నిందితుడి అరెస్టుకి 'మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారం.. | Three Mumbai Based Accused Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

నిందితుడి అరెస్టుకి 'మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారం..

Jul 17 2026 10:05 AM | Updated on Jul 17 2026 10:40 AM

Three Mumbai Based Accused Arrested In Hyderabad

ఏఐ-ఇమేజ్‌

అక్కడి ఫారెక్స్‌ సంస్థ ఉద్యోగులను నిర్బంధించిన ముఠా

తుపాకీతో బెదిరించి ఇక్కడ రూ.55 లక్షలు తీసుకున్న గ్యాంగ్‌

కేసు నమోదు చేసిన వకోల పోలీసుస్టేషన్‌ అధికారులు

దర్యాప్తు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ యూనిట్‌–8కు చెందిన బృందం

హైదరాబాద్‌లో ముగ్గురు నిందితుల అరెస్టు, పరారీలో ఇద్దరు

సాక్షి, హైదరాబాద్‌: బాలీవుడ్‌తో సంబంధాలున్నట్లు నమ్మించి, ఫారెక్స్‌ వ్యాపారికి చెందిన ముగ్గురు ఉద్యోగులను  మోసం చేసి, ముంబైలో నిర్భంధించిన ఓ ముఠా వారి యజమాని నుంచి రూ.55 లక్షలు వసూలు చేసింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్‌లోని తన అనుచరుడికి ఇచ్చేలా చేసి బందీలను వదిలి పారిపోయి వచ్చింది. దీనిపై ముంబైలోని వకోల పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కాగా... దర్యాప్తు చేసిన క్రైమ్‌ బ్రాంచ్‌ యూనిట్‌–8 అధికారులు సోమవారం హైదరాబాద్‌లో దాడులు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి మంగళవారం ముంబైకి తరలించారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం ముంబైతో పాటు సిటీలోనూ గాలిస్తున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి ఓ నిందితుడి చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ టాటూనే కీలక ఆధారమైంది.

బాలీవుడ్‌ ఫైనాన్సియర్లుగా నమ్మించి...
ఢిల్లీకి చెందిన మయాంక్‌ శర్మ అలియాస్‌ లడ్డూ కొన్నేళ్లుగా ముంబైలో ఉంటున్నాడు. తాను బాలీవుడ్‌కు చెందిన ఫైనాన్సియర్‌ కృష్ణగా వకోల ప్రాంతానికి చెందిన ఫారెక్స్‌ వ్యాపారిని పరిచయం చేసుకున్నాడు. దేశవిదేశాల్లో జరిగే షూటింగ్స్‌ను అవసరమైన నగదు అందిస్తూ ఉంటానని, తనతో కలిసి పని చేస్తే భారీ లాభాలు ఉంటాయని చెప్పాడు. ఫారెక్స్‌ వ్యాపారి ఇది నమ్మడంతో ఈ నెల 8న అతడిని సంప్రదించిన మయాంక్‌ హైదరాబాద్‌లో ఓ సినిమా షూటింగ్‌ జరుగుతోందని, దాని నిర్మాతకు అక్కడ రూ.55 లక్షలు ఇవ్వాల్సి ఉందని చెప్పాడు. ఆ మొత్తాన్ని తాను ముంబైలో అప్పగిస్తానని నమ్మబలికాడు. దీనికి అంగీకరించిన వ్యాపారి ముంబైలో నగదు తీసుకునే బాధ్యతల్ని తన ఉద్యోగి ఖుష్‌పాల్‌ మోహన్‌ సింగ్‌కు అప్పగించాడు.

ఓ ఫ్లాట్‌లో నిర్భంధించి, బెదిరించి...
ఈ నెల 9న ఖుష్‌పాల్‌ను సంప్రదించిన మయాంక్‌ ఆ రోజు మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు కలీనా ప్రాంతంలోని సీఎస్‌టీ రోడ్డులో ఉన్న నవరత్న భవనానికి రావాలని సూచించాడు. అందులోని రూమ్‌ నం.901లో తాను బస చేశానని, వస్తే రూ.55 లక్షలు ఇస్తానని, వెంటనే హైదరాబాద్‌లో డెలివరీ చేయాల్సి ఉంటుందని చెప్పాడు దీనికి అంగీకరించిన ఖుష్‌పాల్‌ తన సహోద్యోగులు విక్రమ్, మహావీర్‌లతో కలిసి అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ తన అనుచరులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన మజీద్‌ ఖాన్‌ అలియాస్‌ మన్ను,  థానే నివాసి ఆకాశ్‌ అగర్వాల్‌ అలియాస్‌ కబీర్‌లతో కలిసి వేచి ఉన్న మయాంక్‌ ఆ ముగ్గురినీ నిర్భంధించాడు. ఇక్కడ రూ.55 లక్షలు ముట్టినట్లు తమ యజమానికి ఫోన్‌ చేసి చెప్పాలని, అలా కాకుంటే చంపేస్తామంటూ తుపాకీతో బెదిరించారు. దీంతో ఖుష్‌పాల్‌ అలానే చేశాడు.

నగరానికి పారిపోయి వచ్చిన గ్యాంగ్‌...
ఇది నమ్మిన ఫారెక్స్‌ సంస్థ యజమాని హైదరాబాద్‌లో వేచి ఉన్న ఇద్దరు మయాంక్‌ అనుచరులకు రూ.55 లక్షలు అందేలా చేశాడు. నగదు ముట్టినట్లు ఖరారు చేసుకున్న ఆ ముగ్గురూ బందీలను వదిలిపెట్టి హైదరాబాద్‌ పారిపోయి వచ్చేశారు. తన అనుచరుల నుంచి నగదు తీసుకుని, వారి కొంత ఇచ్చి ముంబై పంపేశారు. మయాంక్, మజీద్, ఆకాశ్‌ మాత్రం కొన్నాళ్లు షెల్టర్‌ తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడి ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. ఖుష్‌పాల్‌ ద్వారా జరిగిన విషయం తెలుసుకున్న ఫారెక్స్‌ వ్యాపారి దీనిపై వకోల పోలీసులకు ఫిర్యాదు చేయించారు. ఆ ఠాణాలో కేసు నమోదు కాగా... ఈ గ్యాంగ్‌ కోసం క్రైమ్‌ బ్రాంచ్‌ యూనిట్‌–8కు చెందిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీకాంత్‌ సాలుంఖే నేతృత్వంలోని టీమ్‌ దర్యాప్త చేపట్టింది.

‘మమ్మీ–డాడీ’ టాటూని చూసి...
ఈ బృందం నవరత్న భవనానికి వెళ్లి అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించింది. అందులో దుండగుల కదలికలు రికార్డు కాగా... ఆకాశ్‌ చేతిపై ఉన్న ‘మమ్మీ–డాడీ’ అనే టాటూని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు గమనించారు. అతడిపై గతంలోనూ కొన్ని కేసులు ఉండటంతో అధికారులు వెంటనే అతడిని గుర్తించారు. ఎక్కడ ఉన్నాడనే అంశాన్ని సాంకేతికంగా ఆరా తీయగా హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. దీంతో సోమవారం సిటీకి చేరుకున్న ప్రత్యేక బృందం గెస్ట్‌హౌస్‌పై దాడి చేసి ఆకాశ్‌తో పాటు మయాంక్, మజీద్‌లను పట్టుకుంది. వీరిని మంగళవారం ముంబై తరలించి కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారిస్తోంది. పరారీలో ఉన్న అజీజుద్దీన్‌ ఖాన్, గంగా రాజీవ్‌ కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement