breaking news
government employe
-
విడుదలలో జాప్యం తగదు!
ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ పొందిన తరువాత ఆర్థిక భరోసా కల్పించేది పెన్షన్. అయితే ద్రవ్యోల్బణం పెరుగు తున్నకొద్దీ పెన్షన్ విలువ తగ్గిపోకుండా రక్షించేందుకు డియర్నెస్ రిలీఫ్ (డి.ఆర్.) పొందే హక్కు పెన్షనర్లకు ఉంది. దీని చెల్లింపును ఆలస్యం చేయడం అంటే పెన్షనర్ల జీవన భద్రతను బలహీన పరచడమే. భారత సుప్రీంకోర్టు డి.ఎస్. నకారా వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (1983) కేసులో పెన్షన్ అనేది ప్రభుత్వం దయాదాక్షిణ్యంతో ఇచ్చే సాయం కాదనీ, ఉద్యోగి తన సేవల ద్వారా సంపాదించిన ఆస్తి హక్కు అనీస్పష్టంగా పేర్కొంది. పెన్షన్‌కు అను బంధమైన డియర్నెస్ రిలీఫ్ కూడా అదే సూత్రానికి లోబడి ఉంటుంది.ఆర్టికల్ 41 ప్రకారం వృద్ధాప్యంలో ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం రాజ్య విధాన నిర్దేశక సూత్రాలలో ఒకటి. కాబట్టి డి.ఆర్.ను సకాలంలో చెల్లించడం సంక్షేమరాష్ట్ర బాధ్యత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు 37.31 శాతం డి.ఆర్. మాత్రమే అమలులో ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్యోల్బణ సూచికల ప్రకారం 1.7.2024 నుండి 2.73 శాతం, 1.1.2025 నుండి 1.82 శాతం, 1.7.2025 నుండి మరో 2.73 శాతం, 1.1.2026 నుండి మరో 1.82 శాతం పెంపుదల రావలసి ఉంది. ఈ పెండింగ్ శాతం కేవలం గణాంకం కాదు; 3.60 లక్షల మంది పెన్షనర్ల కుటుంబాల ఆర్థిక ఇబ్బందులకు కారణం కూడా. ధరల పెరుగుదల, వైద్య వ్యయాలు, మందుల ఖర్చులు, విద్యుత్ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బకాయిలు వారి జీవనా«న్ని దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నదనీ, అందుకే డి.ఆర్. చెల్లింపుల్లో ఆలస్యం జరుగుతోందనీ అనవచ్చు. ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించవలసిన చట్టబద్ధమైన బకాయిలను నిరవధికంగా వాయిదా వేయడం సరైన పరిపాలనా విధానం కాదు. ఈ చెల్లింపు ఆలస్యం చేయరాని బాధ్యత; అమలు చేయవలసిన న్యాయం.– టి.ఎం.బి. బుచ్చిరాజు, ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజినీరింగ్ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
ఒరిజినల్ ప్రామిసరీ నోటు ఉంటే మంచిది ..!
నా భర్త ఆరేళ్ల క్రితం తన కజిన్‌కి 7 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. నెలవారీ వడ్డీ చెల్లించేలా ప్రామిసరీ నోటు కూడా రాయించుకున్నాము. ఆయన కొంతకాలం వడ్డీ ఇచ్చారు కానీ తర్వాత కట్టడం ఆపేశారు. దాంతో మేము కోర్టును ఆశ్రయించాం. కోర్టులో కేసు నడుస్తుండగానే నా భర్త చనిపోయారు. మా వద్ద అప్పు తీసుకున్న వారి తండ్రికి భూములు ఉన్నాయి. మావారు కాలం చేసిన తర్వాత మాకు రావలసిన బాకీ గురించి అడిగాను. అందుకు వారు అంగీకరించకపోగా ‘‘కోర్టులో తేల్చుకుంటాము’’ అంటున్నారు. ప్రామిసరీ నోటు నా పేరు మీదే ఉంది కానీ ప్రస్తుతం నా వద్ద ఒరిజినల్ లేదు. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రామిసరీ నోటు ఒరిజినల్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. ప్రామిసరీ నోటుపై ఉన్న సాక్షులు కూడా ఇప్పుడు డబ్బులు తీసుకున్న వారి వైపే ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడం లేదు సలహా ఇవ్వగలరు. – లత, సత్యసాయి జిల్లాప్రామిసరీ నోటు మీ పేరు మీదే ఉంది అంటున్నారు కాబట్టి కోర్టులో కేసు మీరు నడిపించవచ్చు. మీకు మీ డబ్బులు తిరిగి పొందే హక్కు – వీలూ రెండూ ఉన్నాయి. ఒరిజినల్ ప్రామిసరీ నోటు చాలా ముఖ్యమైన ఆధారం. అయితే అది లేనంత మాత్రాన మీ కేసు తేలకుండా పోదు. వేరే ఆధారాల మీద మీరు కేసు నడిపించాలి. ప్రామిసరీ నోటును ద్వితీయ సాక్ష్యం (సెకండరీ ఎవిడెన్స్)గా తీసుకునే వీలు ఉందా లేదా అనే అంశాన్ని మీ కేసు పూర్వాపరాలు సమీక్షించిన మీ లాయర్ మాత్రమే చెప్పగలరు. మీరు డబ్బులు ఇచ్చారనడానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వంటి ఏదో ఒక సాక్ష్యం ఉన్నా సరిపోతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్తున్నారు. అంతమొత్తంగా డబ్బులు మీకు చెందినవే అనే అంశాన్ని రుజువు చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్కమ్ టాక్స్ డిక్లరేషన్ చేశారా లేదా ప్రభుత్వానికి మీ వద్ద ఉన్న నగదు గురించి డిక్లేర్ చేశారా లేదా అనే అంశాలపై అవతలవారు కేసు నడిచే క్రమంలో అడగవచ్చు. దానికి సమాధానాలు ఇచ్చేందుకు మీరు సిద్ధపడి ఉండాలి. మీరు ఒకవేళ ప్రభుత్వానికి సదరు లావాదేవీ గురించి డిక్లేర్ చేసి ఉన్నట్లయితే ఎలాంటి భయం అవసరం లేదు. ఇదంతా ఎందుకనుకుంటే మధ్యవర్తి ద్వారా మరోసారి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ఉద్యోగిగా మీకు తెలిసే ఉంటుంది. మీరు ఎటువంటి అమ్మకాలు/ కొనుగోలు చేసినా ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి డిక్లేర్ చేయవలసి ఉంటుంది. అధికమొత్తంలో నగదు సేవింగ్స్ రూపంలో ఉన్నప్పటికీ కూడా చెప్పాల్సి ఉంటుంది. మీకు వేరే ఆదాయం ఉంటే అది కూడా డిక్లేర్ చేయడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగిగా ఆర్థిక లావాదేవీలు అధిక మొత్తంలో చేసినప్పుడు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది(న్యాయపరమైన సమస్యలు, సందేహాలకోసం sakshifamily3@gmail.comMకు మెయిల్ చేయవచ్చు. ) -
ఆరోగ్య కారణాలపై ‘పదవీ విరమణ’ నిబంధనలు ఇలా
నిడమర్రు : అనారోగ్య కారణంగా (మెడికల్ ఇన్వాలిడేషన్) పదవీ విరమణకు అనుమతి పొందిన ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ స్థానంలో మరో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం కల్పించబడింది. ఈ తరహా లబ్ధి పొందాలంటే ఉద్యోగి పదవీ విరమణకు కనీసం ఐదేళ్ల సర్వీసు కలిగి ఉండాలి. అలాగే ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారం లేని తీవ్రదుర్భర ప్రత్యేక పరిస్థితులు ఉన్నట్టు నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకానికి అనుమతిస్తారు. ఆ తరహా నియామకానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. 2008 నుంచి అవకాశం అనారోగ్యం కారణం చూపిస్తూ ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం తన వారసులకు పొందే ఒక కేసులో హైకోర్టు అట్టి కారుణ్య నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని 1985లో తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై కారుణ్య నియామకాల పద్ధతిని అప్పటి నుంచి రద్దుపరిచింది. తర్వాత సుప్రీం కోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం మళ్లీ మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్ధతిని 2008 నుంచి మరలా పునరుద్ధరించింది. ఈ నియామకాలకు అర్హులు ♦ కుటుంబ సభ్యులు అనగా ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ 1980లోని రూల్ 50(12బీ) లో నిర్దేశించిన వారై ఉండాలి. ♦ భార్య/భర్త, కుమారులు, కుమార్తెలు, చట్టరీత్యా దత్తత తీసుకున్న కుమారుడు/ కుమార్తె. అయితే అట్టి దత్తత రిటైర్మెంట్కు ముందుగా తీసుకుని ఉండాలి. అవివాహిత లేదా విధవరాలైన లేదా విడాకులు పొందిన కుమార్తె అర్హులు. మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి. సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సుల నిమిత్తం పంపుతారు. జానియర్ అసిస్టెంట్ తత్సమాన పోస్టు, అంతకంటే తక్కువవైన పోస్టులో నియామకం చేయవచ్చు. ♦ మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఉద్యోగి రిటైరైన తేది నుంచి ఏడాది లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ♦ నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, అభ్యర్థికి సంబంధించిన అన్ని వివరాలు ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి. మెడికల్ బోర్డు నివేదిక అందించిన తర్వాత ఉద్యోగ నియామక అధికారం జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్థం పంపాలి. జిల్లా స్థాయి కమిటీలో.. ♦ జిల్లా కలెక్టర్–అధ్యక్షుడు ♦ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి–సభ్యుడు ♦ సంబంధిత జిల్లా శాఖ అధికారి–సభ్యుడు/కన్వీనర్ ♦ శాఖాధిపతి (హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్)కార్యాలయాల్లో పనిచేయు ఉద్యోగులు/ సెక్రటేరియట్ కమిటీ పరిశీలిస్తుంది. ♦ మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం కింద, కారుణ్య నియామకాలు, యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 శాతం మించకూడదు. భార్య, భర్తలు ఇరువురు ఉద్యోగులైన సందర్భంలో కారుణ్య నియామకానికి అవకాశం లేదు. మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేశారు. మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణాలపై) వైద్య ధ్రువపత్రం ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్, కమ్యుటేషన్ అవకాశంలేదు. మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలీడ్ పింఛను ఇస్తారు. ఏ జబ్బుల వల్ల రిటైర్ కావచ్చు ♦ పక్షవాతం, అంతిమ దశలో ఉన్న మూత్రపిండాల రోగం, కాలేయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, మానసిక సంబంధిత వ్యా«ధి, తీవ్రమైన పార్కిన్సన్ జబ్బుకమిటీకి పంపవలసిన వివరాలు ఇలా ♦ మెడికల్ ఇన్వాలిడేషన్ కోరే ఉద్యోగి వివరాలు ♦ ఉద్యోగి పనిచేస్తున్న శాఖ, హోదా, జీతపు స్కేలు ♦ ఏదైనా క్రమశిక్షణ చర్యలు అపరిష్కృతంగా ఉన్నాయా ♦ ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా ♦ సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది ♦ వాస్తవంగా కాలపరిమితి మేరకు పదవీ విరమణ చేయు తేదీ ♦ పదవీ విరమణ కోరే ఉద్యోగికి ఉన్న రోగం ప్రభుత్వ ఉత్తర్వులు జీవో 661 తేదీ 23–1–2008లో తెలిపిన మేరకు కలిగియున్నదా ♦ ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా, అయితే ఏ తేదీ నుండి అట్టి సెలవుపై చికిత్స నిమిత్తం ఉన్నారు. ♦ మెడికల్ బోర్డు సిఫార్సులు(ఒరిజినల్) జతపరిచాలి ♦ శాఖాపర విశ్లేషణ–సిఫార్సులు -
'ప్రతి ప్రభుత్వ ఉద్యోగికీ సొంతిల్లు'
రాజేంద్రనగర్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తామని టీఎన్జీఓ గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.రవీందర్‌రెడ్డి, ఎంఏ. హమీద్ అన్నారు. రాజేంద్రనగర్ మండలం మణికొండ జాగీర్‌లో నిర్మించిన హైద్రాబాద్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (రంగారెడ్డిజిల్లా విభాగం) కార్యాలయాన్ని సోమవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సొంత ఇల్లు అనేది ఉద్యోగి హక్కుగా పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో మాట్లాడతామని హామీ ఇచ్చారు.


