ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి! | Sakshi Guest Column On Right to vote should be made a fundamental right | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చాలి!

Jul 18 2026 5:56 AM | Updated on Jul 18 2026 5:56 AM

Sakshi Guest Column On Right to vote should be made a fundamental right

సందర్భం

ఒక ప్రజాస్వామ్యం ఎదుర్కొనే అసలైన పరీక్ష పోలింగ్‌ రోజున ప్రారంభం కాదు, అది ఓటర్ల జాబితా రూపకల్పనతోనే మొద లవుతుంది. ఈ జాబితాయే ప్రజాస్వామ్యానికి మొదటి అలారం (గడియారం). పోలింగ్‌ రోజును గ్రామీణ ప్రాంతాల్లో ‘ఓట్ల పండుగ’గా చూస్తారు. పెద్ద ఎత్తున పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోవడా నికి బారులు తీరుతారు. అయితే అటువంటి పౌరుల ఓటుపై ఇప్పుడు నీలి నీడలు ‘సర్‌’ (ఎస్‌ఐఆర్‌) రూపంలో ముసురుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సర్‌ పేరుతో లక్షలాది మంది పౌరుల ఓటు హక్కును వివిధ సాకులతో తీసివేయడం రాజ్యాంగం ప్రసాదించిన హక్కును కాల రాయడమే. ఈ ప్రమాదం నుంచి పౌరులు బయటపడాలంటే ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి వయోజన భారతీయుడికి ఓటు వేసే సహజ సిద్ధమైన హక్కు ఉంది. తరతరాలుగా ఇక్కడే నివసిస్తూ, ఓటు వేస్తున్న కుటుంబానికి చెందిన వ్యక్తిని అతను అనర్హుడని పూర్తి ఆధారాలతో నిరూ పించేంతవరకూ, ఈ దేశ పౌరుడిగానే పరిగణించాలి. 

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 326 ఓటింగ్‌కు రాజ్యాంగపరమైన పునాదిని అందించినప్పటికీ, 1950, 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టాలు ఎన్నికల నిర్వహణకు అవసరమైన చట్టబద్ధమైన యంత్రాంగాన్ని సృష్టించాయి. అయితే, దీనికి అసలైన తాత్విక పునాది ఆర్టికల్‌ 19(1)(ఎ)లోని ‘భావప్రకటన స్వేచ్ఛ’లోనే ఉంది. బ్యాలెట్‌ ద్వారా రాజకీయ ఎంపికను వ్యక్తపరచడం కూడా భావప్రకటన స్వేచ్ఛలో అంతర్భాగమే. చారిత్రకంగా చూస్తే, 1947 ఏప్రిల్‌ 21–22 తేదీలలో జరిగిన రాజ్యాంగ నిర్మాణ పరిషత్‌ చర్చల్లో డా‘‘ బి.ఆర్‌. అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌ రామ్‌ ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా ప్రకటించాలని గట్టిగా వాదించారు. అయితే సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, సి. రాజ గోపాలాచారి వంటివారు దీన్ని వ్యతిరేకించారు. అటువంటి నిబంధన విధిస్తే సంస్థానాలు ఇండియన్‌ యూనియన్‌ లో చేరడానికి వెన కాడుతాయని, రాజ్యాంగంలో సార్వజనీన వయోజన ఓటు హక్కు (యూనివర్సల్‌ అడల్ట్‌ ఫ్రాంచైజ్‌)ను చేర్చితే సరిపోతుందని వారు వాదించారు. ‘సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది దానికదే ఒక అంతర్గత ప్రాథమిక హక్కు అంటూ సర్దార్‌ పటేల్‌ స్వయంగా ప్రకటించారు. ఆర్టికల్‌ 326 వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం ఇదే’ అని ఇటీవల సీనియర్‌ రాజకీయ నాయకుడు జైరామ్‌ రమేశ్‌ చెప్పారు. 

ఈ చర్చకు మార్చి 2023 నాటి ‘అనూప్‌ బరన్వాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీం కోర్టు జడ్జి జస్టిస్‌ అజయ్‌ రస్తోగి రాసిన అసమ్మతి (డిస్సెంటింగ్‌) తీర్పుతో మళ్లీ జీవం వచ్చింది. ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా న్యాయమూర్తి స్పష్టంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ద్వారానే ఎన్నికల కమిషనర్లను నియమించాలని సుప్రీంకోర్టు ఈ కేసులో ఆదేశించింది. అయితే ప్రభుత్వం ‘చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ ఇతర ఎలక్షన్‌ కమిషనర్ల చట్టం– 2023’లో ఈ నియామక ప్యానెల్‌ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి పేరు తొలగించి, ఆయన స్థానంలో ప్రధానమంత్రి సూచించిన కేబినెట్‌ మంత్రిని నియమించేలా నిబంధన చేర్చింది. దీంతో ప్రతిపక్ష నాయకుడు ప్యానెల్‌లో ఒంటరిగా, శాశ్వత మైనారిటీగా సభ్యునిగా మిగిలిపోయారు. 

అభ్యర్థుల నేర చరిత్ర, ఆర్థిక ప్రయోజనాలు, నిధుల వనరులను తెలుసుకునే హక్కును అత్యున్నత న్యాయస్థానం గుర్తించిందనీ, బాలెట్‌ రహస్యాన్ని రక్షించిందనీ, ‘నోటా’ను తీసుకొచ్చిందనీ జైరామ్‌ ప్రస్తావించారు. అయినప్పటికీ, ఓటు వేసే ప్రక్రియను మాత్రం కేవలం ఒక మామూలు ‘చట్టబద్ధమైన హక్కు’గానే చూస్తున్నారు. ‘దానిపై ఆధారపడిన మిగతా అన్ని అనుబంధ హక్కులను ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నారు కానీ, వీటన్నింటికీ మూలమైన ప్రధాన ఓటు హక్కును మాత్రం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఓటు హక్కును స్పష్టమైన ప్రాథమిక హక్కుగా మార్చడం వల్ల, వివిధ రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో జరిగినట్లుగా చెబుతున్న ఓటర్ల ఏక పక్ష తొలగింపు నుండి రక్షణ లభిస్తుంది. ఇది ఎన్నికల కమిషన్‌ రోజు వారీ పనితీరుపై సుప్రీంకోర్టు నిఘాను పెంచుతుంది. అధికారంలో ఉన్న రాజకీయ కార్యనిర్వాహక వర్గం ఆదేశాల మేరకు ఎన్నికల కమి షన్‌ పనిచేస్తోందనే విమర్శలు వస్తున్న తరుణంలో, ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా మార్చడం ద్వారానే దానికి అత్యున్నత స్థాయి న్యాయ సమీక్ష, రాజ్యాంగ రక్షణ లభిస్తాయి.

ప్రొ‘‘ మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్‌   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement