కాపుయువకుడు సాయికృష్ణ లాకప్‌డెత్‌పై విజయవాడ కోర్టులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రైవేటు ఫిర్యాదు
నిర్బంధ లాకప్‌డెత్ సహా వారికి అన్ని విషయాలూ తెలుసు
విచారణకు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదు
అక్రమ నిర్బంధంపై బాధితుడి తల్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
హెబియస్ కార్పస్ దాఖలు చేస్తే.. హైకోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చారు
అక్రమ నిర్బంధాలపై రోజూ నివేదికలు డీజీపీ, కమిషనర్, ఏసీపీలకు వెళతాయి
బాధితుడి కుటుంబాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించిన తరువాతే ప్రభుత్వం స్పందించింది
సాక్షి, అమరావతి: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. సాయికృష్ణ అక్రమ నిర్బంధం, లాకప్ డెత్, మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం.మానసలను నిందితులుగా చేర్చాలంటూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం విజయవాడ 2వ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈపిటిషన్‌లో ఏమని పేర్కొన్నారంటే.. ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 210 ప్రకారం నేరం గురించి ఎవరైనా మేజి్రస్టేట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
మేజిస్ట్రేట్ ఆ ఫిర్యాదును పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా చర్యలు ప్రారంభించవచ్చు. చట్టపరమైన నిషేధం ఉంటే మినహా లోకస్ స్టాండై (కేసు దాఖలు చేయడానికి ఉంటే చట్టపరమైన హక్కు) అనే భావన క్రిమినల్ లాలో లేదని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. బాధితుడికి ఫిర్యాదుదారుడు ‘అపరిచితుడు’ అయినంత మాత్రాన ఫిర్యాదును కొట్టివేయలేరని కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివాహ సంబంధిత నేరాలు, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు లాంటి కొన్నింటికి మినహా హత్య లాంటి తీవ్రమైన నేరాలపై మూడో వ్యక్తి లేదా సామాజిక కార్యకర్త ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. క్రిమినల్ వ్యవహారాల్లో సాంప్రదాయ లోకస్ స్టాండై నిబంధన ఖచ్చితంగా వర్తించదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది’ అని గురుమూర్తి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసుల అరాచకాలను ఉపేక్షించొద్దని సుప్రీం చెప్పింది
‘విధి నిర్వహణలో అనుకోకుండా జరిగే పొరపాట్లకు బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 218 కింద ప్రభుత్వ అధికారులకు రక్షణ ఉంటుంది. కానీ చట్టవిరుద్ధమైన, ఉద్దేశపూర్వక తీవ్ర నేరాలు, హింస, కస్టడీ హత్యలు లాంటివి ప్రభుత్వ అధికారిక విధుల కిందకు రావు. ఇదే విషయాన్ని పలు తీర్పుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, విజయవాడ సౌత్‌జోన్ ఏసీపీ మానసల నేరపూరిత చర్యలకు సెక్షన్ 218 కింద రక్షణ లభించదు. వారి ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ ముందస్తు అనుమతి అవసరం లేదు. విచారణ సమయంలో లేదా కస్టడీలో చిత్రహింసలు, అమానుష ప్రవర్తన రాజ్యాంగ విరుద్ధం. లా కమిషన్ ఆఫ్ ఇండియా తన 113వ నివేదికలో కస్టడీ గాయాల విషయంలో బాధ్యత పోలీసులపైనే ఉంటుందని పేర్కొంది. లాకప్‌డెత్‌లు నాగరిక సమాజానికి తీవ్రమైన ముప్పు అని, పోలీసుల అరాచకాలను ఉపేక్షించరాదని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టం చేసింది.
ఫిర్యాదు చేసినా డీజీపీ, కమిషనర్ పట్టించుకోలేదు
సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఏ కోర్టులోనూ ప్రవేశపెట్టలేదని, కస్టడీలోనే చంపేసే అవకాశం ఉందని, వెంటనే జోక్యం చేసుకోవాలని డీజీపీ, కమిషనర్‌లకు తల్లి విజయలక్ష్మీ ఫిర్యాదు చేశారు. డీజీపీ, కమిషనర్ పట్టించుకోకపోవడంతో విజయలక్ష్మీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. సాయికృష్ణను తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడో తెలియదని, ఆచూకీ కోసం టీమ్‌లు ఏర్పాటు చేశామని పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. సాయికృష్ణ పోలీసుల చిత్రహింసల వల్ల మరణించాడని, అధికారులు నిజాన్ని దాస్తున్నారని విజయలక్ష్మీ తరఫు న్యాయవాది వాస్తవాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు’ అని పిటిషన్‌లో నివేదించారు.
వైఎస్ జగన్ పరామర్శ తరువాతే ప్రభుత్వం దిగొచ్చింది
‘మాజీ సీఎం వైఎస్ జగన్ 18.06.2026న బాధితుడి ఇంటికి వెళ్లి అతడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 19.06.2026న పోలీసులు కేసు నమోదు చేసి కృష్ణలంక సీఐ నాగరాజును నిందితుడిగా చేర్చారు. తర్వాత సిట్‌ను ఏర్పాటు చేశారు. సాయికృష్ణ లాకప్‌డెత్ వ్యవహారాన్ని డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలు ఉద్దేశపూర్వకంగానే కప్పిపుచ్చారు. 5.6.26న టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకురావడం, అక్రమ నిర్బంంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేసి చంపడం, సీసీటీవి హార్డ్ డిస్‌్కలను మార్చడం, మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, ఫోన్‌ను గోవాకు పంపి తప్పుదోవ పట్టించడం లాంటి వాటి వెనుక ఉన్నతాధికారుల కుట్ర ఉంది. సాయికృష్ణ లాకప్‌డెత్ వారి సహకారంతోనే జరిగింది’ అని గురుమూర్తి తన ఫిర్యాదులో స్పష్టం చేశారు.
టాస్క్ ఫోర్స్ ను పంపింది రాజశేఖరబాబు, మానసనే
‘సీఐ నాగరాజు కోరిక మేరకు పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, ఏసీపీ మానసలు సాయికృష్ణను పట్టుకోవడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీమ్‌ను పంపారు. టాస్క్ ఫోర్స్ అధికారులు 5.6.2026 రాత్రి ప్రకాశం జిల్లా మార్కాపురంలో సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని సెంట్రీ కానిస్టేబుల్ సాగి పవన్ కుమార్‌కు అప్పగించారు. ఇదంతా పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మానసలకు స్పష్టంగా తెలుసు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ ముగ్గురిదీ నేరపూరిత కుట్రే
‘అంతా తెలిసీ, సాయికృష్ణ ఆచూకీ తెలియదని హైకోర్టుకు తప్పుడు వివరాలు సమర్పించారు. తద్వారా నేరాన్ని కప్పిపుచ్చి, నిందితులను కాపాడే కుట్ర పన్నారు. సాయికృష్ణ లాకప్‌డెత్ విషయంలో డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలది కేవలం నిర్లక్ష్యమే కాదు.. నేరస్థులను కాపాడటానికి, సాక్ష్యాలను నాశనం చేయడానికి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. ఉన్నతాధికారులుగా నేరాన్ని నిరోధించకుండా లాకప్‌డెత్‌కు సహకరించారు. అక్రమ నిర్బంంధానికి అనుకూలంగా వ్యవహరించడం, చట్టపరమైన విధులు నిర్వర్తించడంలో విఫలమై బాధితుడికి తీవ్ర హాని కలిగించడం, నిందితులను శిక్ష నుంచి కాపాడేందుకు సాక్ష్యాలను మాయం చేయడం, తప్పుడు సమాచారం ఇవ్వడం లాంటి నేరాలకు పాల్పడ్డారు. వీటన్నింటి దృష్ట్యా ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, పోలీస్ కమిషనర్, ఏసీపీలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి’ అని నివేదించారు.
డీజీపీ, కమిషనర్‌కు రోజూ అక్రమ నిర్బంధాల నివేదికలు
‘ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఆ స్టేషన్ సిబ్బందితో లేదా ర్యాంకులతో సంబంధం లేకుండా, స్పెషల్ బ్రాంచ్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ లేదా కానిస్టేబుల్ ఉంటారు. వీరు ఆ పోలీస్ స్టేషన్‌లో జరిగే రోజువారీ కార్యకలాపాలను, చట్టబద్ధ, అక్రమ నిర్బంంధాలను పర్యవేక్షిస్తూ ఉంటారు. వీరు డైలీ స్టేటస్ రిపోర్ట్ తయారు చేసి ఏసీపీ ద్వారా ఆ జోన్ డీఎస్‌పీకి పంపుతారు. డీఎస్‌పీ దానిని కమిషనర్, డీజీపీ, రాష్ట్ర నిఘా వర్గాలకు పంపిస్తారు. అక్రమ నిర్బంంధాల గురించి ఈ విధమైన నివేదికలు డీజీపీ, పోలీసు కమిషనర్ ఇద్దరికీ వెళ్తాయి. కాబట్టి సాయికృష్ణ అక్రమ నిర్బంధం విషయం వారి దృష్టిలో ఉందన్న విషయం స్పష్టమవుతోంది’ అని గురుమూర్తి వివరించారు.
లాకప్‌డెత్ గురించి డీజీపీ, కమిషనర్‌కు తెలుసు
‘కమిషనర్ రోజూ ఉదయం తన కమిషనరేట్ పరిధిలోని డీసీపీ, ఏసీపీలతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఈ సమావేశంలో స్పెషల్ బ్రాంచ్, సంబంధిత పోలీస్ స్టేషన్ల నుంచి అందిన సమాచారం ఆధారంగా అదుపులోకి తీసుకున్న వ్యక్తుల గురించి, నిర్బంంధాల వివరాలను కమిషనర్‌కు వివరిస్తారు. తర్వాత రాష్ట్రంలోని కమిషనర్లందరూ డీజీపీతో సమావేశాన్ని నిర్వహిస్తారు. ఆయా పోలీస్ స్టేషన్లలో ఉన్న నిర్బంంధాలు, అక్రమ నిర్బంంధాల సమాచారాన్ని డీజీపీకి నివేదిస్తారు. ఈ నేపథ్యంలో సాయికృష్ణ అక్రమ నిర్బంధం గురించి, ఆ తరువాత లాకప్‌డెత్ గురించి డీజీపీ, కమిషనర్, ఏసీపీలకు ప్రత్యక్ష, పరోక్ష సమాచారం ఉంది’ అని తిరుపతి ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.


