అభిప్రాయం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ చర్చలలో ద్రవ్యలోటు, మూలధన వ్యయం, రాబడి, సబ్సిడీలు, రుణానికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యత పెరిగింది. కానీ అభివృద్ధి చెందిన దేశాలలో జియో స్పేషియల్ డేటా అందుబాటులో ఉండి, అన్ని ప్రాంతాలకు అవసరమైన నిధులు శాస్త్రీయంగా నిర్ణయించబడుతుండగా, ఈ స్థితి భారత్‌లో పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. సుస్థిరాభివృద్ధికి తోడ్పడే బడ్జెట్‌ను రూపొందించాలంటే ‘స్పేషియల్ బడ్జెటింగ్’ను పూర్తి స్థాయిలో అమలు చేయాలి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సహజ వనరుల, మౌలిక సౌకర్యాల లభ్యత, భూవినియోగ మార్పులు, పర్యావరణం, వాతావరణ మార్పులను విశ్లేషించి నిధులు కేటాయించే ‘స్పేషియల్ ప్రణాళిక ఆధారిత బడ్జెట్’ రూపకల్పన అత్యవసరం.
ఎందుకు అవసరం?
దేశంలోని కొన్ని రాష్ట్రాలు జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారిత బడ్జెట్ రూపకల్పనను పూర్తి స్థాయిలో అమలు చేయక పోయినా– గ్రామీణాభివృద్ధి, భూరికార్డులు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మౌలిక సౌకర్యాలు, రవాణా, ప్రజారోగ్యం, పర్యావరణం, నీటి వన రుల యాజమాన్యంలో ఈ సాంకేతికతను ఉపయోగిస్తున్నాయి. స్పేషియల్ విశ్లేషణతో కూడిన బడ్జెట్‌ను రూపొందించినట్లయితే భౌగోళికంగా నిర్లక్ష్య పరచబడిన ప్రాంతాలకు అదనపు పెట్టుబడులు సమకూరి ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ ప్రభుత్వాలు రాజకీయంగా ప్రభావశీల నియోజకవర్గాలు, ఇప్పటికే మౌలిక సౌకర్యాలు లభ్యమయ్యే ప్రాంతాలకు అధిక నిధులు కేటాయించే పరిస్థితి ఉన్నందువలన సామాజిక, ఆర్థిక లక్ష్యాల సాధనలో భారత్ వెనుకబడి ఉంది. బిగ్ డేటా అనలటిక్స్, జి.పి.ఎస్, మెషిన్ లెర్నింగ్, డ్రోన్ సర్వీస్, రిమోట్ సెన్సింగ్,ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ ఆధారిత జియోస్పేషియల్ ప్లాట్‌ఫామ్స్ లాంటి సాంకేతికతను అభివృద్ధి చెందిన దేశాలలో వినియోగిస్తుండటం వల్ల ఆధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ఒడ్జెట్ రూప కల్పనలో తీసుకోగలుగుతున్నాయి. బడ్జెట్ వ్యయ నాణ్యత, సమర్థ తను పెంచే కీలక సంస్కరణగా స్పేషియల్ బడ్జెటింగ్ రూపొందింది.
జనాభా లెక్కల గణాంకాలు, సామాజిక–ఆర్థిక సూచికలు, ఉపాధి గణాంకాలు, బహుమితీయ పేదరిక సూచీలను అనుసంధా నించడం ద్వారా పేదరిక తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలు వివిధ ప్రాంతాలకు నిధులను సమర్థవంతంగా కేటాయించగలవు. వెనుక బడిన ప్రాంతాలకు అదనపు మద్దతునిచ్చే విషయంలో స్పేషియల్ విశ్లేషణ ప్రభుత్వాలకు ఉపకరిస్తుంది. పునరుత్పాదక శక్తి ప్రణాళిక ఆధారంగా శక్తి రంగానికి, మురికి వాడల గుర్తింపు ద్వారా హౌసింగ్ రంగానికి, పాఠశాలల అందు బాటు, మౌలిక వసతుల తేడాను బట్టి విద్యా రంగానికి, వివిధ జబ్బుల మ్యాపింగ్, ఆసుపత్రులు ఉన్న ప్రదేశాలను బట్టి ఆరోగ్య రంగానికి నిధుల కేటాయింపునకు ‘స్పేషియల్ విశ్లేషణ’ ఉపకరిస్తుంది. భూరికార్డుల యాజమాన్యం, వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, నీటి వనరుల యాజమాన్యం, వరదల మ్యాపింగ్‌లో జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌ను తెలంగాణ ఉపయోగిస్తుండగా; పట్టణాభివృద్ధి, సహజ వనరుల పర్యవేక్షణలో కర్ణాటక; మౌలిక సౌకర్యాలు, గవర్నెన్స్‌లో మహారాష్ట్ర; మౌలిక వసతులు, అభివృద్ధి ప్రణాళిక విష యంలో ఉత్తరప్రదేశ్ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నాయి.
తక్కువగా ఉండటానికి కారకాలు
అనేక రాష్ట్రాల్లో జి.ఐ.ఎస్. ఆధారిత బడ్జెట్ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమలులో లేదు. కొన్ని శాఖలు తమ డేటాను ఇతర శాఖలతో పంచుకోక పోవడం వలన సమగ్ర డేటా సమన్వయం క్లిష్టంగా మారింది. కొన్ని రాష్ట్రాలలో డిజిటల్ భూరికార్డులు అందు బాటులో ఉండగా, కొన్నింట ఇప్పటికీ పాత రికార్డులే వినియోగంలో ఉన్నాయి. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, అస్సాం, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల భూరికార్డుల డిజిటలైజేషన్ పాక్షికంగా ఉండి, ఇంకా పూర్తిస్థాయిలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సాధ్యం కావడం లేదు. ప్రణాళిక, ఆర్థిక శాఖల మధ్య సరైన సహకారం లేక పోవడం కూడా జి.ఐ.ఎస్.ను పూర్తి స్థాయిలో వినియోగించుకోకపోవడానికి కారణం. ఆధునిక సాంకేతిక సాధనాలైన కృత్రిమ మేధ, రిమోట్ సెన్సింగ్, మెషిన్ లెర్నింగ్, శాటిలైట్ ఎనర్జీ, జీపీఎస్, డ్రోన్ సర్వేలు, బిగ్ డేటా అనలిటిక్స్ వినియోగంలో సమస్యల నెదుర్కో వడం వలన స్పేషియల్ విశ్లేషణ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యం కావడం లేదు. కొన్ని విశ్వవిద్యాలయాలు మాత్రమే నూతన సాంకేతికతకు సంబంధించిన సమన్వయం చేసిన కోర్సులను అందించడం, నైపు ణ్యత కల్గిన శ్రామిక శక్తి తక్కువగా ఉండటం అకడమిక్ ప్రాజెక్టులను రూపొందించడానికే ఈ సాంకేతికత పరిమితమై స్థానిక గవర్నెన్స్ సమస్యల నివారణపై దృష్టి కేంద్రీకరించడం లాంటి అంశాలు స్పేషియల్ బడ్జెటింగ్ అమలుకు అవరోధంగా నిలిచాయి.
ద రోడ్ అహెడ్
దేశంలోని సుమారు 806 జిల్లాలలో 112 జిల్లాలను ఆకాంక్ష జిల్లాలుగా, 329 జిల్లాలలోని 513 బ్లాక్‌లను ఆకాంక్ష బ్లాక్‌లుగా గుర్తించడం జరిగింది. ఆర్థిక సమ్మిళితం, పౌష్టికాహారం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సౌకర్యాల లభ్యతలు, పేదరికం ఆధారంగా వెనుకబడిన జిల్లాలను గుర్తించడం జరిగింది. బిహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లోని కొన్ని జిల్లాలలో బ్యాంకింగ్ సౌకర్యాల అందుబాటు తక్కువగా ఉండటం, నీటి పారుదల, డిజిటల్ కనెక్టివిటీ లాంటి సమస్యలు ఉన్నాయి. దేశంలోని వివిధ జిల్లాలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి నివారణకు బడ్జెట్‌లో ప్రాధాన్యతనిచ్చే క్రమంలో స్పేషియల్ విశ్లేషణ అవసరం.
సామాజిక, ఆర్థిక పర్యావరణ గణాంకాలతో భౌగోళిక సమా చారాన్ని అనుసంధానపరచడం ద్వారా ప్రభుత్వాలు వనరుల పంపిణీని సమర్థవంతంగా నిర్వహించగలవు. స్పేషియల్ బడ్జెటింగ్‌ను పూర్తిగా అమలు చేయగలిగినపుడు అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో ఒకే విధ మైన జియోస్పేషియల్ డేటాప్లాట్‌ఫామ్ సాధ్యమై అధిక నాణ్యతతో కూడిన స్పేషియల్ డేటాసెట్ లభ్యమవుతుంది. తద్వారా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాల మధ్య పటిష్టమైన సహకారం పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో మాదిరి ఆధునిక సాంకేతికత వినియోగంలో భాగంగా కార్యక్రమాలను సమన్వయపరచినట్లయితే సమీప భవిష్యత్తులో స్పేషియల్ ఆధారిత బడ్జెట్ రూపకల్పన సాధ్యమై సుస్థిరాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
డా‘‘ తమ్మా కోటిరెడ్డి
వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు


