కర్నూలులో జిల్లా కోర్టు నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న న్యాయవాదులు
కర్నూలులో న్యాయవాదుల భారీ బైక్ ర్యాలీ
కర్నూలు(సెంట్రల్): హైకోర్టు బెంచ్ విషయంలో 2014 నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేస్తూనే ఉన్నారని, మరోసారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని కర్నూలు న్యాయవాదులు తేల్చి చెప్పారు. శుక్రవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా కర్నూలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మీదేవి, వై.జయరాజు, మురళీ మాట్లాడుతూ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదే హామీని ఇచ్చి కాలం గడిపేశారని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాలం వెళ్లదీస్తుండడంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టామన్నారు. సర్క్యూట్ బెంచ్‌ను ఎలాంటి పరిస్థితుల్లో ఒప్పుకోమని, శాశ్వత హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.


