హిందూ విద్యార్థులకు తిలక ధారణ తప్పనిసరి చేస్తాం! | We will make wearing tilak mandatory for Hindu students says Bandi Sanjay | Sakshi
Sakshi News home page

హిందూ విద్యార్థులకు తిలక ధారణ తప్పనిసరి చేస్తాం!

Jul 17 2026 3:55 AM | Updated on Jul 17 2026 3:55 AM

We will make wearing tilak mandatory for Hindu students says Bandi Sanjay

కల్మా చదవాలని ఆదేశించిన సక్సెస్‌ స్కూల్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్‌

కాంగ్రెస్‌ మార్క్‌ ‘ఎడ్యుకేషన్‌ జిహాద్‌’పై సీఎం సమాధానం చెప్పాలి: రాంచందర్‌రావు  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక హిందూ విద్యార్థులందరికీ తిలక ధారణ తప్పనిసరి చేస్తామని కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ చెప్పారు. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను పాటించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కల్మా సూరహ్‌ ఫతే చదవాలని హుకుం జారీ చేసిన సైదాబాద్‌ సక్సెస్‌ స్కూల్‌ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

ఈ వ్యవహారాన్ని హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని ఓ ప్రకటనలో కోరారు. దీనిపై సోకాల్డ్‌ సెక్యులర్‌ సంఘాలు నోరెందుకు మెదపడం లేదని, దీనిని చూసీచూడనట్లు వదిలేస్తే తెలంగాణ అంతటా ఈ సంస్కృతి విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ఆటో డ్రైవర్‌ భరత్‌ను వేధించిన పోలీసులు, మజ్లిస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు. 

ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాలవల్లే.. 
కాంగ్రెస్‌ మార్క్‌ ‘ఎడ్యుకేషన్‌ జిహాద్‌’పై సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌ అంటే ముస్లింలు.. ముస్లింలు అంటే కాంగ్రెస్‌’అన్న రేవంత్‌రెడ్డి ఓటు బ్యాంకు, ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల వల్లే ఇలాంటి శక్తులకు తెగింపు పెరిగిందని మండిపడ్డారు. సక్సెస్‌ స్కూల్‌ గుర్తింపును రద్దు చేయాలని రాంచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. 

‘కుట్ర’గా అభివర్ణించిన వీహెచ్‌పీ 
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని సక్సెస్‌ స్కూల్‌లో హిందూ మతానికి చెందిన విద్యార్థికి కల్మా చదవడాన్ని హోంవర్క్‌గా ఇవ్వడాన్ని వీహెచ్‌పీ ఖండించింది. ఇది ఏదైనా ‘కుట్ర’లో భాగమా కాదా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించాలని డిమాండ్‌ చేసింది. ఇందులో ప్రమేయం ఉన్నవారిని గుర్తించేందుకు దర్యాప్తు జరపాలని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. 

స్కూల్‌పై చర్యలు తీసుకోవాల్సిందే: కిషన్‌రెడ్డి 
సాక్షి, న్యూఢిల్లీ: హిందువులకు కల్మా చదవాల్సిన అవసరం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులపై మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దుతున్న సైదాబాద్‌లో ఉన్న సక్సెస్‌ స్కూల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన గురువారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో అన్ని ప్రైవేటు స్కూళ్లలో పాఠాల బోధనపై ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెంచాలని సూచించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మద్దతు ఉందని ఎవరైనా మతాంతీకరణకు ప్రయత్నిస్తే.. చూస్తూ ఉరుకునే ప్రసక్తే లేదని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement