మందు బిళ్ల.. జేబు గుల్ల! | 50 percent of hospitals in the state are out of medicines | Sakshi
Sakshi News home page

మందు బిళ్ల.. జేబు గుల్ల!

Sep 12 2026 2:47 AM | Updated on Sep 12 2026 2:47 AM

50 percent of hospitals in the state are out of medicines

ప్రభుత్వాస్పత్రుల్లో రోగుల పాట్లు..

రాష్ట్రంలో 50% ఆస్పత్రుల్లో మందులు ఖాళీ 

స్వయంగా సర్కారు సొంత సర్వేలో వెల్లడి

చేతిలో చీటీలు పెట్టి పంపేస్తున్న వైద్యులు 

ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల్లో కొనుక్కోవాల్సిందే 

పెద్ద జబ్బుల రోగులకు పెనుభారంగా మందుల కొనుగోలు 

క్యాన్సర్‌ నుంచి కిడ్నీ రోగుల వరకు పేదలపై ప్రతి నెలా రూ.వేలల్లో భారం 

సీఎం, వైద్యశాఖ మంత్రి సొంత జిల్లాల్లోనూ దారుణ పరిస్థితులు 

పీహెచ్‌సీల్లో సేవలూ ఘోరమంటున్న 60 శాతం మంది రోగులు

సాక్షి, అమరావతి: ఉచిత వైద్యం దూరం.. ఉచిత మందులూ కరువే! ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి పేదలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం కనీసం మందు బిళ్లలు కూడా ఇవ్వకుండా జనం జేబులు గుల్ల చేయిస్తోంది. ప్రభుత్వాస్పత్రులను మందులకు కూడా దిక్కులేని దౌర్భాగ్య పరిస్థితుల్లోకి నెట్టేసింది. ప్రాణాంతక జబ్బుల బారిన పడిన రోగులు ప్రతి నెలా ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారు. వైద్య సేవల కోసం ప్రాణ భయంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు, మందుల షాపుల వైపు పరుగులు తీస్తున్నారు. 

చంద్రబాబు సర్కార్‌ ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసి నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.3 వేల కోట్లకుపైగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంతో పాటు కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెట్టి పేదలకు ఉచిత వైద్యాన్ని దూరం చేస్తోంది. ప్రభుత్వ వైద్య రంగాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే కుట్రలు చేస్తోంది. ఏఐ డాక్టర్‌.. డిజిటల్‌ వైద్యం.. టెలి మెడిసిన్‌.. ఆధునిక వైద్య సేవలంటూ సీఎం చంద్రబాబు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని సాక్షాత్తూ ప్రభుత్వమే నిర్వహించిన సర్వే బయటపెట్టింది. 

         మందులు బయట కొనుక్కోవాలంటూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రాసిచ్చిన చీటీ 

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సిన మందులకూ గతి లేదని వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు కనీసం మందులకు కూడా దిక్కులేని దుస్థితి నెలకొన్నట్లు ఈ ఏడాది జనవరి–జూలై మధ్య స్వయంగా ప్రభుత్వమే నిర్వహించిన ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో వెల్లడి కావడం ప్రభుత్వ వైద్య రంగం దయనీయ పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తోంది. సాక్షాత్తూ సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సొంత జిల్లాల్లోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం గమనార్హం.  

ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల బాట.. 
ప్రజలకు ఉచితంగా వైద్యం, మందులు అందించాల్సిన ప్రభుత్వం.. రోగుల చేతికి చీటీలు ఇచ్చి ప్రైవేట్‌ మెడికల్‌ షాపుల బాట పట్టిస్తోంది. ఇది పేదల జేబులకు పెను భారంగా మారుతోంది. ప్రాణాంతక జబ్బుల బారిన పడి దినదిన గండంగా గడుపుతున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వాస్పత్రులకు వైద్యం కోసం వెళ్లిన రోగులపై మందుల కొనుగోళ్ల రూపంలో అదనంగా రూ.వేలల్లో భారం పడుతోంది.  

సీఎం, వైద్యశాఖ మంత్రి సొంత జిల్లాల్లో దారుణం.. 
పేద రోగులకు ఉచితంగా మందుల పంపిణీ విషయంలో సీఎం, వైద్య శాఖ మంత్రి సొంత జిల్లాల్లోనే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం చంద్రబాబు సొంత జిల్లా తిరుపతిలోని రుయా, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంతపురం జిల్లా జీజీహెచ్‌ల్లోని సేవలపై రోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.

అనంత జీజీహెచ్‌లో వైద్యులు రాసిన ఉచిత మందులు అందడం లేదని రోగులు చెబుతున్నారు. ప్రివెంటివ్‌ కేర్‌లో అత్యంత కీలకమైన పీహెచ్‌సీల్లో తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. తిరుపతి జిల్లాలోని ముక్కవారిపల్లి, అనంతపురం జిల్లాలోని యాడికి పీహెచ్‌సీల్లో సేవలు దారుణంగా ఉన్నట్లు 60 శాతం మంది రోగులు పేర్కొన్నారు. ఘోరమైన పనితీరులో సీఎం, వైద్య శాఖ మంత్రి జిల్లాల్లోని పీహెచ్‌సీలు టాప్‌ 20లో నిలిచాయి.  

పెద్ద జబ్బులు.. రోగుల బాధలు
» ప్రభుత్వాస్పత్రుల్లో ఉచిత మందులు అందుబాటులో లేకపోవడంతో క్యాన్సర్, గుండె, కిడ్నీ, ఇతర పెద్ద జబ్బుల బారినపడ్డ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. వైఎస్సార్‌ జిల్లా కడపలోని వైఎస్సార్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో రోగులకు ఉచిత మందులు అందడం లేదు. దీంతో బయటే కొనుగోలు చేస్తున్నారు.  

»  అత్యంత వెనుకబడిన ఉత్తరాంధ్రలోని ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పలాస రీసెర్చ్‌ సెంటర్‌ను బాబు సర్కార్‌ గాలికి వదిలేసింది. ఇక్కడ కిడ్నీ బాధితులకు ఉచిత మందులు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కిడ్నీ రోగులు ప్రైవేట్‌లో మందుల కొనుగోళ్ల కోసం నెలకు రూ.15 వేల మేర చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది.

»  కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో ప్రైవేట్‌కు కట్టబెట్టడం కోసం వైఎస్సార్‌సీపీ హయాంలో అభివృద్ధి చేసిన మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల బోధనాస్పత్రులను ప్రభుత్వం అంపశయ్య ఎక్కించింది. ఎనిమిది నెలలుగా పులివెందుల జీజీహెచ్‌లో రోగులకు ఉచిత మందులు అందక అల్లాడుతున్నారు. మదనపల్లెలో రోగులు మందుల చీటీలతో ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్స్‌ బాట పడుతున్నారు.  

»  సీఎం చంద్రబాబు నివాసానికి కూతవేటు దూరంలో ఉండే గుంటూరు జీజీహెచ్‌లో  వరుసగా మే, జూన్, జూలై నెలల్లో రోగులకు ఉచిత మందులు అందని దుస్థితి. గుంటూరు శ్వాసకోశ ఆస్పత్రిలో రోగులకు ప్రభుత్వం మందులు ఇవ్వకుండా బయట కొనుగోలు చేయాలని సూచించింది.

»  విశాఖ ఈఎన్‌టీ ఆసుపత్రిలో రోగులకు ఉచిత మందులు అందలేదు. ఇక్కడి ఛాతీ, అంటువ్యాధుల ఆసుపత్రిలో జనవరిలో సగం మంది రోగులు మందులు అందక బయట కొనుగోలు చేయాల్సి వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement