భారతీయ సంస్కృతిలో గురువుకు ఉన్న స్థానం అద్వితీయం. అందుకు ఈ కథ ఒక ఉదాహరణగా చెప్పవచ్చు: ఒక రోజు గురువు, దేవుడు ఇరువురూ కలిసి ఓ వ్యక్తి దగ్గరకు వచ్చారు. వెంటనే అతడు భగవంతుని పాదాలను తాకి నమస్కరించబోయాడు. భగవంతుడు అతణ్ణి ఆపి, ‘ముందు నీ గురువును పూజించు’ అన్నాడు. సరే అని, అతడు గురువును పూజించడం ప్రారంభించాడు. కానీ గురువు ‘శిష్యా, నేను భగవంతుడిని నీ ఇంటికి తీసుకువచ్చాను, కాబట్టి నువ్వు ముందు భగవంతుడిని పూజించాలి’ అన్నారు.
గురువు సలహా విని, శిష్యుడు భగవంతునివైపు తిరిగాడు. ‘నీ జీవితంలోకి భగవంతుడిని తీసుకువచ్చింది నీ గురువే. నన్ను చేరుకోవడానికి సరైన మార్గాన్ని నీకు చూపింది ఆయనే, కాబట్టి నువ్వు ముందు ఆయనను పూజించాలి’ అన్నాడు భగవంతుడు. ‘నేను భగవంతుని వద్దకు మార్గం చూపినప్పటికీ, ప్రతిదానికీ ఆయనే బాధ్యుడు, కాబట్టి నువ్వు ముందు భగవంతుని ఆశీర్వాదం పొందడం మంచిది’ అన్నారు ఈసారి గురువు. దీంతో శిష్యుడు దేవుని ఉద్దేశించి ‘తండ్రీ, గురువుగారు చెప్పేదంతా నిజమే కదా’ అన్నాడు.
అందుకు భగవంతుడు ‘కర్మఫలాలను బట్టి, నేను ఎలాంటి భేదం లేకుండా జనులకు సుఖదుఃఖాలను ఇస్తాను. నేను ఎవరికీ కీడుగానీ, మేలుగానీ చేయను. ప్రతి వ్యక్తికీ వారి కర్మఫలాన్నే ఇస్తాను. కానీ గురువు అలాంటివాడు కాదు. ఆయన పవిత్రుడు. నిరాడంబరుడు. ప్రేమమయుడు. గురువు మార్గదర్శకత్వం కోరిన శిష్యుడిని, అతను ఎలా ఉన్నాడో అలాగే స్వీకరిస్తాడు. నన్ను చేరే మార్గాన్ని అతనికి చూపించి ఆశీర్వదిస్తాడు. అతను ఎలా ఉన్నా సరే సరిదిద్దుతాడు. శిష్యుడి కర్మఫలాల నుండి అతడిని కాపాడుతాడు. అతనితో ఉండి మార్గనిర్దేశం చేస్తాడు. కానీ నేను అలా చేయను. అందువల్ల, గురువే దేవుడి కన్నా ఉన్నతుడు’ అన్నాడు.
– యామిజాల జగదీశ్


