గోల్కొండ: గోల్కొండ జగదాంభిక మహంకాళీ అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలలో భాగంగా గురువారం మొదటి బోనం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి దర్శనానికి భక్తులు ఉదయం 6 గంటల నుంచే గోల్కొండ కోటకు తరలివచ్చారు. కోట మెయిన్ గేటు వద్ద భారీగా చేరిన భక్తులను అతికష్టం మీద పోలీసులు ఒకొక్కకరిని కోటలోకి పంపారు. రాష్ట్ర సంస్కృతిక శాఖ వారు ప్రత్యేకంగా తయారు చేసిన విగ్రహాలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కోట చౌరస్తా వద్ద ఓ వైపు శివసత్తులు, మరో వైపు పోతరాజులు పోటాపోటీగా విన్యాసాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. రిసాల బజార్ నుంచి బి.శ్రీకాంత్‌చారి ఆధ్వర్యంలో రోబోటిక్ అంబారీపై అమ్మవారి మూర్తి ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవర శ్రీనివాస్, గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేందర్‌రెడ్డి అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు.
జగదాంబకు బంగారు బోనం
సప్త మాతృకలకు సప్త బంగారు బోనం పూజా కార్యక్రమాలు గురువారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబ అమ్మవారికి మొదటి బంగారు బోనంతో పాటు పట్టు వ్రస్తాలు, ఒడి బియ్యం సమర్పించారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉçత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ చైర్మన్ మల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో జోగిని అవిక బోనమెత్తారు.
హరిబౌలిలోని బంగారు మైసమ్మ దేవాలయంలో బంగారు పాత్రకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఊరేగింపు నిర్వహించారు. లంగర్‌హౌజ్ వద్ద స్వాగత వేదికపై నుంచి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలు బంగారు బోనానికి ఘన స్వాగతం పలికారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి మాజీ చైర్మన్లు గాజుల అంజయ్య, పొటేల్ సదానంద్, రాకేష్ తివారి, జనగామ మధుసూదన్ గౌడ్, ప్రవీణ్‌కుమార్ గౌడ్, పొటేల్ శ్రీనివాస్ యాదవ్, బల్వంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
గోల్కొండ కోటలో గురువారం నగర సీపీ సజ్జనర్ పర్యటించారు. జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల నేపథ్యంలో ఆయన ఏసీపీ సయ్యద్ ఫయాజ్, సిబ్బందితో కలిసి అమ్మవారి దేవాలయానికి వెళ్లే మార్గాన్ని పరిశీలించారు. బోనాలతో వచి్చన మహిళలతో ముచ్చటించారు. ప్రశాంత వాతావరణంలో వేడుకగా బోనాల పండుగను జరుపుకోవాలని ఆకాక్షించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
కోటకు బయలెల్లిన అమ్మవారు
లంగర్‌హౌస్ చౌరస్తా వద్ద మంత్రులు అమ్మవారికి తొట్టెల, పట్టు వ్రస్తాలు సమర్పించగా అమ్మవార్ల సోదరుడు పోతరాజులు చెర్నకోలలను జులుపుతు నృత్యాలు చేస్తు ఊరేగింపును కోట వైపు తీసుకువెళ్లారు. చోటాబజార్‌లో పూజారి అనంతచారి ఇంట్లో అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు.
అనంతరం అమ్మవారి ఉత్సవ మూర్తులతో పాటు శివరాజ్ స్వామి బంగారు పల్లకిని తలపై మోపుకొని ఊరేగింపు కోటపై వెలసిన జగదాంబ ఆలయానికి సాగింది. డీసీపీ రాఘవేందర్ రెడ్డి, ఏసీపీ సయ్యద్ ఫయాజ్, రాజు వస్తాద్, నాగన్న అమ్మవార్లకు పూజలు నిర్వహించారు.


