రాష్ట్రాన్ని కమ్ముకుంటున్న కరువు
ఖరీఫ్ పంటల సాగుపై పెను ప్రభావం
వర్షాలు లేకపోవడంతో కృష్ణా, గోదావరి వెలవెల
ఎండుతున్న ప్రాజెక్టులు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న బోర్లు
రాష్ట్రవ్యాప్తంగా సగటున 33% లోటు వర్షపాతం.. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 67% లోటు
548 మండలాల్లో జాడలేని వాన
సాగు అంచనా 1,32,38,446 ఎకరాలు.. సాగయ్యింది 59,83,971
వేసిన పంటలూ ఎండిపోయే పరిస్థితి
కాపాడుకునేందుకు రైతుల అష్టకష్టాలు
అర కిలోమీటర్ పైప్‌లైన్‌తో పత్తికి నీరు
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లికి చెందిన ఈ రైతు పేరు బానోతు నరసింహ. 3 ఎకరాలు కౌలుకు తీసుకుని నెల క్రితం పత్తి విత్తనాలు నాటాడు. అప్పట్నుంచి సరైన వర్షాలు లేవు. దీంతో ఎండిపోయే దశకు చేరుకుంటున్న పత్తిని కాపాడుకునేందుకు.. నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి సుమారు అర కిలోమీటర్‌పైగా పైప్‌లైన్ వేసి నీటిని అందిస్తున్నాడు. ఇప్పటికే పైప్ లైన్‌కు రూ.50 వేలు, ఇతరత్రా కలిపి రూ.60 వేలకు పైగా ఖర్చు చేశాడు. 3 ఎకరాలకు కౌలు రూ.15 వేలు, దున్నడానికి రూ.12 వేలు, విత్తనాలకు రూ.5 వేలు, కలుపుతీతకు రూ.12 వేలు, పురుగుల మందుకు రూ.1,500 పెట్టుబడి పెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నాడు. వర్షాలు కురవక, కాలువకు నీరు రాకపోతే పెట్టిన పెట్టుబడి, పడుతున్న కష్టం మొత్తం వృ«థా అవుతుందని, ఆర్థికంగా నష్టపోతానని వాపోతున్నాడు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎల్‌నినో బూచి భయపెడుతున్న వేళ..ఆకాశం కొద్దిరోజులుగా చుక్క రాల్చకపోవడం, కరువు మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. తీవ్ర వర్షాభావంతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు సైతం ఖాళీగానే ఉన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పంటలే వేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని వాగులు, కాలువల నుంచి పైప్‌లైన్లు వేసి నీటిని తరలిస్తున్నారు. వట్టిపోతున్న బోర్ల నుంచి అరకొరగా వచ్చే నీటితో పంటలు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. రాని వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు.
లోటు వర్షం..సాగు దాదాపుగా సగం
రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 60, జోగుళాంబ గద్వాలలో 52, వనపర్తి, నిజామాబాద్‌లలో 51 శాతం మైనస్ వర్షపాతం ఉంది. ఈ జిల్లాల్లో సీజన్‌లో వర్షపు రోజులు కూడా ఐదు నుంచి తొమ్మిది మాత్రమే నమోదు కావడం గమనార్హం. కాగా రాష్ట్రంలో 621 మండలాలకు 548 మండలాల్లో వర్షమే నమోదు కాలేదు. దీంతో పొలాల్లో పగుళ్లు కన్పిస్తున్నాయి. వానాకాలం సాగు అంచనా 1,32,38,446 ఎకరాలు కాగా ఇప్పటివరకు 59,83,971 (45.20 శాతం)ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవడం కరువు పరిస్థితిని కళ్లకు కడుతోంది. కాగా జూన్ చివరి, జూలై ప్రారంభంలో కురిసిన వర్షాన్ని నమ్ముకుని రైతులు పత్తి, మక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, నువ్వులు తదితర ఆరుతడి పంటలు వేశారు.
కానీ ఆ తర్వాత వానలు పూర్తిగా ఆగిపోవడంతో మొలకలు ఎండిపోగా, చాలాచోట్ల విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు రీచార్జ్ కావడం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేయిస్తున్నారు. చాలాచోట్ల అవి విఫలం కావడం, ఒకవేళ నీళ్లు పడినా అవి కూడా క్రమంగా తగ్గిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 9.26 మీటర్లు కాగా, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాలు 13–14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. 
నీరు లేక ఎండిపోతున్న ఈ వరి నారు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డిది. తనకు బావి ఉన్నా నీరు లేకపోవడంతో నారు ఎండిపోతోంది. సాగర్ ఎడమకాలువ ద్వారా నీరు వస్తే ఈపాటికి వరి నాట్లు వేసే వారమని వాపోతున్నాడు. తనకున్న ఏడెకరాల్లో ఎకరాల్లో ఇప్పుడు ఒకటీ రెండెకరాల్లో కూడా సాగు చేసే పరిస్థితి లేదని చెప్పాడు.
30 శాతం పత్తి విత్తనాలే మొలకెత్తాయి
నాకున్న ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేశా. అందులో కేవలం 30 శాతం విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి. దున్నడం, విత్తనాలకు రూ.లక్ష పెట్టుబడి పెట్టా. మొత్తం డబ్బంతా నష్టపోయినట్లే. వర్షాలు కురిస్తే మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు పెట్టాలి. మళ్లీ రూ. లక్ష పెట్టుబడి కావాలి.
– బండారి శ్రీశైలం, కట్కూర్, బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గాందీనగర్ తండాకు చెందిన ఈ రైతు పేరు మూడ్ లక్ష్మణ్. ఆయనకున్న ఎకరం భూమితోపాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని నారు పోశాడు. ఎకరానికి రూ.4 వేల చొప్పున 10 ఎకరాలకు రూ.40 వేల వరకు ఖర్చయింది. తర్వాత వర్షం పడలేదు. నాగార్జునసాగర్ కాలువ పరిధిలోని సిరిపురం మేజర్‌కు మరమ్మతుల కారణంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు విడుదల కాలేదు. దీంతో పోసిన వడ్లు అక్కడక్కడ మొలకొచ్చినా నీటితడి లేక వడబడి చనిపోతున్నాయి. చివరి ఆశగా నారును బతికించుకునేందుకు బావికి ఆయిల్ ఇంజన్ పెట్టి నీళ్లు పెడుతున్నాడు.
‘బోరు’మంటున్న వరి రైతులు 
మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల తండాకు చెందిన రైతు బానోతు హరికుమార్ గత ఏడాది తమకు ఉన్న వ్యవసాయ బావి ద్వారా వరి సాగు చేశాడు. ఈ ఏడాది కూడా అదే బావిని ఆధారంగా చేసుకుని పంట వేశాడు. కానీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో సాగు ఆందోళనకరంగా మారింది. దీంతో రూ.1.30 లక్షలు ఖర్చు చేసి 300 ఫీట్ల మేరకు బోరు వేయించాడు. దానికి 5 హెచ్‌పీ విద్యుత్ మోటారును ఏర్పాటు చేశాడు. ఈ నెల 5వ తేదీన కొత్తగా బోరు వేయించగా ఇప్పుడు అందులో కూడా నీరు తక్కువగా వస్తుండటంతో లబోదిబోమంటున్నాడు. 
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన రైతు కాసర్ల రాములుదీ ఇదే పరిస్థితి. 3ఎకరాల్లో వరినాట్లు వేస్తే నీటి కొరత కారణంగా 2 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. మరో ఎకరాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసినా నీళ్లు లేక వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రెండు బోర్ల నుంచి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు మాత్రమే వస్తున్నాయని రాములు వాపోతున్నాడు. 
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మలో రైతు బత్తుల దినేష్ తన 5 ఎకరాల మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. చేను పక్కన ఉన్న వాగులో మోటార్‌ను దించి కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్‌పార్మర్‌నుంచి వైరు లాగి చేనులోకి స్ప్రింక్టర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. భార్య రుక్మిణి, కుమారుడు చరణ్ ఇలా ఇంటిల్లిపాది పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లూనావాత్ తండా రైతు లూనావత్ స్వామి తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో 20 రోజుల క్రితం పత్తి సాగు చేశాడు. విత్తనాలు మొలకెత్తినా చినుకు జాడ లేకపోవడంతో మాడిపోయే దుస్థితి నెలకొంది. దీంతో పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతు బావినీటిని పత్తి చేనుకు పారిస్తున్నాడు. రోజుకు అర ఎకరం చొప్పున నీరు కడుతూ మొలకలకు ప్రాణం పోస్తున్నాడు.


