ఇన్ బాక్స్
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక భరోసా కల్పించేది పెన్షన్. అయితే ద్రవ్యోల్బణం పెరుగు తున్నకొద్దీ పెన్షన్ విలువ తగ్గిపోకుండా రక్షించేందుకు డియర్‌నెస్ రిలీఫ్ (డి.ఆర్.) పొందే హక్కు పెన్షనర్లకు ఉంది. దీని చెల్లింపును ఆలస్యం చేయడం అంటే పెన్షనర్ల జీవన భద్రతను బలహీన పరచడమే. భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (1983) కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇచ్చే సాయం కాదనీ, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన ఆస్తి హక్కు అనీస్పష్టంగా పేర్కొంది. పెన్షన్‌కు అను బంధమైన డియర్‌నెస్ రిలీఫ్ కూడా అదే సూత్రానికి లోబడి ఉంటుంది.
ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధాప్యంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. కాబట్టి డి.ఆర్.ను సకాలంలో చెల్లించడం సంక్షేమరాష్ట్ర బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు 37.31 శాతం డి.ఆర్. మాత్రమే అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్యోల్బణ సూచికల ప్రకారం 1.7.2024 నుండి 2.73 శాతం, 1.1.2025 నుండి 1.82 శాతం, 1.7.2025 నుండి మరో 2.73 శాతం, 1.1.2026 నుండి మరో 1.82 శాతం పెంపుదల రావలసి ఉంది. ఈ పెండింగ్ శాతం కేవలం గణాంకం కాదు; 3.60 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు కారణం కూడా. ధరల పెరుగుదల, వైద్య వ్యయాలు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బకాయిలు వారి జీవనా«న్ని దెబ్బతీస్తున్నాయి.
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అందుకే డి.ఆర్. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనీ అనవచ్చు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిపాలనా విధానం కాదు. ఈ చెల్లింపు ఆలస్యం చేయరాని బాధ్యత; అమలు చేయవలసిన న్యాయం.
– టి.ఎం.బి. బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


