యాతాలకుంట టన్నెల్‌ను పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాంరెడ్డి తదితరులు
బీఆర్‌ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధ్వజం
దేవాదుల, ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి పూర్తి చేస్తాం
వారంలో సీఎంతో కలిసి మహారాష్ట్ర పర్యటన
వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టు పూర్తికి అక్కడి సీఎంతో చర్చిస్తాం
‘సీతారామ’పనులు పరిశీలించిన భట్టి, ఉత్తమ్, పొంగులేటి
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం: బీఆర్‌ఎస్ హయాంలో నీటిపారుదల రంగంపై చేసిన అట్టహాసాలతో లక్షలాది ఎకరాలకు నీళ్లు తెచ్చారనుకుంటే... ఆ రంగాన్ని సర్వనాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. రూ.1.8 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా సీతారామ, సీతమ్మ సాగర్, దేవాదుల వంటి ఏ ప్రాజెక్టును పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని వారు పరిశీలించారు.
అశ్వాపురం మండలం సీతమ్మసాగర్ బరాజ్, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులతోపాటు సత్తుపల్లి మండలం యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించి సమీక్షించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల అంచనాలను రీడిజైన్ పేరుతో భారీగా పెంచడమే కాక ప్రజాధనాన్ని దురి్వనియోగం చేస్తూ దోపిడీకి పాల్పడిందని మంత్రి ఉత్తమ్ చెప్పారన్నారు. దివంగత వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులను కేవలం రూ,3,505 కోట్లతో నిర్మించి 4 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరందించేందుకు రూ.2 వేల కోట్ల విలువైన పనులు చేపట్టారన్నారు.
మరో రూ.1,505 కోట్లతో మిగిలిన పనులు చేపట్టాల్సి ఉండగా.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి, సీతారామ ప్రాజెక్టుగా మార్చి రూ. 24వేల కోట్లకుపైగా వ్యయాన్ని పెంచిందని దుయ్యబట్టారు. ఆ పార్టీ గద్దె దిగే నాటికి రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా జిల్లాలో కొత్తగా ఎకరం కూడా ఆయకట్టు తేలేకపోయారని విమర్శించారు.
ప్రాణహిత–చేవెళ్లను పూర్తి చేస్తాం
2004లో మొదలైన దేవాదుల ప్రాజెక్టును కూడా తమ హయాంలోనే పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందుకోసం వారం రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి మహారాష్ట్ర వెళ్లి అక్కడి సీఎంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై చర్చలు జరుపుతామన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును తిరిగి ప్రారంభించి పూర్తి చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
కాళేశ్వరం మరమ్మతులపై టెక్నికల్ ఓవర్‌సైట్ కమిటీని జూన్ 30న కేంద్రం ఏర్పాటు చేయగా.. ఇందులో సభ్యులైన ఐఐటీ ముంబై, ఆఫ్రో ఇండియా నిపుణులతో పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెలాఖరుకల్లా నివేదిక వచ్చాక తదుపరి చర్యలు పక్కా ప్రణాళికతో ఉంటాయని చెప్పారు. బీఆర్‌ఎస్ చెక్కు రూపంలో కాళేశ్వరం కాంట్రాక్టర్ నుంచి రూ.1,400 కోట్లు తీసుకుందని వారి కుటుంబ సభ్యులే అంటున్నారని కల్వకుంట్ల కవితను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
విషం చిమ్ముతున్నారు
ప్రతిపక్ష పాత్ర పోషించకుండా ఒంట్లో ఉన్న విషం చిమ్మేందుకే బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని మంత్రి పొంగులేటి అన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలైన సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తమకు పేరు రాదని, బేషజాలకు పోయి రీడిజైనింగులు చేశారని విమర్శించారు. ఫామ్‌హౌజ్‌కు గోదావరి జలాలను తరలించుకుపోవడం మీదున్న శ్రద్ధ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన రైతాంగానికి నీరు అందించే విషయంలో బీఆర్‌ఎస్ నేతలు చూపలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురాంరెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, రాందాస్ నాయక్, ఎనీ్పడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


