నేటి నుంచి ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్
19 వరకూ ఆప్షన్లకు అవకాశం
ఈ నెల 22న సీట్ల కేటాయింపు
మొదటి విడతలో చేరని విద్యార్థులు 19,325
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సెలింగ్ ఈ నెల 17న మొదలవుతుంది. విద్యార్థులు ఇదే రోజు నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అయితే మొదటి దశలో స్లాట్ బుక్ చేసుకున్న వారు కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. 18న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 18, 19 తేదీల్లో ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ నెల 22న రెండో దశ సీట్ల కేటాయింపు ఉంటుంది. మొదటి విడతలో సీట్లు వచ్చి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థులు కూడా రెండో దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అయితే, వీరికి తొలి విడత కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు ఉండదు. ఇప్పటికే కాలేజీ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులకు రెండో విడతలో అంతకన్నా మంచి కాలేజీ, బ్రాంచీ వస్తే చేరవచ్చు.
అలా రాని పక్షంలో తొలి దశలో వచ్చిన కాలేజీలోనే చేరేందుకు అవకాశం ఉంటుంది. విద్యార్థులు చెల్లించిన ఫీజు పూర్తిస్థాయి కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకూ సాంకేతిక విద్యా మండలి ఖాతాలోనే ఉంటుంది. అంతిమంగా కాలేజీలో నేరుగా రిపోర్టు చేసిన తర్వాత మాత్రమే ఫీజు కాలేజీకి వెళ్తుంది. తొలి దశలో కాలేజీ ఫీజు చెల్లించినప్పటికీ, రెండో విడత మంచి సీటు వస్తే... కాలేజీకి నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. ఉదాహరణకు మొదటి దశలో వచ్చిన కాలేజీ ఫీజు రూ. లక్ష ఉంటే, రెండో దశలో వచ్చిన కాలేజీ ఫీజు రూ.1.20 లక్షలు ఉందనుకుంటే, మిగిలిన మొత్తా న్ని విద్యార్థి చెల్లించాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ అర్హత ఉంటే, దాన్ని కన్వీనర్ కోటా కేటాయింపులోనే తగ్గించి, కట్టాల్సిన ఫీజును తెలియజేస్తారు.
రెండో దశలో సీట్లు పెరిగే అవకాశం
కొన్ని కాలేజీలు పలు బ్రాంచీల్లో సీట్లు తగ్గించుకుని, ఇతర బ్రాంచీల్లో సీట్ల పెంపునకు దరఖాస్తు పెట్టుకున్నాయి. దీంతో మలి విడత కౌన్సెలింగ్‌లో 500 సీట్ల వరకూ కంప్యూటర్ కోర్సుల్లో పెరిగే అవకాశం ఉంది. అయితే, న్యాక్ గుర్తింపును ప్రామాణి కంగా తీసుకోవడంతో పెరిగే సీట్లన్నీ టాప్–10 కా లేజీల్లోనే ఉండే వీలుంది. రాష్ట్రవ్యాప్తంగా 176 కాలేజీల్లో 88,053 సీట్లు కన్వీనర్ కోటా పరిధిలో ఉండగా, 79,891 సీట్లను కేటాయించారు. మిగిలినవి 8162. తొలిదశలో సీటు వచ్చినా సెల్ఫ్ రిపోరి్టంగ్ చే యని విద్యార్థులు 19,325 మంది. తొలి దశలో కేటాయించకుండా మిగిలిన 8,162 సీట్లను కలుపుకుంటే, రెండో దశలో 27,487 సీట్లు అందుబాటు లో ఉంటాయి. కొత్తగా పెరిగే సీట్లు వీటికి అదనం.
కంప్యూటర్ కోర్సుల్లో ఎక్కువ రిపోర్టింగ్
కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఏఐఎంఎల్ వంటి కోర్సుల్లో సీట్లు వచ్చిన విద్యార్థులు చాలా వరకూ రిపోర్టింగ్ చేశారు. అయితే, మంచి కాలేజీల్లో సీట్లు రాని వారు మాత్రం రిపోరి్టంగ్‌కు ఇష్టపడలేదు. ఈ బ్రాంచీల్లో మొత్తం 62,509 సీట్లు అందుబాటులో ఉంటే, 58,376 సీట్లను కేటాయించారు. వీరిలో 85 శాతం రిపోరి్టంగ్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఎలక్ట్రానిక్స్ దాని అనుబంధ బ్రాంచీల్లో 17,054 సీట్లు ఉంటే, 14,688 సీట్లు కేటాయించారు. వీరిలో 65 శాతం రిపోర్టు చేశారు. సివిల్, మెకానికల్‌లో 7,455 సీట్లు ఉంటే, 5,968 సీట్లు కేటాయించారు. వీటిల్లో 30 శాతం మంది రిపోర్టు చేశారు. ఈ బ్రాంచీల్లో సీట్లు వచ్చిన విద్యార్థుల్లో కొంతమంది యాజమాన్య కోటా సీట్లకు వెళ్లారు. మరికొంతమంది మంచి కాలేజీ రాలేదని రిపోర్టు చేయలేదు. వీళ్లంతా ఇప్పుడు రెండో దశ కౌన్సెలింగ్‌కు పోటీ పడతారు.


