స్లోపాయిజన్‌తో జగదీశ్వరరెడ్డి హత్య | Jagadeeshwar Reddy assassination with slow poison | Sakshi
Sakshi News home page

స్లోపాయిజన్‌తో జగదీశ్వరరెడ్డి హత్య

Sep 12 2026 3:12 AM | Updated on Sep 12 2026 3:12 AM

Jagadeeshwar Reddy assassination with slow poison

పోలీసుల విచారణలో అంగీకరించిన సాధిక్‌ఖాన్‌  

నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందురోజు వాట్సాప్‌ కాల్‌తో బ్లాక్‌మెయిల్‌ 

సౌజన్యతో కలిసి జగదీశ్వరరెడ్డిని చంపినట్టు నూకరాజుకు చెప్పిన సాధిక్‌

జగదీశ్వరరెడ్డి తండ్రికి కూడా చెబుతానని బెదిరించడంతో కుటుంబం ఆత్మహత్య నిర్ణయం  

ముగిసిన పోలీసు కస్టడీ.. సెంట్రల్‌ జైలుకు సాధిక్‌

కాకినాడ రూరల్‌: కాకినాడలో పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు అల్లుడు జగదీశ్వరరెడ్డిని హత్యచేసేందుకు అతడికి సాధిక్‌ఖాన్‌ పలుమార్లు స్లోపాయిజన్‌ ఇచ్చినట్లు తేలింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్యకేసుల్లో నిందితుడైన సాధిక్‌ఖాన్‌కు మూడురోజుల పోలీసు కస్టడీ శుక్రవారం ముగిసింది. జగదీశ్వరరెడ్డి హత్యకేసులో విచారణకు సాధిక్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సర్పవరం పోలీసులు గడువు ముగి­యడంతో శుక్రవారం అతడికి కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి, అమలాపురంలోని మొబైల్‌ కోర్టు మేజి­స్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ అనుమతితో సాధిక్‌ఖాన్‌ను రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలుకు తరలించారు. 

నూకరాజు, అత­ని భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆత్మహత్య, అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్యకేసులో సాధిక్‌ఖాన్‌ విచారణలో పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నించినా సాంకేతిక ఆధారాలు అతడిని నేరం ఒప్పుకొనేలా చేశాయి. ప్రధానంగా కాకినాడ జిల్లా సర్పవరం పోలీస్‌స్టేషన్‌లో జగదీశ్వరరెడ్డి తండ్రి భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యకేసు నమోదు చేసిన పోలీసులు సాధిక్‌ఖాన్‌ను మంగళవారం కస్టడీలోకి తీసుకుని మూడురోజులు విచారించారు. 

ఈ విచా­రణలో సాధిక్‌కు ప్రమాదకరమైన రసాయనం అందించిన హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను అతడి సమక్షంలో విచారించడంతోపాటు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌కు సాధిక్‌ అకాడమీ వద్దకు తీసుకువెళ్లారు. కీలక ఆధారాలు సేకరించి అకాడమీని సీజ్‌చేశారు. నూ­కరాజు కుటుంబం ఆత్మహత్య, అల్లుడు హత్య, సూసైడ్‌ నోట్లలో కీలకమైన అంశాలకు సంబంధించి విచారించేందుకు 200 ప్రశ్నలను సిద్ధం చేసుకున్న పోలీసులు 110 ప్రశ్నను మాత్రమే అడిగినట్లు తెలిసింది.  

స్లోపాయిజన్‌ ఇచ్చినట్టు అంగీకారం  
విచారణకు సంబంధించి పోలీసువర్గాలు తెలిపిన మేరకు.. కుమారుడు కార్తికేయరెడ్డిని రైఫిల్‌ షూటింగ్‌ కోసం సాధిక్‌ అకాడమీ వద్దకు తీసుకువెళ్లిన సౌజన్యను సాధిక్‌ఖాన్‌ ట్రాప్‌ చేసి, ఏడాదిన్నరకుపైగా సన్నిహితంగా మెలిగాడు. గత ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున జగదీశ్వరరెడ్డితో కారులో పిఠాపురం మొబైల్‌ షాపునకు వెళుతున్న సమయంలో సాధిక్‌ పదేపదే సౌజన్యకు కాల్‌ చేశాడు. అనుమానం వచ్చిన జగదీశ్వరరెడ్డి సెల్‌ లాక్కుని ప్రశ్నించడంతో ఇద్దరికి వాదన జరిగింది. 

అదేరోజు సాయంత్రం సాధిక్‌ కాకినాడలోని ఇంట్లో ఉన్న జగదీశ్వరరెడ్డిని కొట్టి, చాకుతో హత్యాయత్నం చేశాడు. ఆర్థికంగా స్థితిమంతుడు, క్లాస్‌వన్‌ కాంట్రాక్టర్‌ అయిన జగదీశ్వరరెడ్డి పరువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయ­లేదు. సాధిక్‌.. సౌజన్యతో చనువుగా ఉంటూనే జగదీశ్వరరెడ్డిని హత్యచేసేందుకు ప్లాన్‌ చేశాడు. ఆహారం అరుగుదలకు సంబంధించిన సమ­స్యతో సర్ప­వ­రం జంక్షన్‌లో ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న జగదీశ్వరరెడ్డికి పలుమార్లు కొబ్బరి బొండంలో స్లోపాయిజన్‌ రసాయనం కలిపి ఇచ్చాడు. 

చివరిగా హైదరాబాద్‌­లోని ఓ కార్పొరేట్‌ హాస్పిటల్‌ ఉండగా ఇచ్చాడు. జగదీశ్వరరెడ్డి మృతికి ముందురోజు జూలై ఒకటో తేదీ రాత్రి ఆస్పత్రి రీహేబిలిటేషన్‌ సెంటరులో ఉండగా రాత్రి సమయంలో పొటాషియం సైనేడ్‌ ఇచ్చినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే స్లో పాయిజన్‌ మాత్రమే ఇచ్చా­నని, సైనేడ్‌ ఇవ్వలేదని సాధిక్‌ పోలీసుల వద్ద అంగీకరించాడు.

ఆస్తికోసం నరకం చూపించాడు
పీఆర్‌ ఏఈగా పనిచేస్తున్న నూకరాజుకు కుమారుడు చనిపోగా ఒకే కుమార్తె సౌజన్య ఉంది. దీంతో ఆమె తండ్రి ఆస్తులతోపాటు భర్త జగదీశ్వరరెడ్డి ఆస్తులపై సాధిక్‌ కన్నుపడింది. సౌజన్యను ఆస్తికోసం వేధించాడు. భర్త చనిపోయిన తరువాత తన పేరిట రావులపాలెంలో ఉన్న సుమారు రూ.25 కోట్ల విలువైన 44 సెంట్ల స్థలాన్ని అత్తమామలకు రాసి ఇచ్చేందుకు సౌజన్య సిద్ధమైంది. ఆ స్థలాన్ని తన పేరిట రాయాలని సాధిక్‌ ఆమెపై ఒత్తిడి తెచ్చి చిత్రహింసలకు గురిచేశాడు. 

నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఆగస్టు 16కు ముందురోజు సాధిక్‌ ఆ స్థలాన్ని తనకే ఇవ్వాలని పట్టుబట్డాడు. ఇవ్వకపోతే సౌజన్యతో కలిసి జగదీశ్వరరెడ్డిని చంపిన విషయం అతడి తండ్రి భాస్కరరెడ్డికి చెబుతానని బ్లాక్‌మెయిల్‌ చేశాడు. అల్లుడి హత్య గురించి అప్పుడే తెలుసుకున్న నూకరాజు కుటుంబం.. సాధిక్‌ తమను బతకనివ్వడని భయపడింది. నూకరాజు, భార్య, కుమార్తె, మనుమడు కలిసి మరుసటిరోజు గోదావరిలో దూకేశారు. మనుమడు కార్తికేయరెడ్డి బతకగా మిగిలిన ముగ్గురు చనిపోయారు. 

ఈ విషయం తెలిసిన సాధిక్‌ మీరట్‌కు పారిపోయి తరువాత పోలీసులకు చిక్కాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందురోజు వాట్సాప్‌ కాల్, మామూలు కాల్‌ ద్వారా నూకరాజును బ్లాక్‌మెయిల్‌ చేయడం, ఆస్తికోసం బెదిరించడం వంటి కీలక ఆధారాలను సేకరించిన పోలీసులు విచారణలో ఆ అంశాలు ప్రస్తావించడంతో జగదీశ్వరరెడ్డిని హత్యచేసినట్లు సాధిక్‌­ఖాన్‌ అంగీకరించినట్లు తెలిసింది. నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో విచారించేందుకు రాజమహేంద్రవరం పోలీసులు అతడిని కస్టడీకి ఇవ్వమని న్యాయసా­్థనాన్ని కోరేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement