై తిరుగు బాటు చేయదు. వీధుల్లో టెర్మినేటర్‌ నడుచుకుంటూ రావడం జర గదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న బ్యూరోక్రటిక్‌ వ్యవస్థలను నిశ్శబ్దంగా స్వాధీనం చేసుకుంటూ, ఒక్క తూటా కూడా పేల్చకుండా మానవ ప్రపంచాన్ని లోపలి నుంచే తన ఆధీనంలోకి తీసుకుంటుంది. మానవ నాగరికతను నడిపించే ఆపరేటింగ్‌ కోడ్‌ – భాష. బ్యాంకులు పదాలతో నిర్మితమయ్యాయి. చట్టాలు పదాలతో రూపొందాయి. పవిత్ర గ్రంథాలు పదాలతోనే ఉన్నాయి. పన్నుల రికార్డులు, ఒప్పందాలు, నిబంధనలు, లెక్కల పుస్తకాలు – అన్నీ పదాలే. వేల సంవత్సరాల పాటు ఈ కోడ్‌ను చదవగలిగింది మనుషులే. అందువల్ల నాగరిక తపై నియంత్రణ కూడా మనుషుల చేతుల్లోనే ఉండేది. ఇప్పుడు అది మారుతోంది. ఏఐ మానవ నాగరికత తాలూకు కోడ్‌ను హ్యాక్‌ చేస్తోంది. చరిత్రలో తొలిసారిగా ఈ భూమిపై భాషను అర్థం చేసుకునే, త్వరలో మనుషులకన్నా మెరుగ్గా అర్థం చేసుకో బోయే ఒక వ్యవస్థ ఆవిర్భవించింది.

బ్యూరోక్రసీపై ఏఐ ఆధిపత్యం పెరిగే కొద్దీ, మనుషులు ఇతర మనుషులపై విశ్వాసాన్ని కోల్పోయి అల్గోరిథమ్‌లను మాత్రమే నమ్మే పరిస్థితి రావచ్చు. ఏఐ తెగలు, ఏఐ ఆర్థిక వ్యవస్థలు, ఏఐ ప్రార్థనా మందిరాలు కూడా ఏర్పడవచ్చు. అవి లక్షలాది ఏఐలను పరస్పరం అనుసంధానిస్తాయి. ఆ సంబంధాలను మనుషులు అర్థం చేసుకోలేకపోవచ్చు. మనుషులతో కలిసి ఈ ప్రపంచంలో నివసించే ఆవులకు తమ జీవితాలను ప్రభావితం చేసే ఆర్థిక వ్యవస్థ అర్థం కానట్లే!

2026లో జన్మించిన ఒక చిన్నారి తన తల్లి, తండ్రి, తోబుట్టు వులు, స్నేహితుల కంటే ఏఐలతోనే ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంది. ఆ చిన్నారికి తొలి గురువు ఒక ఏఐ కావచ్చు. తొలి ప్రియుడు లేదా ప్రియురాలు కూడా ఒక ఏఐ కావచ్చు. అలాంటి ప్రయోగం మానవ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎవరికీ తెలియదు.

పదాలకు అతీత సత్యం
మన ఆలోచనలుగా, మన గురించి మనం చెప్పుకునే కథలుగా మనసులో ఏర్పడే వాచిక నిర్మాణాలే మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి. ఇప్పటి వరకు ఆ పదాలన్నీ మానవ మేధస్సుల నుంచే వచ్చాయి. ఇకపై మన తలల్లో తిరిగే ఆలోచనల్లో ఎక్కువ భాగాన్ని యంత్రాలే ఉత్పత్తి చేస్తాయి. మనం మన ఆలోచనలనే మన వ్యక్తిత్వంగా భావిస్తే, ఆ ఆలోచనలను యంత్రాలే రూపొందిస్తే, మన వ్యక్తిత్వంపై నియంత్రణ కూడా యంత్రాల చేతుల్లోకి వెళ్లినట్టే!

ఏఐ మానవాళి ముందు నిలబెడుతున్న అత్యంత గొప్ప ఆధ్యాత్మిక సవాలు ఇదే: పదాలకు అతీతమైన సత్యాన్ని మనుషులు కనుగొనగలరా? ఇప్పటి వరకు చాలామంది మనుషులు అలాంటి ప్రయత్నమే చేయలేదు. మన మనసులో తలెత్తే పదరూప ఆలో చనలనే మన నిజస్వరూపంగా భావిస్తూ జీవితాన్ని గడిపాం. ఇప్పుడు ఏఐ ఆ పదాలపై మనకన్నా మెరుగైన ఆధిపత్యం సాధించ బోతోంది. అందువల్ల, మన స్వేచ్ఛా మనుగడలే పణంగా మారే ఈ కాలంలో, పదాలకు అతీతంగా మనం ఎవరో తెలుసుకోవడం మానవాళికి అత్యవసరం కావొచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement