సాక్షి, ఏలూరు: ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. మాజీ మంత్రి ఆళ్ల నాని(57) గుండెపోటుతో మంగళవారం విశాఖ నివాసంలో కన్నుమూశారు. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన ఆయన.. వైఎస్సార్‌సీపీ హయాంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.
ఏలూరు రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఆళ్ల నాని(ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్). కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. 2004, 2009 ఎన్నికల్లో ఏలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైఎస్సార్‌సీపీలో చేరి 2019లో మళ్లీ ఏలూరు నుంచి విజయం సాధించారు.
వైఎస్ జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. కోవిడ్ సమయంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఆయన పాత్ర కూడా చర్చనీయాంశమైంది. ఏలూరు రాజకీయాల్లో ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. ఆయన మృతి పట్ల పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు, పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


