ఎస్సీ గురుకుల సొసైటీలో ఇష్టారీతిన పార్ట్‌టైమ్ పోస్టుల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా 550 గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలకు సొసైటీ అనుమతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని పాఠశాలలు, కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ (పార్ట్ టైమ్ టీచర్లు) ఎంపికపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కాకుండా నియామక అధికారుల్లో కొందరు బంధుప్రీతి, ఇతర అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకొని ఎంపిక చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై మంత్రి కార్యాలయంతోపాటు సొసైటీ కార్యదర్శికి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎంపికపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సొసైటీ పరిధిలో మంజూరైన పోస్టుల్లో ఉన్న ఖాళీలపై జోనల్ అధికారులు లెక్కలు తేల్చారు. కేవలం బోధన కేటగిరీలో 550 ఖాళీలున్నట్టు గుర్తించగా, ఆయా స్థానాల్లో తాత్కాలిక ప్రాతిపదికన అర్హులను ఎంపిక చేసుకోవాలని సొసైటీ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా రీజినల్ కోఆర్డినేటర్లు, జోనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లా స్థాయిలో నోటిఫికేషన్లు జారీ చేసిన అధికారులు అర్హులను గుర్తిస్తున్నారు.
కమిటీలు నామమాత్రమే...
బోధన కేటగిరీ ఉద్యోగాలకు తాత్కాలిక పద్ధతిలోనే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నా, ఎంపిక ప్రక్రియకు నిర్దిష్ట విధానం ఉంది. అర్హత పరీక్షలు లేకున్నా, అభ్యర్థుల డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందుకు జిల్లాల్లో సీనియర్ టీజీటీ, సీనియర్ పీజీటీ, జేఎల్, డీఎల్‌లతో కమిటీలను ఏర్పాటు చేసుకొని నియమించుకోవాలని సొసైటీ కార్యాలయ అధికారులు ఆదేశించారు. కానీ జిల్లాల్లో ఈ కమిటీలు నామమాత్రంగానే ఉన్నాయి. క్షేత్రస్థాయిలో ఆర్సీఓలు, జోనల్ అధికారులే నిర్ణయం తీసుకొని ఎంపిక జాబితాలు రూపొందిస్తున్నారు.
ఇదివరకు పనిచేసిన వారితో ఉన్న పరిచయాన్ని ఆర్సీఓలు, జెడ్‌ఓలు ఆసరాగా చేసుకుంటున్నారని, బంధువులు, పాత పరిచయస్తులను ఎంపిక చేస్తున్నారని అభ్యర్థులు విమర్శిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో పదుల సంఖ్యలో గెస్ట్ ఫ్యాకల్టీని ఇష్టానుసారంగా నియమించుకున్నట్టు మంత్రి పేషీకి ఫిర్యాదులు వచ్చాయి. ఉద్యోగాల సంఖ్య తక్కువగానే ఉండడంతో జిల్లా స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎంపిక చేస్తే విమర్శలకు తావు ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


