హైదరాబాద్: దళిత స్పీకర్‌కు ఒక న్యాయం, సామాన్య దళితులకు ఇంకో న్యాయమా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గద్వాల బాధితునికి ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత అని తెలిపారు. మంత్రులు సీతక్క, భట్టి విక్రమార్క, అడ్లూరి స్థాయీ, పదవిని బట్టి స్పందిస్తారా? అని నిలదీశారు.
‘‘ఈ రోజు గద్వాల వివక్ష-విధ్వంసం బాధితులను హైదరాబాదులో పరామర్శించాను. వాళ్లకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని అన్నారు. నేను జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడాను. వారి ప్రాణాలకు ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదే. మొన్న స్పీకర్ గారికి ఏదో అవమానం జరిగిందని పదే పదే మీ కాంగ్రెస్ పార్టీ గుండెలు బాదుకుంటూ గొంతు చించుకున్నారు కదా.
మరి గద్వాల జిల్లా రేపల్లెలో అదే వర్గానికి చెందిన అబ్బాయి ప్రేమ వివాహం చేసుకుంటే తట్టుకోలేక అబ్బాయి ఇల్లు కూలగొట్టి ధ్వంసం చేశారు. పట్ట పగలే గంటల కొద్దీ ఇంత దారుణం జరుగుతున్నా బాధితులు చెప్పే దాకా పోలీసుల కు ఈ విషయం పోలీసులకు తెలపకపోవడం దారుణం. ఈ బాధితుల గురించి మాట్లాడరా సీఎం రేవంత్? మంత్రులు భట్టి, సీతక్క, లక్ష్మణ్ లు పదవి, స్టేటస్, అవసరాన్ని బట్టి మాత్రమే స్పందిస్తారా? ఎందుకు వీరిని పరామర్శించరు? ఎందుకు సూత్రధారులైన నిందితులపై చర్యలు తీసుకోవడంలేదు?’’ అని ప్రశ్నించారు.


