పూర్తి స్థాయి వివరాలతో సీఎంకు అధికారుల నివేదిక
రోజురోజుకు పెరుగుతున్న దేవాదుల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం
ప్రారంభంలో రూ. 6116 కోట్లతో అంచనా
మూడుసార్లు సవరించడంతో రూ.18,304 కోట్లకు పెరుగుదల
ఇంకా భూ సేకరణ చేయాల్సింది 2,180 ఎకరాలు
దీనికయ్యే ఖర్చు రూ. 422 కోట్లు
ఇప్పటికే చేసిన వ్యయం రూ. 14,422 కోట్లు
వెంటాడుతున్న ఆటంకాలతో మరింత ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాలుగా సాగుతున్న దేవాదుల ఎత్తిపోతల పథకం ఇప్పట్లో పూర్తయ్యే సూచనలు కనిపించడం లేదు. అంచనాలు సవరిస్తూ అంతకంతకూ నిర్మాణ వ్యయాన్ని పెంచేస్తున్నారు. రూ.ఆరువేల కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు వ్యయం కాస్తా రూ.18వేలకోట్లకు పెరిగింది. 2005–06 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు అనుమతి లభించినా..అది పూర్తవడానికి ఇప్పటికే రెండు దశాబ్దాలు పూర్తయ్యాయి. తాజా గడువు ప్రకారం ఈ ఎత్తిపోతల పథకంలోని మొత్తం మూడు దశలు పూర్తి కావడానికి వచ్చే సంవత్సరం డిసెంబర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. సకాలంలో పూర్తయ్యే అవకాశాలు లేవు.
ఈ ఎత్తిపోతల పథకం కింద దాదాపు 4.95 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంగా చేపట్టినా ప్రధాన పనుల్లో కొన్ని పనులు పూర్తయినా డి్రస్టిబ్యూటరీ కెనాల్స్, కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఈ ప్రాజెక్టును రూపొందించినప్పుడు అంచనా వ్యయం రూ. 6,116 కోట్లు కాగా... 2009–10 సంవత్సరంలో ఒకసారి అంచనాలు సవరించినప్పుడు రూ.9,428 కోట్లకు చేరింది. ఆ తరువాత కూడా పనులు ఊపందుకోలేదు. ఆ తరువాత 2017 మరోసారి అంచనాలు సవరించినప్పుడు దాని వ్యయం కాస్తా రూ.13,445 కోట్లు కాగా..తాజాగా 2026 సంవత్సరంలో మరోసారి ఈ ప్రాజెక్టు అంచనాలను సవరించారు. దీనితో ఆ మొత్తం కాస్తా ఏకంగా రూ. 18,304 కోట్లకు చేరింది.
ఆలస్యంపై సీఎంకు నివేదిక
భారీస్థాయిలో నిర్మాణ వ్యయం పెరిగినా.. భూ సేకరణ, కోర్టు స్టేలు, రైల్వే, జాతీయ రహదారుల క్రాసింగ్స్, పర్యావరణ అనుమతుల నేపథ్యంలో ఈ పథకం మరింత ఆలస్యం తప్పనిసరి అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇటీవల దేవాదాల ప్రాజెక్టుకు సంబంధించి నీటిపారుదల శాఖ సీఎం రేవంత్‌రెడ్డికి సవివరణ నివేదికను సమరి్పంచింది. ప్రాజెక్టు ప్రారంభించినప్పటి నుంచి జరిగిన పరిణామాలు, ఆలస్యం కావడానికి కారణాలు, ప్రధాన అడ్డంకులు, ఆర్థిక అంశాలు అన్నింటిని పూర్తిస్థాయిలో స్పష్టతనిస్తూ ఆ నివేదికను సమర్పించినట్లు తెలిసింది.
మొదటి దశలో 0.81 లక్షల ఎకరాలు, రెండో దశలో 1.77 లక్షల ఎకరాలు, మూడో దశలో 2.36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్నది లక్ష్యం. దీనితో పాటు 0.58 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేయాలని సంకల్పించారు. మొత్తం 38.16 టీఎంసీలతో 4.94 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయంతో ప్రాజెక్టు మొదలుపెట్టారు.
2027నాటికి పూర్తి చేయాలని..
మొదట్లో ఈ ఎత్తిపోతల పథకాన్ని 2009లో పూర్తి చేయాలని భావించినా సాధ్యం కాలేదు. ఆ తరువాత దానిని 2021 జూలైకి పూర్తి చేయాలన్నా వివిధ రకాల ఆటంకాలతో పూర్తికాలేదు. ఇప్పుడు చివరిగా 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 642 కిలోమీటర్ల పైపులైన్లు, టన్నెల్ ఎక్సవేషన్ 57.16 కిలోమీటర్లు, పంప్ హౌజ్‌ల నిర్మాణం పూర్తయిందని, 1,150 కిలోమీటర్ల లైనింగ్ పనులకు గాను 756 కిలోమీటర్లు మాత్రమే లైనింగ్ పనులు పూర్తిగా, ఎర్త్‌వర్క్ ఎక్సవేషన్ 2,492 కిలోమీటర్లకు గాను 1,681 కిలోమీటర్లు పూర్తయింది, నిర్మాణాలు(స్ట్రక్చర్స్)18,817 జరగాల్సి ఉంటే ఇప్పటి వరకు 11,582 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయని నివేదించారు.
ఇంకా 2,180 ఎకరాలుసేకరించాలి..
ఈ ప్రాజెక్టు కోసం మొత్తంగా 34,409 ఎకరాలకు గాను 32,229 ఎకరాలు సేకరణ పూర్తయిందని, ఇంకా 2,180 ఎకరాలు సేకరించాల్సి అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. అవార్డు దశ, సేకరించిన భూమికి నిధుల విడుదలకు టోకెన్‌లు జారీచేసిన తరువాత కూడా ఇంకా రూ. 422 కోట్లు కావాల్సి ఉందని తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి భూ సేకరణ పూర్తి చేస్తేనే వచ్చే సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
రైతులు అధిక నష్టపరిహారానికి సంబంధించి కేసులు కోర్టుల్లో నడుస్తున్న నేపథ్యంలో కొన్నిప్యాకేజీల్లో స్టేఆర్డర్లు రావడం వల్ల భూసేకరణ ముందుకు సాగడం లేదని వివరించారు. నేషనల్ హైవే 365పై మంగల్‌వార్‌పేట–మల్లంపల్లి వద్ద కెనాల్ బిడ్జ్రి నిర్మాణం చేయాల్సి ఉంది. ఇందుకోసం దాదాపు రూ. 193 కోట్ల వ్యయమయ్యే ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్‌కు పంపించిందని, దాని అనుమతి రావాల్సి ఉందని తెలిపారు.
మళ్లీ అనుమతుల కోసం..
మూడో దశలో ప్యాకేజీ ఆరు, ఏడులకు సంబంధించి కాంట్రాక్టర్ పనులు చేయకపోవడం వల్ల ఆయనను తొలగించామని, కొత్త వారికి కొత్త ఎస్‌ఎస్‌ఆర్(స్టాండెర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్) రేట్ల ప్రకారం టెండర్ ఇవ్వాలని, టన్నెల్ డిజైన్స్ మార్పు, పైప్‌లైన్ డయామీటర్, పంపు కేపాసిటీలను రీ ఇంజనీరింగ్ వల్ల మళ్లీ అనుమతుల కోసం ఆలస్యం అవుతోందని, భూ సేకరణలో వివాదాలు, టన్నెల్ ఎక్సవేషన్‌లో నీటి ఊట అధికంగా ఉండడం వల్ల ఆ నీటిని అసాధారణ రీతిలో తొలగించడం, అటవీ అనుమతులు లేని కారణంగా కొన్ని బాటల్ నెక్స్‌లోకి వెళ్లకపోవడం, విద్యుత్ బిల్లుల చెల్లింపులు ప్రధాన అవరోధాలుగా మారాయని నివేదించారు.


