పుట్టుకతో రెండు చేతులు లేవు. వైకల్యం వెక్కిరించినా..తనలోని తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో దాన్ని జయించాడు. కాళ్లనే చేతులుగా ఉపయోగిస్తూ..పనులన్నీ సునాయాసంగా చేస్తూ..సాధ్యం కాదు అనుకున్నవన్ని చేధించాడు. దివ్యాంగుల కోటలో ఉద్యోగం వచ్చేస్తుందేలే అని అన్న మాటలనే సీరియస్‌గా తీసుకుని ఓపెన్ కేటగిరిలో టీచర్ ఉద్యోగం సంపాదించి శెభాష్ అనిపించుకున్నాడు. అంతేగాదు బడిలో పాఠాలు ఎలా చెబుతాడు అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్న విద్యార్థులకు..మైమరిచి వినేలా అద్భుతంగా పాఠాలు చెప్పి..వారందరి మనసులను గెలుచుకున్నాడు.
అతడే జమీ సింహాచలం నాయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా, గనిసెట్టివారిపాలెం గ్రామంలో జన్మించిన సింహాచలంకి పుట్టకతో రెండు చేతులు, ఒక కాలు వైకల్యంతో జన్మించాడు. దాంతో తల్లిదండ్రులు కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందని చాలా ఆందోళన చెందారు. ఆ చిన్నారి పెద్దయ్యాక ఎలా పెంచాలి, జీవితం ఎలా నెట్టుకొస్తాడని చాలా బాధపడ్డారు పేరెంట్స్. రైతు కుటుంబానికి చెందిన సింహాచలం చూసి చుట్టుపక్కల వాళ్లు ఆ చిన్నారి భవిష్యత్తు చాలా కష్టంగా ఉంటుందని మరింత భయపెట్టేవారు.
అయితే అతడి మేనమామ చొరవ లైఫ్‌నే టర్న్ తిప్పింది. వేరే దేశానికి చెందిన వ్యక్తి అచ్చం అలానే పుట్టాడని, అతడు కాళ్లతో రాస్తు మంచి స్థాయికి రావడం గురించి ఒక పత్రికలో చదివానంటూ సింహాచలాన్ని ప్రోత్సహించేవారు. అంతేగాదు అన్ని పనులు చేతులతో చేసుకునేలా మద్దతిచ్చేవారు. ఆయన ఒక చాక్‌పీస్ తీసి కాలి బొటనవేలు మధ్య పెట్టి కిటికిలపై గోడలపై రాసేల ప్రాక్టీస్ చేయించడంతో..ఐదేళ్లకే కాళ్లతో చక్కగా రాయడం అవలీలగా నేర్చేసుకున్నాడు.
అలా అతడు తన ఊరిలోనే 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నాడు. అయితే అందరిలా బెంచీలపై కూర్చుని రాయడం సింహాచలానికి సాధ్యమయ్యేది కాదు అందుకే నేలపైనే కూర్చొని పాఠాలు వినేవాడు. అలా ఇంటర్ డిగ్రీ, బీఈడీ వరకు ప్రతీదీ పాదాలతో రాస్తూనే పూర్తి చేశాడు. ఒకకరంగా ఇది ఎవ్వరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండటం నేర్చుకునేలా చేసిందని అంటాడు సింహాచలం. అంతేగాదు చిన్న వయసులోనే తాను పాదాలనే చేతులుగా భావించాలని అర్థం చేసుకున్నాను, అంగీకరించానని సగర్వంగా చెప్పాడు. అలాగే ఇతరులు చేతులతో రాస్తుంటే తనకేం బాధగా అనిపించదని కూడా చెబుతున్నాడు.
ఇక ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నప్పుడు కోచింగ్ సెంటర్‌కి వెళ్లడం సాధ్యం కాలేదు. కాబట్టి ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ తరగతులు, యూట్యూబ్ ద్వారా చదువుకున్నట్లు తెలిపాడు. డీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నప్పుడు గురువులు, ఉపాధ్యాయులు నుంచి మార్గదర్శకత్వం పొందానని చెప్పారు. అయితే అందరూ తన వైకల్యం వల్ల ఈజీగా దివ్యాంగుల కోటలో ఉద్యోగం సంపాదించొచ్చు అనడంతో మరింత పట్టుదలతో కసిగా చదివినట్లు పేర్కొన్నాడు.

అలా తాను డీఎస్సీ పరీక్షలో జిల్లాస్థాయిలో మూడో ర్యాంకు సాధించి ప్రభ్యుత్వ ఉద్యోగం సంపాదించానని చెప్పుకొచ్చాడు. తాను పాఠశాలలో చేరి విధుల నిర్వర్తించిన రోజుని మర్చిపోనంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకున్నారు. తాను పనిచేస్తున్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల డిప్యూటీ హెడ్‌మాస్టర్ కొండబాబు విధుల్లో జాయిన్ అయ్యే రోజున కాళ్లతో డీఎస్సీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడైన ఉపాధ్యాయుడిని ఆహ్వానించడం సంతోషకరం అంటూ ఘనంగా ఆహ్వానం పలికారంటూ సంతోషంగా చెప్పాడు సింహాచలం.
అంతేగాదు ఆ రోజు విద్యార్థులు కూడా తానెలా పాఠాలు చెబుతానని ఆసక్తిగా ఎదురు చూసినట్లు పేర్కొన్నాడు. అయితే సింహాచలం పాఠాలు చెబితే పిల్లలంతా అల్లరి చేయకుండా అత్యంత నిశబ్దంగా వింటుంటారని చెబుతున్నారు సహోద్యోగులు. ఇక తన దైనందిన కార్యకలాపాల్లో తన తండ్రి తనకు అడ్డగా నిలుస్తారని, రోజు పాఠశాల వద్ద దింపడం, ఇంటికి తీసుకువెళ్లడం వంటివి చేస్తుంటారని చెబుతున్నాడు. అలాగే తన ప్రస్థానం ఇక్కడితో ఆగిపోదని యూపీఎస్సీకి సన్నద్ధమై ఉత్తీర్ణత సాధించడం తన తదుపరి లక్ష్యమని ఆత్మవిశ్వాసంగా చెబుతున్నాడు సింహాచలం.
ఇదీ చదవండి: బ్రిక్స్ సదస్సులో ప్రధాన ఆకర్షణగా ఆ యువకుడు..!


