వరంగల్: మాజీమంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆదివారం వరంగల్‌లో కార్యకర్తలతో కొండా సురేఖ దంపతులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. పదవి ఉంటే ఉంటుంది.. పోతే పోతుంది.. కానీ, సారీ అని ఏ రోజూ రాతలు రాయలేదని తెలిపారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకుడే లేడని చెప్పారు.
రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే కొండా దంపతుల లక్ష్యమని మురళి తెలిపారు. ‘‘మాటపై నిలుచోవాలి.. పదవులు ఉంటాయి.. పోతాయి. కృతజ్ఞత అనేది కొండా రక్తంలో ఉంది. నా కారు రంగు ఇండియాలో ఎవరికి ఉండదు.. అది ముస్లింలకు చిహ్నం. కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీని విడిచేది లేదు... కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం.
నా శరీరంలో ఇంకా నాలుగు బుల్లెట్స్ ఉన్నాయి.. మీ ఆశీస్సులు నన్ను బతికిస్తున్నాయి. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవకండి. కొండా సురేఖది... నాది ఓకే మాట... నా బిడ్డ సుస్మితది వేరే మాట. వరంగల్ తూర్పులో 24మంది కార్పొరేటర్లను గెలిపిస్తాను. కొండా మురళి కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి బయటకు వస్తా.
రేవంత్ అన్నకు అన‍్నీ తెలుసు. ఢిల్లీ రావాలని ఫోన్ వచ్చింది నిజం. వరంగల్ తూర్పు బాధ్యతలను నవిన్ రాజ్ కు అప్పగిస్తున్నా. కష్టపడి పని చేసేవారికి.. గెలిచే వ్యక్తి కార్పోరేటర్ టిక్కెట్ దక్కుతుంది. నాకు, నా బిడ్డ సుస్మితకు సంబంధం లేదు. నన్ను నమ్ముకొని చాలా మంది నాయకులు ఉన్నారు. కొండా మురళీ మాటంటే మాటే. అన్ని వర్గాలను కల్పుకొని ముందు పోతాం. కార్యకర్తల కోసం ఇంకో 10 ఎకరాలు అయినా అమ్ముతా. కార్యకర్తలే నా బలం’’ అని కొండా మురళి అన‍్నారు.


