వివరాలు తెలుపుతున్న నిజామాబాద్ సీపీ సాయిచైతన్య
వివరాలు వెల్లడించిన నిజామాబాద్ సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ జిల్లాలో రెండు చిరుతలను చంపిన పదిమందిని అరెస్టు చేసినట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. భీమ్‌గల్ మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన మాలవత్ సంజీవ్ నెలక్రితం తన మేకల మందను అడవికి తీసుకువెళ్లగా చిరుత దాడిచేసి మేకను చంపింది. ఈ విషయం దేవక్కపేట గ్రామానికి చెందిన సిరిసిల్ల రాములు తెలుసుకుని సంజీవ్‌తో మాట్లాడాడు. చిరుతను చంపి దాని శరీర భాగాలు అమ్ముకుంటే లక్షల రూపాయలు వస్తాయని ఆశచూపాడు.
అనంతరం సంజీవ్ మేక కళేబరంలోకి సిరంజీ ద్వారా గడ్డిమందును ఎక్కించాడు. దానిని తిని చిరుత చనిపోయింది. సంజీవ్, రాములుతోపాటు మరో నలుగురు వ్యక్తులు కలిసి దాని కళేబరాన్ని దాచిపెట్టి కొనుగోలుదారులు దొరికిన తర్వాత అమ్ముకుందామని నిర్ణయించారు. అయితే చిరుత కళేబరాన్ని అటవీ అధికారులు గుర్తించి విచారణ చేపట్టగా.. సిరిసిల్ల రాములు ఇంట్లో నాటు తుపాకీ లభించింది. చిరుతను చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారని, దీంతో సంజీవ్, రాములును రిమాండ్‌కు తరలించామని సీపీ తెలిపారు.
ఇందల్వాయి ప్రాంతంలో మరో చిరుతను..
నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇందల్వాయి అటవీ క్షేత్రం అన్సన్‌పల్లి బీట్ పరిధిలో మూడు నెలల క్రితం చిరుతను వేటాడి చంపిన ఘటననూ పోలీసులు ఛేదించారని సీపీ తెలిపారు. వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకున్న చిరుతపులిని కొందరు వ్యక్తులు కొట్టిచంపారని పేర్కొన్నారు. నిందితులు చిరుత మృతదేహాన్ని ధర్పల్లి గ్రామ శివారులోని ఓ మామిడితోటకు తరలించి నాలుగు పంజాలను వేరుచేసి మిగిలిన శరీర భాగాలను సమీపంలోని బావిలో పడేశారని తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్ అయ్యారని, మరొకరు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు.


