ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ నవ వధువు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చినబూద గ్రామానికి చెందిన తేజశ్రీ(27)ని వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన బండె తిరుపతితో గత జూలై 5న వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరూ బైక్‌పై తేజశ్రీ తల్లిగారింటికి వెళ్తున్నారు.
జిల్లా కేంద్రం సమీపంలో ఆదిలాబాద్ ఎక్స్‌రోడ్డు ప్లైఓవర్‌పై బైక్ అదుపుతప్పి కిందపడటంతో తేజశ్రీ తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కాగా, తిరుపతికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వీరిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు పంపించారు. మంచిర్యాలలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇదీ చదవండి: భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త!


