హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. రేవంత్ సర్కార్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటూ ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలను సీఎం రేవంత్ మోసం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా యువతకు ఇచ్చిన ఏ ఒక్క హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చలేదన్నారు కేటీఆర్. దీనిలో భాగంగా ఈనెల 18వ తేదీన సరూర్‌నగర్‌లో యువ సంగ్రామ సదస్సు నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్ కోతలు
అప్రకటిత కరెంట్ కోతతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 11 జిల్లాల్లో రైతులు సబ్ స్టేషన్ల వద్ద ధర్నాలు చేశారని, బొగ్గు కొరతతో విద్యుత్‌కి అంతరాయ ఏర్పడిందన్నారు. ప్రతిపక్షంగా తాము ప్రభుత్వాన్ని నిద్ర లేపినా.. ఉలుకు లేదు.. పలుకు లేదని మండిపడ్డారు.
థర్మల్ పవర్ స్టేషన్లలో బొగ్గు లేదని, విద్యుత్ ఉత్పత్తి లేక కోత విధిస్తున్నారన్నారు. మన రాష్ట్రంలో సరిపడా విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందని, 7180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు హరీష్. ఇది చేతకాని ప్రభుత్వమని, ప్రభుత్వం 3190 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్ కోతలని మండిపడ్డారు. ప్రభుత్వం నడిపే వారికి కనీస అవగాహన, సోయి లేదన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కనీసం సోయి లేదన్నారు. ఎనిమిది గంటల విద్యుత్ అనేది రైతులకు అందించడం లేదని హరీష్‌రావు ఆరోపించారు.


