Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం... | Sakshi Guest Column Special Story On Sushila Nayyar Life Story | Sakshi
Sakshi News home page

Sushila Nayyar: గ్రామీణ భారత ఆరోగ్యం కోసం...

Jul 20 2026 1:54 PM | Updated on Jul 20 2026 3:06 PM

Sakshi Guest Column Special Story On Sushila Nayyar Life Story

వైజ్ఞానిక వేగుచుక్కలు–47

స్వాతంత్య్ర సమరయోధగా, రాజకీయ నాయకురాలిగా, త్యాగ శీలిగా ప్రఖ్యాతురాలైన సుశీలా నయ్యర్‌ గొప్ప వైద్యులు కూడా. ప్రస్తుతం పాకిస్తాన్‌లో అంతర్భాగంగా ఉన్న కుంజాలో 1914 డిసెంబర్‌ 26న ఆమె జన్మించారు. న్యూఢిల్లీలోని లేడీ హార్డింజ్‌ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన సుశీల 1939లో గాంధీజీ కార్య దర్శిగా పనిచేసే తన అన్న ప్యారేలాల్‌ను కలవడానికి వార్ధా వెళ్లారు. అక్కడ కలరా సోకినప్పుడు సుశీల ఒక్కరే ఆ మహమ్మారిని లొంగ దీయగలిగారు. ఈ విజయాన్ని గాంధీజీ ఎంతో కొనియాడారు. పిమ్మట బి.సి. రాయ్‌ ఆమెను గాంధీ దంపతుల వ్యక్తిగత వైద్యు లుగా నియమించారు.

క్విట్‌ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీ, కస్తూర్బా దంపతులతో పాటు ఆమె కూడా ఆగాఖాన్‌ భవనంలో బందీగా ఉన్నారు. కస్తూర్బా మరణించిన తర్వాత, 1945లో సేవాగ్రామ్‌లో ‘కస్తూర్బా హాస్పిటల్‌’ను ప్రారంభించారు. అదే ఇప్పుడు ‘మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌’గా అభివృద్ధి చెందింది.

సుశీల ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి 1950లో భారతదేశం తిరిగి వచ్చి ఫరీదాబాద్‌లో ‘ట్యూబర్‌ కులోసిస్‌ శానిటోరియం’ ప్రారంభించారు. ‘గాంధీ మెమోరియల్‌ లెప్రసీ ఫౌండేషన్‌’కు సారథ్యం వహించారు. 1952లో రాజకీయాలలో ప్రవేశించారు. జవహర్‌లాల్‌ నెహ్రూ మంత్రి వర్గంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. ఈ హోదాలో ఢిల్లీలో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీసెస్‌ను ప్రారంభించడంతోపాటు, పలు రోగాల నిర్మూలనకు మౌలికమైన ఆరోగ్య పథకాలు ప్రారంభించారు. 1955లో ఢిల్లీ విధాన సభకు స్పీకర్‌గా ఎంపికయ్యారు.

1962లో రెండవసారి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించి 1967 దాకా గ్రామీణ ప్రాంతాలలో కుటుంబ నియంత్రణ, స్త్రీల, పిల్లల ఆరోగ్యం సంరక్షణా కార్యక్రమాలతో పాటు మలేరియా, సుఖరోగాలు, క్షయ, కుష్టు వంటి వ్యాధుల నిర్మూలనకు పలు పథకాలు చేపట్టారు.  సమాజం పట్ల ఎంతో ఆర్తి ఉన్న సుశీల అవివాహితగానే ఉండిపోయారు. కుటుంబ నియంత్రణ, మద్యపాన నిషేధంలో స్త్రీల పాత్ర గురించి రెండు పుస్తకాలు వెలువరించారు. గాంధీజీ, కస్తూర్బాలకు సంబంధించి మరో ఎనిమిది పుస్తకా లను రచించిన డా‘‘ సుశీలా నయ్యర్‌ 2001 జనవరి 3న సేవాగ్రామ్‌లో గుండెపోటుతో 86 ఏళ్ల వయసులో కనుమూశారు.
– డా. నాగసూరి వేణుగోపాల్‌, ఆకాశవాణి విశ్రాంత ఉన్నతాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement