రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్
స్పెషల్ ఆఫీసర్‌ను నియమించడం ప్రభుత్వ హడావుడే
డాక్టర్ ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన
సాక్షి, రాజమహేంద్రవరం: డాక్టర్ ప్రియాంక హత్య కేసులో పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని ఆమె తండ్రి వెంకటేశ్ ఆరోపించారు. శుక్రవారం రాజమహేంద్రవరంలో వైఎస్సార్ సీపీ ప్రచార కమిటీ నేతృత్వంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దర్యాప్తు కోసం స్పెషలాఫీసర్‌ను నియమించామని ప్రభుత్వం హడావుడి చేసింది. ఆయనేమో వారం పది రోజుల నుంచి సెలవులో ఉన్నారు. ఇలా అయితే దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది’’ అని వెంకటేశ్ మండిపడ్డారు.
తాము మూడు రోజులుగా వివరాలు సేకరిస్తుంటే, ఎవరూ సహకరించడం లేదన్నారు. స్వతంత్ర హాస్పిటల్, ప్రసాద్ ఐమ్యాక్స్ యాజమాన్యాలు సీసీ కెమెరాల ఫుటేజీ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. ‘పోలీసుల వద్ద ప్రత్యక్ష సాక్షుల వివరాలు లేవు. ఇలాగైతే నిందితులకు ఎప్పుడు శిక్ష పడుతుంది. నిందితులను మూడు రోజులపాటు రక్షించిన రాజకీయ నాయకులు, పోలీసులను కూడా శిక్షించాలి. రాష్ట్రంలో యువత గంజాయి మత్తులో అకృత్యాలకు పాల్పడుతున్నారు.
రేయింబవళ్లూ కష్టపడి చదివి పీజీ సీటు సంపాదించుకున్న నా కుమార్తెను దారుణంగా హతమార్చారు. నా బిడ్డ డాక్టర్‌గా కొద్ది రోజుల్లో ఇంటికి వస్తుందనుకుంటే శవాన్ని పంపించారు’ అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన బిడ్డకి జరిగినట్లు ఎవరికీ జరగకూడదని, ఏ తండ్రికీ కడుపుకోత రాకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజానికి ప్రాణం తీసేవాళ్లు కావాలా? ప్రాణం పోసే వాళ్లు కావాలా? తమకు న్యాయం జరగకపోతే ఇలాంటి రాక్షసులు మరింతగా రెచ్చిపోతారని అన్నారు. కేసు దర్యాప్తు విషయంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిందితులకు కొమ్ముకాస్తోందని ఆయన ఆరోపించారు.


