సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చేసిన పోస్టు
నారా బ్రాహ్మణి ‘నిజం గెలిచింది’ పోస్ట్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్ సెటైర్లు
సాక్షి, అమరావతి: ‘నిజం గెలిచింది’ అంటూ సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌పై సీబీఐ మాజీ డైరెక్టర్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వరరావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామగారిని కీర్తిస్తూ పెట్టిన ఆ పోస్ట్‌లో వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో బ్రహ్మాండంగా పండించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగోతాలు అంటూ మూడు అంశాలను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టయి మూడేళ్లయిన సందర్భంగా బ్రాహ్మణి హైదరాబాద్‌లోని తన నివాసంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు. ‘నిజం గెలిచింది’ నినాదంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనిపై నాగేశ్వరరావు ఇలా స్పందించారు.
రెండెకరాల నుంచి.. సంపన్న సీఎం దాకా..
‘రెండో, ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితం ప్రారంభించారు. నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకొచ్చారు’ అని చంద్రబాబుపై నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. ఆయన్ని నిస్వార్థ’ అవినీతిపరుడు అంటూ ఎద్దేవా చేశారు. ‘అగౌరవ శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు’ అంటూ సంబోధించారు.
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు
ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషిచేసిన ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎన్టీఆర్ అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు, తెలుగు ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు.
విభజనకు లిఖితపూర్వక అంగీకారం
‘అంతే కాదు తల్లీ.. మీ మామగారి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి’ అంటూ మూడో అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుజాతి ఐక్యత, ఆత్మగౌరవం కోసం ఏర్పడిన టీడీపీని ఎన్టీఆర్ నుంచి గుంజుకోవడమే కాకుండా, 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు చంద్రబాబు లిఖితపూర్వకంగా అంగీకరించారని గుర్తుచేశారు. తద్వారా తెలుగుజాతికి తీరని ద్రోహం చేసిన ఘనుడంటూ విమర్శించారు. ‘సృజనాత్మక భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?’ అంటూ బ్రాహ్మణిని నాగేశ్వరరావు ప్రశ్నించారు.


