సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మంత్రులు | Iran Delegation Shows Keen Interest in Telangana Agricultural Cooperative Model | Sakshi
Sakshi News home page

సహకార రంగం పనితీరుపై ఇరాన్ ప్రతినిధి బృందంతో తెలంగాణ మంత్రులు

Jul 16 2026 10:10 PM | Updated on Jul 16 2026 10:10 PM

Iran Delegation Shows Keen Interest in Telangana Agricultural Cooperative Model

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సహకార రంగం పనితీరు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి వివరించారు. రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి ఆయన గురువారం సచివాలయంలో ఇరాన్ ప్రతినిధి బృందంతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో ఇరాన్ సహకార, కార్మిక, సామాజిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మైదారీ, ఉపమంత్రి డాక్టర్ సర్ఫీ, భారతదేశంలో ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫత్ అలీ, హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సుల్ జనరల్ హమీద్ అహ్మదియా, వైస్ కాన్సుల్ మోహ్సిన్ మొగద్దమి, ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి హషేమి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, తెలంగాణలో సహకార ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పనితీరు, సభ్యత్వ విస్తరణ, రైతులకు అందిస్తున్న బహుముఖ సేవల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తోందని, రైతు సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

తెలంగాణలో అమలవుతున్న సహకార విధానాలు, సంస్థాగత సంస్కరణలపై ఇరాన్ ప్రతినిధి బృందం తీవ్ర ఆసక్తిని కనబరిచింది. భవిష్యత్తులో సహకార రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర అనుభవాల మార్పిడి, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే అంశాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు.సమావేశం ముగిసిన అనంతరం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామి ఇరాన్ మంత్రులు, రాయబారులను శాలువాలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. ఇరు ప్రాంతాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇరాన్ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా ఆకాంక్షించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement