కాలువలకు నిధులు కట్! | Another betrayal by Chandrababu Naidu government to the Polavaram project | Sakshi
Sakshi News home page

కాలువలకు నిధులు కట్!

Sep 12 2026 3:21 AM | Updated on Sep 12 2026 3:21 AM

Another betrayal by Chandrababu Naidu government to the Polavaram project

జీవనాడికి మరో ద్రోహం

7.20 లక్షల ఎకరాల పోలవరం ఆయకట్టుకు ఈ డిస్ట్రిబ్యూటరీలే కీలకం...

వాటి పనులకు రూ.5,338.5 కోట్లు కేటాయించని కేంద్రం

2023లోనే కేంద్రానికి ప్రతిపాదనలు.. అప్పుడే తుది దశకు చేరిన ఆమోద ప్రక్రియ

కేంద్రం నిధులు ఇవ్వకపోయినా చంద్రబాబు సర్కార్‌ నోరుమెదపని వైనం

డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకపోతే పోలవరం ఫలాలు రైతులకు దూరమే

41.15 మీటర్లకే నీటి నిల్వ పరిమితం.. 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందడం కష్టమే

కేంద్రం నిర్ణయంతో రూ.5,338.5 కోట్ల భారం రాష్ట్రంపైనే పడే అవకాశం

పోలవరం స్వప్నం కళ్ల ముందే కరిగిపోతోందని రైతులు, నిపుణుల ఆందోళన

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు సర్కార్‌ చేసిన మరో ద్రోహం బహిర్గతమైంది.. కుడి, ఎడమ కాలువల కింద 7.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి డిస్ట్రిబ్యూటరీల (ఉప కాలువలు, పిల్ల కాలువలు) పనులకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు సర్కార్‌ నోరుమెదపడం లేదు. ఓ వైపు 2027, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి, జాతికి అంకితం చేస్తామంటూ పదే పదే ప్రకటిస్తున్న చంద్రబాబు సర్కార్‌ ఇంతవరకు డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టే ఆలోచన కూడా చేయకపోవడాన్ని సాగునీటిరంగ నిపుణులు ఎత్తిచూపుతున్నారు. 

గరిష్ఠ నీటి మట్టం 45.72 మీటర్లతో కాకుండా కనిష్ఠ నీటి మట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు.. అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ 2024, ఆగస్టు 28న కేంద్ర మంత్రివర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మిగిలిన పనులు పూర్తికి రూ.12,157.53 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చిచెప్పింది. అందులో డిస్ట్రిబ్యూటరీల పనుల అంచనా వ్యయాన్ని మినహాయించడం గమనార్హం. డిస్ట్రిబ్యూటరీల పనులకు రూ.5,338.5 కోట్లు అవసరం. అంటే.. ఆ భారం కూడా రాష్ట్ర ఖజానాపై పడినట్లేనని సాగునీటిరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

డిస్ట్రిబ్యూటరీలకు 2023లో ప్రతిపాదనలు..
పోలవరం కుడి కాలువ పొడవు 178.812 కిలో మీటర్లు ప్రవాహ సామర్థ్యం 17,560 క్యూసెక్కులు. పోలవరం ఎడమ కాలువ పొడవు 212.32 కి.మీ.లు. ప్రవాహ సామర్థ్యం 17,580 క్యూసెక్కులు. కుడి కాలువ కింద 3.2 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేయడానికి వీలుగా డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.2,248.89 కోట్లు.. ఎడమ కాలువ కింద 4 లక్షల ఎకరాలకు నీటిని సరఫరా చేసేందుకు డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఏర్పాటుకు రూ.3,090.01 కోట్లు వ్యయం అవుతుందని 2023లో పోలవరం ప్రాజెక్టు అధికారులు అంచనా వేశారు. 

ఆ మేరకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లను తయారుచేసిన పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ), కేంద్ర జల్‌ శక్తి శాఖకు అప్పట్లోనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పంపింది. వాటిపై సీడబ్ల్యూసీ అధికారులు పలుమార్లు లేవనెత్తిన సందేహాలను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు నివృత్తి చేశారు. డిస్ట్రిబ్యూటరీల అంచనా వ్యయాన్ని ఆమోదించే ప్రక్రియ అప్పట్లోనే తుది దశకు చేరుకుంది. 

కానీ.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీలకు కేంద్రం నిధులు కేటాయించకపోయినా చంద్రబాబు సర్కార్‌ నోరుమెదపకపోవడం గమనార్హం. జలాశయం నిర్మాణం పూర్తయ్యేలోగా కుడి, ఎడమ కాలువలతోపాటు డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేస్తేనే సత్వరమే ఆయకట్టుకు నీళ్లందించి రైతులకు పోలవరం ఫలాలను అందించే అవకాశం ఉంటుంది. అప్పుడే పోలవరం ఫలాలు రైతులకు అందుతాయి. కానీ.. చంద్రబాబు సర్కార్‌ ఆ దిశగా చర్యలు తీసుకోకుండా రైతులకు ద్రోహం చేస్తోందని సాగునీటిరంగ నిపుణులు మండిపడుతున్నారు. 

కరిగిపోతున్న స్వప్నం..
గోదావరి ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకారం 2005లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దశాబ్దాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టును సాకారం చేస్తూ పనులు చేపట్టారు. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 194.6 టీఎంసీలు. ఈ ప్రాజెక్టు ద్వారా 322 టీఎంసీలను వినియోగించుకోవడానికి ట్రిబ్యునల్‌ అనుమతి ఇచ్చింది. కానీ.. నీరు నిల్వ చేసే ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల పోలవరం రిజర్వాయర్‌ను చంద్రబాబు సర్కార్‌ బ్యారేజ్‌గా మార్చేసింది. ప్రాజెక్టులో 45.72 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేయాలంటే భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ.30 వేల కోట్లకుపైగా అవసరం. 

ఆ భారం రాష్ట్ర ఖజానాపై పడుతుందని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు. ఇక 2017, ఆగస్టు 17న నాటి చంద్రబాబు సర్కార్‌ కేంద్రానికి పంపిన డీపీఆర్‌–2లో చేసిన తప్పిదాల వల్ల కుడి కాలువ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు, ఎడమ కాలువ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులతో చేపట్టిన పనులకే బిల్లులు ఇస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ తేల్చి చెప్పింది. దీని వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.4,753.93 కోట్ల భారం పడుతుందని జల వనరుల శాఖ అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

పోలవరంలో 41.15 మీటర్ల వరకే నీటి నిల్వను పరిమితం చేయడం వల్ల గోదావరికి వరద వచ్చే రోజుల్లో మాత్రమే కుడి, ఎడమ కాలువలు.. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల కింద ఉన్న 1.58 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడానికి అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కింద మిగతా 5.62 లక్షల ఎకరాలకు నీళ్లందించడం సాధ్యం కాదు. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలు, గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాల స్థిరీకరణ, ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం కింద 8 లక్షల ఎకరాలకు నీళ్లందించడం అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తి పూర్తి స్థాయిలో చేపట్టడమూ అసాధ్యమే. అంటే కళ్ల ముందే చిరకాల స్వప్నం కరిగి పోతుండటంతో రైతులు, సాగు నీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement