breaking news
rain Drought Conditions
-
ఆశలన్నీ ఆకాశంపైనే..!
అర కిలోమీటర్ పైప్‌లైన్‌తో పత్తికి నీరుజనగామ జిల్లా లింగాల గణపురం మండలం కొత్తపల్లికి చెందిన ఈ రైతు పేరు బానోతు నరసింహ. 3 ఎకరాలు కౌలుకు తీసుకుని నెల క్రితం పత్తి విత్తనాలు నాటాడు. అప్పట్నుంచి సరైన వర్షాలు లేవు. దీంతో ఎండిపోయే దశకు చేరుకుంటున్న పత్తిని కాపాడుకునేందుకు.. నవాబుపేట రిజర్వాయర్ ప్రధాన కాలువ నుంచి సుమారు అర కిలోమీటర్‌పైగా పైప్‌లైన్ వేసి నీటిని అందిస్తున్నాడు. ఇప్పటికే పైప్ లైన్‌కు రూ.50 వేలు, ఇతరత్రా కలిపి రూ.60 వేలకు పైగా ఖర్చు చేశాడు. 3 ఎకరాలకు కౌలు రూ.15 వేలు, దున్నడానికి రూ.12 వేలు, విత్తనాలకు రూ.5 వేలు, కలుపుతీతకు రూ.12 వేలు, పురుగుల మందుకు రూ.1,500 పెట్టుబడి పెట్టి వర్షాల కోసం ఎదురుచూస్తున్నాడు. వర్షాలు కురవక, కాలువకు నీరు రాకపోతే పెట్టిన పెట్టుబడి, పడుతున్న కష్టం మొత్తం వృ«థా అవుతుందని, ఆర్థికంగా నష్టపోతానని వాపోతున్నాడు. సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎల్‌నినో బూచి భయపెడుతున్న వేళ..ఆకాశం కొద్దిరోజులుగా చుక్క రాల్చకపోవడం, కరువు మేఘాలు కమ్ముకోవడంతో రాష్ట్రంలో ఖరీఫ్ సాగు సంక్షోభంలో చిక్కుకుంది. తీవ్ర వర్షాభావంతో కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లో నీళ్లు నిండుకుంటున్నాయి. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు సైతం ఖాళీగానే ఉన్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు కూడా అడుగంటి పోతుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. కొన్నిచోట్ల అసలు పంటలే వేయలేదు. మరికొన్ని ప్రాంతాల్లో తొలకరి వర్షాల ఆధారంగా వేసిన వరి, పత్తి తదితర పంటలు ప్రస్తుతం నీళ్లు లేక ఎండిపోయే స్థితికి చేరుకుంటున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లూ పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని వాగులు, కాలువల నుంచి పైప్లైన్లు వేసి నీటిని తరలిస్తున్నారు. వట్టిపోతున్న బోర్ల నుంచి అరకొరగా వచ్చే నీటితో పంటలు తడిపే ప్రయత్నం చేస్తున్నారు. రాని వర్షం కోసం ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. లోటు వర్షం..సాగు దాదాపుగా సగం రాష్ట్రంలోని 33 జిల్లాల్లోని దాదాపు అన్ని మండలాలు సాధారణ వర్షపాతం కంటే 33 శాతానికి పైగా లోటులోకి వెళ్లిపోయాయి. హనుమకొండ జిల్లాలో అత్యధికంగా 67 శాతం లోటు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజిగిరిలో 60, జోగుళాంబ గద్వాలలో 52, వనపర్తి, నిజామాబాద్‌లలో 51 శాతం మైనస్ వర్షపాతం ఉంది. ఈ జిల్లాల్లో సీజన్లో వర్షపు రోజులు కూడా ఐదు నుంచి తొమ్మిది మాత్రమే నమోదు కావడం గమనార్హం. కాగా రాష్ట్రంలో 621 మండలాలకు 548 మండలాల్లో వర్షమే నమోదు కాలేదు. దీంతో పొలాల్లో పగుళ్లు కన్పిస్తున్నాయి. వానాకాలం సాగు అంచనా 1,32,38,446 ఎకరాలు కాగా ఇప్పటివరకు 59,83,971 (45.20 శాతం)ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవడం కరువు పరిస్థితిని కళ్లకు కడుతోంది. కాగా జూన్ చివరి, జూలై ప్రారంభంలో కురిసిన వర్షాన్ని నమ్ముకుని రైతులు పత్తి, మక్కజొన్న, కంది, పెసర, సోయాబీన్, నువ్వులు తదితర ఆరుతడి పంటలు వేశారు. కానీ ఆ తర్వాత వానలు పూర్తిగా ఆగిపోవడంతో మొలకలు ఎండిపోగా, చాలాచోట్ల విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. వర్షాలు లేక భూగర్భ జలాలు రీచార్జ్ కావడం లేదు. ఇప్పటికే ఉన్న బోర్లలో నీరు తగ్గిపోవడంతో రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి కొత్త బోర్లు వేయిస్తున్నారు. చాలాచోట్ల అవి విఫలం కావడం, ఒకవేళ నీళ్లు పడినా అవి కూడా క్రమంగా తగ్గిపోతుండటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర సగటు భూగర్భ జలాల లోతు 9.26 మీటర్లు కాగా, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భూగర్భ జలాలు 13–14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 14.5 మీటర్ల లోతుకు పడిపోయాయి. నీరు లేక ఎండిపోతున్న ఈ వరి నారు నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం నారమ్మగూడెం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డిది. తనకు బావి ఉన్నా నీరు లేకపోవడంతో నారు ఎండిపోతోంది. సాగర్ ఎడమకాలువ ద్వారా నీరు వస్తే ఈపాటికి వరి నాట్లు వేసే వారమని వాపోతున్నాడు. తనకున్న ఏడెకరాల్లో ఎకరాల్లో ఇప్పుడు ఒకటీ రెండెకరాల్లో కూడా సాగు చేసే పరిస్థితి లేదని చెప్పాడు. 30 శాతం పత్తి విత్తనాలే మొలకెత్తాయి నాకున్న ఏడున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పత్తి సాగు చేశా. అందులో కేవలం 30 శాతం విత్తనాలు మాత్రమే మొలకెత్తాయి. దున్నడం, విత్తనాలకు రూ.లక్ష పెట్టుబడి పెట్టా. మొత్తం డబ్బంతా నష్టపోయినట్లే. వర్షాలు కురిస్తే మళ్లీ దుక్కి దున్ని విత్తనాలు పెట్టాలి. మళ్లీ రూ. లక్ష పెట్టుబడి కావాలి. – బండారి శ్రీశైలం, కట్కూర్, బచ్చన్నపేట మండలం జనగామ జిల్లా ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గాందీనగర్ తండాకు చెందిన ఈ రైతు పేరు మూడ్ లక్ష్మణ్. ఆయనకున్న ఎకరం భూమితోపాటు మరో 9 ఎకరాలు కౌలుకు తీసుకుని నారు పోశాడు. ఎకరానికి రూ.4 వేల చొప్పున 10 ఎకరాలకు రూ.40 వేల వరకు ఖర్చయింది. తర్వాత వర్షం పడలేదు. నాగార్జునసాగర్ కాలువ పరిధిలోని సిరిపురం మేజర్‌కు మరమ్మతుల కారణంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు విడుదల కాలేదు. దీంతో పోసిన వడ్లు అక్కడక్కడ మొలకొచ్చినా నీటితడి లేక వడబడి చనిపోతున్నాయి. చివరి ఆశగా నారును బతికించుకునేందుకు బావికి ఆయిల్ ఇంజన్ పెట్టి నీళ్లు పెడుతున్నాడు. ‘బోరు’మంటున్న వరి రైతులు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని శనగపురం గ్రామ శివారు కుమ్మరికుంట్ల తండాకు చెందిన రైతు బానోతు హరికుమార్ గత ఏడాది తమకు ఉన్న వ్యవసాయ బావి ద్వారా వరి సాగు చేశాడు. ఈ ఏడాది కూడా అదే బావిని ఆధారంగా చేసుకుని పంట వేశాడు. కానీ వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో సాగు ఆందోళనకరంగా మారింది. దీంతో రూ.1.30 లక్షలు ఖర్చు చేసి 300 ఫీట్ల మేరకు బోరు వేయించాడు. దానికి 5 హెచ్‌పీ విద్యుత్ మోటారును ఏర్పాటు చేశాడు. ఈ నెల 5వ తేదీన కొత్తగా బోరు వేయించగా ఇప్పుడు అందులో కూడా నీరు తక్కువగా వస్తుండటంతో లబోదిబోమంటున్నాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన రైతు కాసర్ల రాములుదీ ఇదే పరిస్థితి. 3ఎకరాల్లో వరినాట్లు వేస్తే నీటి కొరత కారణంగా 2 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోయింది. మరో ఎకరాన్ని దున్ని సాగుకు సిద్ధం చేసినా నీళ్లు లేక వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉన్న రెండు బోర్ల నుంచి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు మాత్రమే వస్తున్నాయని రాములు వాపోతున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరిచెల్మలో రైతు బత్తుల దినేష్ తన 5 ఎకరాల మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాడు. చేను పక్కన ఉన్న వాగులో మోటార్‌ను దించి కొద్ది దూరంలో ఉన్న ట్రాన్స్పార్మర్నుంచి వైరు లాగి చేనులోకి స్ప్రింక్టర్ల ద్వారా నీటిని అందిస్తున్నాడు. భార్య రుక్మిణి, కుమారుడు చరణ్ ఇలా ఇంటిల్లిపాది పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం లూనావాత్ తండా రైతు లూనావత్ స్వామి తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో 20 రోజుల క్రితం పత్తి సాగు చేశాడు. విత్తనాలు మొలకెత్తినా చినుకు జాడ లేకపోవడంతో మాడిపోయే దుస్థితి నెలకొంది. దీంతో పంటను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రైతు బావినీటిని పత్తి చేనుకు పారిస్తున్నాడు. రోజుకు అర ఎకరం చొప్పున నీరు కడుతూ మొలకలకు ప్రాణం పోస్తున్నాడు. -
రైతన్నల వర్రీ
అనంతపురం టౌన్ : వర్షాభావ పరిస్థితులు, నీటి కేటాయింపుల్లో కోత నేపథ్యంలో తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టు కింద వరి సాగును తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను సమాయత్తం చేయడానికి సిద్ధమవుతున్నారు. అయితే..చాలామంది రైతులు మాత్రం వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. వివరాల్లోకి వెళితే.. హెచ్చెల్సీ కింద 2.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. జిల్లాలో ప్రతియేటా లక్ష ఎకరాల వరకు సాగునీరు అందించేవారు. కొన్నేళ్లుగా వర్షాభావ పరిస్థితుల వల్ల ఆయకట్టును భారీగా కుదిస్తున్నారు. ఈ ఏడాది ఆరు వేల హెక్టార్లలో వరి, 74 వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు సాగు నీరు అందించాలని నిర్ణయించారు. రెండు, మూడేళ్ల నుంచి హైలెవల్ మెయిన్ కెనాల్ (హెచ్‌ఎల్‌ఎంసీ), గుంతకల్లు బ్రాంచి కెనాల్ (జీబీసీ), పీఏబీఆర్ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ), మైలవరం బ్రాంచ్ కెనాల్, పులివెందుల బ్రాంచ్ కెనాల్ (పీబీసీ) కింద 60-80 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం నీటి కేటాయింపులు ఆశాజనకంగా ఉండవంటూ వరిని పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. ఆరుతడి పంటలైన మొక్కజొన్న, జొన్న, కూరగాయలు, పొద్దుతిరుగుడు, వేరుశనగ లాంటి పంటలను సిఫారసు చేస్తున్నారు. రైతులు మాత్రం హెచ్చెల్సీ ఆయకట్టులో ఎక్కువ శాతం భూములు వరి మినహా వేరే పంటలకు పనికిరావని స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎల్‌ఎంసీ కింద 20 నుంచి 25 వేల ఎకరాలలో వరి మాత్రమే వేస్తారు. అనధికారికంగా మరో 5 -8 వేల ఎకరాల వరకూ సాగు చే స్తారు. దీంతో పాటు హెచ్ఎల్సీ సౌత్, నార్త్ కెనాల్ కింద మెజార్టీ రైతులు వరినే నమ్ముకుంటున్నారు. దీంతో అధికారులు నిర్ణయించిన విస్తీర్ణానికి మించి సాగులోకి వచ్చే అవకాశముంది. గతేడాది కంటే విపత్కర పరిస్థితులు జిల్లాకు సాగు, తాగునీటి విషయానికొస్తే గతేడాది కంటే ఈసారి విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గతేడాది హెచ్చెల్సీకి తొలుత 22 టీఎంసీలు కేటాయించినా దామాషా ప్రకారం చివరకు 19 టీఎంసీలు వచ్చాయి. దీంతో పాటు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విడుదల చేసిన జీవో ప్రకారం కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీలలో రివర్ష్ డైవర్షన్ పద్ధతిపై దామాషా ప్రకారం నాలుగు టీఎంసీలను పీఏబీఆర్‌కు ఇచ్చారు. రాష్ట్ర విభజనతో పీఏబీఆర్‌కు నీరు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా గతేడాది ఆరు టీఎంసీలు వచ్చాయి. 1.95 టీఎంసీల సామర్థ్యమున్న జీడిపల్లి జలాశయాన్ని పూర్తిగా నింపడంతో పాటు రెండు నెలల పాటు నిరంతరాయంగా జలాశయం మరువ ద్వారా పీఏబీఆర్‌లోకి నీరు వచ్చాయి. గతేడాది పంటలకు ఇవ్వడంతో పాటు పీఏబీఆర్ కుడికాలువ కింద ఉన్న 49 చెరువుల్లోకి నీటిని తీసుకుపోయారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు తాగునీటి అవసరాలకు పీఏబీఆర్తో పాటు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో సమృద్ధిగా నిల్వ చేశారు. ఆ పరిస్థితి ఈ ఏడాది ఉండదని అధికారులు అంటున్నారు. మిగులు జలాలపై ఆధారపడిన హంద్రీ-నీవా ప్రాజెక్టుకు ఈ సారి నీటి విడుదల పూర్తిగా అనుమానమేనని స్పష్టం చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ నిర్ణయంతో గతేడాది శ్రీశైలం జలాశయం నుంచి నీటిని తీసుకున్నారు. విభజన కారణంగా ఈ ఏడాది నుంచి కృష్ణా బోర్డు ఆంగీకారంతోనే హెచ్ఎన్ఎస్ఎస్కు నీటి కేటాయింపులు ఉంటాయని వివరిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు, రాష్ట్ర విభజన నేపథ్యంలో హెచ్చెల్సీ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌లకు నీటి కేటాయింపులు తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని రైతులు వరి సాగు చేయకపోవడమే మంచిదని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరుతడి పంటలే మేలు హెచ్చెల్సీ కింద ఈ ఏడాది రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవడమే చాలా మేలు. గతేడాదితో పోలిస్తే వర్షాభావ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో ఒక్క వర్షం కూడా రాలేదు. హెచ్చెల్సీకి దామాషా ప్రకారం 22 టీఎంసీల నీటిని కేటాయించారు. చివర్లో వర్షాలు రాకపోతే కేటాయింపులు తగ్గుతాయి. కావున రైతులు వరి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోతారు. - వాణినాథ్రెడ్డి, ఎస్ఈ, హెచ్చెల్సీ


