ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం
కలెక్టర్ల సమావేశంలో మళ్లీచెప్పిన సీఎం చంద్రబాబు
అందుకు తీసుకుంటున్న చర్యలు మాత్రం శూన్యం
రోడ్డు ప్రమాదాల్లో మొదటిస్థానంలో ఆంధ్రప్రదేశ్
సాక్షి, అమరావతి: గతేడాది అక్టోబర్‌లో కర్నూలు జిల్లా చిన్నటేకూరులో కావేరి బస్సు కాలిపోయి 19 మంది సజీవదహనమైతే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ ఏడాది మార్చిలో మార్కాపురం జిల్లా రాయవరంలో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 14 మంది దుర్మరణం పాలై, 28 మంది గాయపడితే.. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినచర్యలు తీసుకుంటాం అంటూ సీఎం మళ్లీ అదే ప్రకటన చేశారు. గత కలెక్టర్ల సమావేశంలోను రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలిచ్చేశారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలోను అదే పాట పాడారు.
ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం గడప దాటడంలేదన్నది వీటిని గమనిస్తే అర్థమవుతోంది. దేశంలోనే రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందని చెబుతున్న సీఎం.. ఆ ప్రమాదాల నివారణకు ఆచరణలో కనీస చర్యలు కూడా తీసుకోవడంలేదన్నది తేటతెల్లమవుతోంది. ప్రమాదాలు జరిగినప్పడు, అధికారులతో సమీక్ష నిర్వహించినప్పుడు ఊకదంపుడు మాటలు తప్ప.. ఆచరణలో అడుగు ముందుకు వేయడంలేదు.
వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర, జిల్లాస్థాయిల్లో రోడ్డు భద్రత కమిటీలు పనిచేయడంలేదు. ఈ ఏడాది ప్రారంభంలో రోడ్డు భద్రత కమిటీలను నియమిస్తున్నట్టు రవాణాశాఖ ఉత్తర్వులు ఇచ్చినా.. అవి ఎక్కడా పనిచేస్తున్న దాఖలాలే లేవు. జిల్లాల్లో కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్పీ వైస్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలు ఎప్పటికప్పుడు సమీక్షించి ప్రమాద ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్) గుర్తించాలి. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి. అవేవీ ఎక్కడా పనిచేస్తున్నట్లు కనిపించడంలేదు.
మరోవైపు రోడ్డు ప్రమాదాల నివారణకు రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం ఇచ్చిన రూ.40 కోట్లతో రోడ్డు భద్రత పరికరాలు కొనుగోలు చేసేందుకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ నెలల తరబడి పెండింగ్‌లోనే ఉంది. పోలీసుశాఖకు రూ.20 కోట్లు, రవాణాశాఖకు రూ.20 కోట్లు చొప్పున కేటాయించిన ఈ నిధులతో స్పీడ్‌గన్స్ తదితర పరికరాలు కొనుగోలు చేయాలనే ప్రతిపాదన ఎందుకు అమలవలేదన్నది సీఎంకే తెలియాలి. ప్రతిసారి రోడ్డు ప్రమాదాల విషయంలో సీఎం చంద్రబాబు మాటలకే పరిమితమవుతున్న విషయం తాజాగా కలెక్టర్ల సమావేశంలో మరోసారి స్పష్టమైంది.
సోషల్ మీడియాను కట్టడి చేయాలి
రోడ్డు ప్రమాదాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయస్థాయిలో మొదటిస్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రాష్ట్రంలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు మాట్లాడారు. ప్రతి రోడ్డు ప్రమాదాన్ని ఆడిట్ చేయాలని, ప్రమాద ప్రాంతానికి అంబులెన్స్‌లు ఎంత సమయానికి చేరుకోగలుగుతున్నాయనేది విశ్లేషించాలని సూచించారు.
డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో నివారించే లక్ష్యంగా త్రిశూల్ పేరుతో రాష్ట్ర, జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసి కార్యాచరణను రూపొందించాలని ఆదేశించారు. సోషల్ మీడియా ఆగడాలపై మంత్రుల కమిటీ లోతుగా అధ్యయనం చేయాలని, పోలీసులు వాటిని కట్టడి చేయాలని చెప్పారు. సైబర్ టెక్నాలజీలో నిపుణుల్ని సీఐడీలో ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత రెండేళ్లలో 14 శాతం మేర నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నేరాలు 29.2శాతం దిగివచ్చాయన్నారు.


