సంపద... సామాజిక బాధ్యత! | Guest Column Special Story: Corporate Social Responsibility India CSR Law Impact | Sakshi
Sakshi News home page

సంపద... సామాజిక బాధ్యత!

Jul 21 2026 12:45 PM | Updated on Jul 21 2026 12:45 PM

Guest Column Special Story: Corporate Social Responsibility India CSR Law Impact

కంపెనీల రూపంలో వ్యాపారం నిర్వహించడం 1600 సంవత్సరంలో ‘ఈస్ట్‌ ఇండియా కంపెనీ’తో ప్రారంభమైనదని చెప్పవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారు సాధారణంగా సొంత యాజమాన్యంలో లేక భాగస్వామ్యంలో వ్యాపారాలు నిర్వ హిస్తుంటారు. పెద్ద ఎత్తులో వ్యాపారాలు నిర్వ హించాలంటే, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి ‘కంపెనీ’ రూపంలో వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుంది. 19వ శతాబ్దం మధ్య నుంచి కంపెనీల రిజిస్ట్రేషన్‌ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో రిజిస్టర్‌ అయిన కంపెనీల సంఖ్య దాదాపు 28 లక్షలు.

ఎప్పుడైతే కంపెనీలు దేశ ఆర్థిక వ్యవస్థలను శాసించడం మొదలైందో, అప్పుడే వాటి సామాజిక బాధ్యత (కార్పొరేట్‌ సోషల్‌ రెస్సాన్సిబి లిటీ–సీఎస్‌ఆర్‌) గురించి కూడా చర్చమొదలైంది. హోవార్డ్‌ బోవెన్‌ 1953లో మొదటిసారిగా, ‘కార్పొ రేట్ల సామాజిక బాధ్యత’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సామాజిక విలువలకు అనుగుణంగా కంపె నీల నిర్ణయాలు, పాలసీలు ఉండాలనీ, సమాజ అభివృద్ధికి ఆర్థికంగా సహాయపడాలనీ ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ ప్రైజ్‌ గ్రహీత మిల్టన్‌ ఫ్రైడ్‌మ్యాన్‌ మాత్రం చట్టబద్ధంగా వ్యాపారం నిర్వహించి, కంపెనీలను లాభాల బాట పట్టించడం, కంపెనీ వాటాదారుల సంపద పెంచడం మాత్రమే ‘కార్పొరేట్ల సామాజిక బాధ్యత’ అని వాదించారు.

కంపెనీలు సామాజిక బాధ్యతలను కూడా నిర్వహిస్తే, ఆదాయపు పన్ను రాయితీలు, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రపంచ దేశాలు వాటిని ప్రోత్సహిస్తున్నాయి. భారత ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి, కంపెనీ చట్టం–2013 లోని సెక్షన్‌ 135 ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం కంపెనీలకు తప్పనిసరి చేసింది. చట్టంలో పొందుపరచిన సామాజిక బాధ్యతలను నిర్వర్తించకుంటే, అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు మూడేళ్ల వరకు జైలుశిక్షను కూడా నిర్దేశించింది. ఆ విధంగా, ప్రపంచం మొత్తం మీద, శాసనం ద్వారా సామాజిక బాధ్యతలను నిర్వర్తించడం తప్పనిసరి చేసిన మొట్టమొదటి దేశంగా భారత్‌ నిలిచింది. 

తరవాత, 2020లో జైలు శిక్ష స్థానంలో జరి మానాను విధించాలని పార్లమెంటు చట్టాన్ని సవ రించి కంపెనీలకు ఊరట కలిగించింది. సవరించిన చట్టం ప్రకారం, సామాజిక బాధ్యతలకై నిర్దే శించిన ఖర్చు చేయని డబ్బుపై రెండింతల జరి మానా ప్రభుత్వానికి కంపెనీ చెల్లించాలి. అందుకు బాధ్యులైన కంపెనీ అధికారులకు రెండు లక్షల వరకు జరిమానా విధించవచ్చు. ఇంకా, తన సామాజిక బాధ్య తను ఏ పరిస్థితుల్లో నిర్వర్తించ లేకపోయిందో వివరణ ఇవ్వాలి.

లక్ష్యం నెరవేరినట్టే!
గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఐదు కోట్ల రూపాయల లాభం, వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం, 500 కోట్ల రూపాయల నెట్‌వర్త్‌ను కంపెనీలు కలిగి ఉంటే... అవి తమ లాభాల్లో  కనీసం 2 శాతం సీఎస్‌ఆర్‌ కార్యకలాపాలపై ఖర్చు చేయాలి. అది కూడా చట్టం నిర్దేశించిన 12 విభాగాలలో నుంచి ఒక దాన్ని ఎంచుకోవాలి. విద్య, వైద్యం, పర్యావరణం, గ్రామీణాభివృద్ధి, విపత్తు నిర్వహణ వంటివి ఇందులో ఉన్నాయి. సీఎస్‌ఆర్‌పై చేసిన ఖర్చుపై ‘బిజినెస్‌ ఎక్స్‌పెండి చర్‌’ కింద ఆదాయపు పన్ను మినహాయింపు లేదు.

అయితే, ఈ చట్టం చేయకముందే ఎన్నో ఏళ్లుగా, టాటాలు, బిర్లాలు, మరెన్నో కార్పొరేట్‌ సంస్థలు విద్య, వైద్యం లాంటి ఎన్నో సామాజిక విషయాలపై స్వచ్ఛందంగా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాయి. కానీ చట్టం చేసిన తరువాత, గత పదేళ్ళలో కార్పొరేట్‌ సంస్థలన్నీ కలిసి 2 లక్షల కోట్ల రూపాయలకు పైన తమ సామాజిక బాధ్య తను నిర్వర్తించడానికి ఖర్చు చేశాయి. ఇది గర్వించదగ్గ విషయం. న్యాయవ్యవస్థలో, మౌలిక సదుపాయాల కొరత వల్ల కూడా, కేసులు విపరీ తంగా పెండింగ్‌లో ఉన్నాయి. కాబట్టి, న్యాయ వ్యవస్థను కూడా సీఎస్‌ఆర్‌లో 13వ విభాగంగా చేర్చుతూ చట్టాన్ని సవరించాలి.
– హరీష్‌ కుమార్‌ కొలిచాల, న్యాయవాది, రిటైర్డ్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ (లా), యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement