తెలంగాణ అసెంబ్లీ బయట,లోపల జరిగిన కొన్ని పరిణామాలు ఏ మాత్రం ఆహ్వానించదగినవి కావు.ఈ సందర్భంగా కాంగ్రెస్,బిఆర్‌ఎస్‌లు పరస్పరం చేసుకున్న ఆరోపణలు కూడా వినడానికి బాలేదు.శాసనసభ వద్ద జరిగిన ఘటనల ఆధారంగా ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి ఈ రెండు పార్టీలు యత్నించాయి. మరో రెండు ఏళ్లలో జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఇప్పటి నుంచే ఈ పార్టీలు వ్యూహ రచనలో తీవ్రంగా పోటీ పడుతున్న సంగతి కనిపిస్తున్నదే.
బీఆర్ఎస్ అసెంబ్లీలో అనుసరించబోయే వ్యూహాన్ని ముందుగానే రేవంత్ పసికట్టినట్లున్నారు. నల్ల షర్టులతో శాసనసభలోకి అడుగుపెట్టడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసన తెలుపుదామని భావించిన బీఆర్ఎస్‌కు కొంత ఎదురుదెబ్బ తగిలింది. నల్ల షర్టులపై ఏవో నినాదాలు ఉన్నాయన్న సాకుతో పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను గేటు బయటే అడ్డుకున్నారు. బహుశా ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ ఊహించి ఉండకపోవచ్చు.
నిజానికి బీఆర్ఎస్ నేతలు నినాదాలతో ఉన్న షర్టులతో రావడం ;పెద్ద తప్పేమీ కాదు.అయినా రాజకీయంగా మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ ప్లాన్ వేశారని అనుకోవాలి. ఆ క్రమంలో పోలీసులతో బీఆర్‌ఎస్ నేతలకు జరిగిన గొడవలు,వారిపై ఎదురు కేసులు పెట్టే పరిస్థితి రావడం వంటివి జరిగాయి. అంతేకాక తాతా మధు అనే ఎమ్మెల్సీ స్పీకర్ గడ్డం ప్రసాదకుమార్‌ను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్య బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసింది. దానికి ప్రతిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి తదితరులపై పోలీసులు ప్రవర్తించిన తీరు అభ్యంతరకరం అంటూ పార్టీ నేతలు విమర్శలు చేసినా,ఆశించిన రీతిలో ఆ ఇష్యూ పెరగలేదు.
అదే టైమ్‌లో అసెంబ్లీలో స్పీకర్ కంటతడి పెట్టుకోవడంతో బీఆర్ఎస్‌కు కాస్త ఇబ్బందిగా మారంది.దానిపై మాజీ మంత్రి హరీష్ రావు తమ వాదన వినిపించినప్పటికీ పెద్దగా ప్రయోజనం జరగలేదు.పైగా మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సభ నుంచి సస్పెన్షన్‌కు గురి కావల్సి వచ్చింది.దాంతో బీఆర్ఎఎస్ లేవనెత్తాలని అనుకున్న ప్రజా సమస్యలు వెనక్కి పోయినట్లయింది. అందువల్లే 22ఎ నిషేధిత భూముల వివాదంపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని అనుకున్నా బీఆర్ఎస్‌కు అది కుదరలేదు.
అలాగే మాజీ మంత్రి కొండా సురేఖ రాజీనామా ఉదంతం గురించి ప్రస్తావించే అవకాశం వీరికి రాలేదు. ముఖ్యమంత్రి సోదరులపై కేటిఆర్ తదితరులు చేస్తున్న ఆరోపణలను శాసనసభలో ప్రస్తావించలేపోయారు.అందువల్లే కేటిఆర్,హరీష్ రావులు ప్రత్యేకించి ఫ్యూచర్ సిటీలో రేవంత్ సోదరుడు తక్కువ ధరకు భూమి పొందారంటూ అక్కడకు వెళ్లి నిరసన తెలిపారు.
అయినా ఇలాంటి విషయాలు సభలో చర్చించితే వచ్చే ప్రాధాన్యత వేరే ఉంటుంది. అలాగే రికార్డులలో ఎప్పటికి ఉండిపోతుంది.22 ఎ భూముల అంశంపై కూడా పార్టీ ఆఫీస్‌లో బాదితులతో ఒక కార్యక్రమం పెట్టడం ద్వారా కొంత కవర్ చేసుకునే యత్నం చేశారు. ప్రతిపక్ష నేత కేసిఆర్ ఫామ్ హౌస్‌లో బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు సమావేశమై వ్యూహ రచన చేసుకున్నా పెద్దగా ఫలించినట్లు అనిపించదు. రేవంత్ ఇంతవరకు బీఆర్ఎస్‌ను అసెంబ్లీలో నిలువరించినప్పటికీ,కొన్ని చర్యల వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో మాట్లాడనివ్వలేదన్న విమర్శ జనంలోకి వెళ్లవచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటువద్దే అడ్డుకోవడం ద్వారా ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారన్న విమర్శకు గురి అయ్యారు.
పార్లమెంటులో రాహుల్ గాంధీ నల్ల షర్టుతో వెళ్లినప్పుడు ,తాము వెళితే తప్పేమిటి అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ తరహా నిరసనలు ఆయా రాష్ట్రాలలో జరుగుతూనే ఉంటాయి. ఏపీలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు బీజేపీ నుంచి వేరు పడిన తర్వాత నల్ల షర్టు వేసుకుని అసెంబ్లీలో ప్రధాని మోడీపై తీవ్రమై విమర్శలు చేశారు.గతంలో ఉమ్మడి ఏపీలో కూడా ఇలాంటి నిరసనలు జరిగేవి.సభ గేటు వద్ద జరిగిన ఘటనలను, స్పీకర్ పై ఓ ఎమ్మెల్సీ చేసిన అనుచిత వ్యాఖ్యలను కెసిఆర్ కు ముడిపెట్టి ఇదంతా ఫామ్ హౌస్ కుట్ర అని ప్రచారం చేయాలని రేవంత్ భావించారు.కాని అది కూడా అంతగా సఫలం అయినట్లు అనిపించదు.రేవంత్ ఎలాగొలా కేసీఆర్‌ను రెచ్చగొట్టి కేసీఆర్‌ను ముగ్గులోకి లాగాలనే తాపత్రయపడుతున్నారు. కేసీఆర్,తను ఒకటే స్థాయి అని,ఆ మాటకొస్తే కేసీఆర్ కన్నా తానే పవర్ ఫుల్ అని నిరూపించుకోవడానికి ఆయన యత్నిస్తుంటారు. కాని కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండడం ద్వారానే సమానం చెబుతున్నారు.
స్పీకర్ దళిత వర్గానికి చెందినవారు కనుక ఆ కోణం తీసుకుని ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద కొందరు నేతలను , దళిత సంఘాలను పంపి నిరసన చెప్పే ప్రయత్నం చేయడం అంత పద్దతిగా లేదు.దీనివల్ల కాంగ్రెస్ కు ఎంత లాభం వచ్చిందో చెప్పలేం.పైగా ప్రభుత్వంలో ఉండి ఘర్షణ వాతావరణం సృష్టించారన్న విమర్శ వచ్చింది.ఈ సందర్భంలో గతంలో బీఆర్‌ఎస్‌లో ఉన్న దళిత ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని ఉద్దేశించి ,కాంగ్రెస్ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఎంత తీవ్రమైన విమర్శలు చేశారో తెలిపే వీడియోలు బయటకు వచ్చాయి. కాంగ్రెస్‌కు పోటీగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎర్రవెల్లి వద్ద శుద్ది కార్యక్రమం నిర్వహించారు.అది కూడా సరైనదేనా అన్నది ఆలోచించుకోవాలి.
కాకపోతే రేవంత్ ఈ క్షుద్రపూజలు,చేతబడులువంటివాటిని నమ్ముతారు కనుక ఆయనను భయపెట్టడానికి ఏమైనా చేశారేమో తెలియదు.పసుపు నీళ్లు చల్లినవారిని అరెస్టు చేసిన పోలీసులు ,ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన కాంగ్రెస్ వారిపై కూడా చర్య తీసకోవాలి కదా!తెలంగాణ పోలీసులు ఎపిలో కన్నా బెటర్ అనుకుంటున్న తరుణంలో ఇలాంటివి జరగడం సరికాదు. డీజీపీ సీవీ ఆనంద్‌కు గతంలో మంచిపేరే ఉంది.కాని ఇప్పుడు ఆయన చేతిలో ఏమి లేదని బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇవన్ని ఒక ఎత్తు అయితే కేటిఆర్,హరీష్ తదితరులపై లైంగిక వేధింపుల కేసు పెట్టడం మరీ దారుణంగా ఉంది. ఒక లేడీ కానిస్టేబుల్ పట్ల అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణతో ఈ కేసు పెట్టడం వల్ల ప్రభుత్వానికి,రేవంత్‌కు పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. పైగా ఇలాంటివి బూమ్ రాంగ్ అవుతాయని కాంగ్రెస్ గమనించాలి.
ఎపిలో కూడా ఇలాంటి దిక్కుమాలిన కేసులను రేవంత్ గురువైన చంద్రబాబు ప్రభుత్వం తీరు విమర్శలకు గురి అవుతోంది. మరో సంగతి ఏమిటంటే అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై రేవంత్ ఫ్లాష్ సర్వే చేసుకుంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితం వచ్చిందట. అలాగే బీఆర్ఎస్ కూడా ఒక సర్వేని ప్రచారంలోకి తెచ్చి తాము అదికారంలోకి రాబోతున్నామని దీమాను వ్యక్తం చేసింది.రెండేళ్ల తర్వాత ఈ సర్వేల ప్రభావం ఎలా ఉంటుందో చెప్పలేం.కాకపోతే ఓవరాల్‌గా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత నెగిటివ్ వాతావరణాన్ని ఎదుర్కుంటోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుండవచ్చు.
మరో వైపు బీజేపీ కూడా తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు ప్రయత్నాలు చేస్తోంది. కాని పరిస్థితి లోక్ సభ ఎన్నికలలో మాదిరి అనుకూలంగా ఉంటుందా?అన్నది చర్చనీయాంశంగా ఉంది.అసెంబ్లీలో బిజెపి సభ్యులు 22 ఎ తదితర అంశాలపై మాట్లాడారు.వారు బీఆర్ఎస్ ,కాంగ్రెస్‌లు రెండిటిని విమర్శించారు.రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 ఎ పై జవాబు ఇచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించినా ప్రజలలో మాత్రం దీని అలజడి తగ్గలేదు. అసెంబ్లీ వరకు రేవంత్ వ్యూహం కొంత ఫలించినా, అసెంబ్లీ వెలుపల కేటిఆర్,హరీష్ లు నిర్వహించిన కార్యక్రమాలతో ప్రజలను కొంతమేర ఆకర్షించగలిగారు.

కొమ్మినేని శ్రీనివాసరావు,సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత


