సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ‘సర్‌’ పూర్తి | Sir to be completed across the country by September | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ‘సర్‌’ పూర్తి

Jul 18 2026 4:06 AM | Updated on Jul 18 2026 4:06 AM

Sir to be completed across the country by September

95 కోట్ల ఓటర్లకు సేవలందించడం గర్వకారణం: సీఈసీ జ్ఞానేష్‌ కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను సెప్టెంబర్  చివరి నాటికి పూర్తి చేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్‌ కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఇండియా ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెమోక్రసీ అండ్‌ ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఐడీఈఎం)లో దేశంలోని అన్ని రాష్ట్రాల మీడియా ప్రతినిధులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అవగాహన కల్పిస్తూ మీడియా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై వివరించారు.

ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా నిర్వహించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యమని, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో 95 కోట్ల మంది ఓటర్లకు సేవలందించడం గర్వకారణమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 12 లక్షల మంది బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) ఓటర్ల జాబితాల సవరణలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఏటా దేశంలో దాదాపు 8 కోట్ల మంది ఓటర్ల వివరాల్లో మార్పులు చోటుచేసుకుంటాయని, అందువల్ల నిరంతర సవరణ ప్రక్రియ అవసరమన్నారు. 

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు ఓటరు గుర్తింపు కార్డు తప్పనిసరి అన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ ఎన్నికల నామినేషన్‌ తిరస్కరణపై స్పందిస్తూ, నామినేషన్‌ పత్రంలోని ప్రతి కాలమ్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఎన్నికల నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయన్నారు. కోర్టు కేసుల వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినా ఆమె వినియోగించుకోలేదని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి సంబంధించిన రెండు ఓట్ల అంశం కూడా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పూర్తయ్యాక నిబంధనల మేరకు పరిష్కారమవుతుందని జ్ఞానేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement