కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్ల ఏర్పాటు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అనంతరం ఆర్.కృష్ణయ్య వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య తెలిపారు. శనివారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌రెడ్డితో సమావేశమై బీసీలకు సంబంధించిన పలు సమస్యలను సీఎంకు వివరించి వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో బీసీ రక్షణ చట్టం తీసుకురావాలని కోరగా ఈ అంశంపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయాలని బీసీ సంక్షేమ శాఖను ఆదేశించినట్లు చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో, పలు జిల్లా కేంద్రాల్లో బీసీ విద్యార్థులకు హాస్టళ్లలో సీట్లు సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో 100 బీసీ కాలేజీ హాస్టళ్లు, 120 బీసీ గురుకులాలు మంజూరు చేయాలని ,హాస్టల్ విద్యార్థుల కోసం శాశ్వత భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేయగా కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదేశించారన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సాధ్యమైనంత త్వరగా దశలవారీగా చెల్లిస్తామని చెప్పారన్నారు. సీఎంను కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు జి.మల్లేష్‌యాదవ్, నీలా వెంకటేష్, జిల్లపల్లి అంజి, సి.రాజేందర్, పర్లగోర్ల మోడీ రాందేవ్ తదితరులు పాల్గొన్నారు.


