మరో పదిరోజులు పెంపు
ఆగస్టు 3 వరకు కొనసాగనున్న బీఎల్‌ఓ ఇంటింటి సర్వే
అక్టోబర్ 12న ఓటర్ల తుది జాబితా ప్రచురణ
సవరించిన తేదీలను ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం
కొత్త షెడ్యూల్ వివరాలను అధికారులందరికీ తక్షణమే చేరవేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్చింది. అక్టోబర్ 1, 2026 నాటికి అర్హత సాధించిన ఓటర్ల నమోదు, జాబితా సవరణకు సంబంధించి కొత్త తేదీలను ఖరారు చేస్తూ జూలై 15న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి (సీఈవో) కేంద్ర ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ అధికారిక లేఖ రాశారు. పాత షెడ్యూల్ ప్రకారం బీఎల్‌ఓలు జూలై 24 వరకు ఇంటింటి సర్వే చేయాల్సి ఉండగా ప్రస్తుతం కొత్త షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 3 వరకు చేయనున్నారు. రాష్ట్ర సీఈవో జూలై 15న పంపిన విజ్ఞప్తి మేరకు, అంతకుముందు మే 14న ఇచ్చిన పాత షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు ఈసీఐ స్పష్టం చేసింది. మార్పు చేసిన కొత్త షెడ్యూల్ వివరాలను సంబంధిత అధికారులందరికీ తక్షణమే చేరవేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రజలకు తెలిసేలా అన్ని ప్రచార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని సూచించింది. అదేవిధంగా రాజకీయ పార్టీలకు సైతం సవరించిన తేదీల సమాచారాన్ని లిఖితపూర్వకంగా అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర సీఈవోను ఆదేశించింది. 
ఢిల్లీ, పంజాబ్, కర్ణాటకల్లోనూ..
ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, కర్ణాటకల్లో కొనసాగుతున్న ‘సర్’ప్రక్రియ గడువును సైతం పొడిగిస్తున్నట్లు ఎన్నికల కమిషన్(ఈసీ) బుధవారం తెలిపింది. దీని ప్రకారం ఢిల్లీలో ముసాయి ఓటరు జాబితాను ఆగస్ట్ 5వ తేదీకి బదులుగా ఆగస్ట్ 17వ తేదీన ప్రచురించనుంది. ఇంటింటి సర్వే షెడ్యూల్‌ను జూలై 29వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీకి పొడిగించింది. పంజాబ్‌లో ఇంటింటి సర్వే ఆగస్ట్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక్కడ ముసాయి జాబితాను ఆగస్ట్ 13న ప్రచురించనుంది. అదేవిధంగా, కర్ణాటకలో ఆగస్ట్ 8వ తేదీ వరకు సర్వే చేపడతారు. ముసాయిదా జాబితా ఆగస్ట్ 17వ తేదీన వెలువడనుంది.


