ఎల్-నినో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధం | TG Govt Comprehensive Action Plan Released to Mitigate El Niño Impact | Sakshi
Sakshi News home page

ఎల్-నినో సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు సిద్ధం

Jul 16 2026 10:41 PM | Updated on Jul 16 2026 10:41 PM

TG Govt Comprehensive Action Plan Released to Mitigate El Niño Impact
  • రైతులకు శాస్త్రీయ మార్గదర్శకంగా రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్
  • ఎల్-నినో ప్రభావాన్ని తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించి, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే లక్ష్యంతో రూపొందించిన *"రాష్ట్రస్థాయి ఎల్-నినో కంటింజెన్సీ ప్లాన్–2026 (వానాకాలం)"*ను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం సచివాలయంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఇక్రిశాట్ (ICRISAT), భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ (IIMR), ఐఐఓఆర్, సిఆర్ఐడిఎ (CRIDA), భారత వాతావరణ శాఖ (IMD), వ్యవసాయ శాఖ, ఉద్యాన శాఖల శాస్త్రవేత్తలు, నిపుణులు కలిసి అత్యంత సమగ్రంగా ఈ కంటింజెన్సీ ప్లాన్‌ను రూపొందించినట్లు తెలిపారు. రైతులకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా విశ్లేషించి ఈ ప్రణాళికలో పొందుపరిచామని చెప్పారు.

ఈ కంటింజెన్సీ ప్లాన్‌ను జిల్లా కలెక్టర్లు అత్యంత పకడ్బందీగా అమలు చేయాలని, అలాగే గ్రామస్థాయి వరకు విస్తృతంగా తీసుకెళ్లి ప్రతి రైతుకు సవివరంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు సరైన సమయంలో సరైన సలహాలు అందించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు.

రాష్ట్రాన్ని భౌగోళిక, వాతావరణ, నేలల స్వభావం ఆధారంగా మూడు వ్యవసాయ ప్రాంతాలుగా విభజించి, ఆయా ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఈ కంటింజెన్సీ ప్రణాళిక రూపొందించామని మంత్రి వివరించారు. ప్రతి జిల్లా, ప్రతి మండలానికి సంబంధించిన వర్షపాతం పరిస్థితులు, రానున్న రెండు నుంచి మూడు వారాల వాతావరణ అంచనాలు, భారత వాతావరణ శాఖ (IMD) వారపు సూచనలను ఇందులో పొందుపరిచినట్లు తెలిపారు.

రైతులు ఏ పంటను ఏ సమయంలో విత్తడం అనుకూలమో తెలియజేసే విధంగా 18 ప్రధాన పంటలకు సంబంధించిన శాస్త్రీయ మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయని చెప్పారు. భూమి స్వభావాన్ని బట్టి ప్రస్తుతం ఇంకా ఏ పంటలను సాగు చేయవచ్చో, ప్రత్యామ్నాయంగా ఏ పంటలు అనుకూలమో కూడా స్పష్టంగా సూచించినట్లు తెలిపారు.

అదేవిధంగా ప్రతి జిల్లాలోని భూగర్భ జలాల లభ్యత, ప్రధాన, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వలు, ఇంకా సాగుకు అందుబాటులో ఉన్న నీటి పరిస్థితులపై సమగ్ర సమాచారం కూడా ఈ ప్రణాళికలో పొందుపరిచినట్లు మంత్రి వెల్లడించారు. ప్రాజెక్టుల వారీగా నీటి లభ్యతకు సంబంధించిన వివరాలను రైతులకు రోజువారీగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సాగునీటి శాఖ అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టుల్లో అందుబాటులో ఉన్న నీటి ఆధారంగా జిల్లా కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకునేలా సాగునీటి శాఖ కార్యదర్శితో చర్చించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం నెలకొన్న పొడి వాతావరణ పరిస్థితులు మరికొంత కాలం కొనసాగవచ్చని అంచనాలు ఉన్నందున ఇప్పటికే సాగులో ఉన్న పంటలను ఎలా సంరక్షించుకోవాలో రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ కంటింజెన్సీ ప్లాన్‌లో పంటల వారీగా నిర్వహణ చర్యలు, ఇప్పటికే సాగైన విస్తీర్ణం, ఇంకా సాగు చేసే అవకాశాలు, ప్రత్యామ్నాయ పంటలు, ఆయా పంటలకు అవసరమైన విత్తనాల లభ్యత వంటి అన్ని అంశాలను సమగ్రంగా పొందుపరిచినట్లు తెలిపారు.

అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భావించే పరిస్థితి లేదని భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు మంత్రికి తెలిపారు. భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండగా, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో 2 నుంచి 3 మిల్లీమీటర్ల స్వల్ప వర్షపాతం మాత్రమే నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడుకునే చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా బోర్ వేల్స్ పై ఆధారపడి వరి సాగు చేయడం ప్రస్తుతం అనుకూలం కాదని, అలాంటి పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యాన పంటలు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు.

వర్షాభావ పరిస్థితులు రానున్న నెలల్లో కూడా కొనసాగితే ఇప్పటికే సాగుచేసిన పంటలు మరియు ఉద్యానపంటల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కార్యాచరణ ప్రణాళిక ప్రకారం అధికారులు ముందుకు సాగాలని మంత్రి సూచించారు. రైతులకు అవసరమైన ప్రతి సూచన, సలహా సమయానుకూలంగా అందేలా వ్యవసాయ యంత్రాంగం గ్రామస్థాయిలో మరింత చురుకుగా పనిచేయాలని చెప్పారు. ప్రస్తుతం రైతుల్లో కూడా వర్షాలపై ఆశలు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయ పంటలపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయమని మంత్రి పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ బి. గోపి, సహకార శాఖ కమిషనర్ రాహుల్ రాజ్, ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీమతి యాస్మిన్ బాషా, తెలంగాణ స్టేట్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ  లక్ష్మీ, హాకా ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానయ్య, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజిరెడ్డి మరియు ICRISAT, IIMR, IIOR, CRIDA, IMD  ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement