పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం
గిరిజన గర్భిణుల వసతి గృహాలు మూసివేసి తమ పొట్టకొట్టారని ఆవేదన
తక్షణం విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజన గర్భిణుల వసతిగృహాలను మూసివేసి తమను విధుల నుంచి తొలగించారని, తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏఎన్‌ఎంలు నినదించారు. శుక్రవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద పెట్రోల్ బాటిళ్లతో నిరసన వ్యక్తం చేశారు. సూసైట్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నం చేశారు. జాయింట్‌కలెక్టర్(జేసీ), ఐటీడీఏ పీఓ వైశాలి తమ సమస్యను పరిష్కరిస్తామని మాట ఇచ్చి ఇప్పుడు ముఖంచాటేశారని ఆవేదన వ్యక్తంచేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఏఎన్‌ఏంలను వారించారు. పెట్రోల్‌బాటిళ్లను లాక్కున్నారు.
అసలేం జరిగిందంటే..
గతంలో సాలూరు, గుమ్మలక్ష్మీపురంలలో గిరిజన గర్భిణుల వసతి గృహాలను అప్పటి ఐటీడీఏ పీఓ లక్ష్మీశా ఆధ్వర్యంలో ప్రారంభించారు. వాటి వల్ల గిరిజనుల్లో మాతా శిశు మరణాలు తగ్గాయి. గత ప్రభుత్వం హయాం వరకూ ఇవి సజావుగా సాగాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే.. జిల్లాలో ఈ రెండు వసతి గృహాలను మూసివేశారు. గుమ్మలక్ష్మీపురం, సాలూరు హాస్టళ్ల ఉద్యోగులు రోడ్డున పడ్డారు. తమకు ప్రత్యామ్నాయం చూపించాలని పోరుబాట పట్టారు.
గత నెలలో పార్వతీపురం ఐటీడీఏ వద్ద బైఠాయించిన సమయంలో పీఓగా ఉన్న జేసీ వైశాలి రెండువారాల్లో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మధ్యలో ఓసారి మంత్రి సంధ్యారాణి నుంచి అనుమతి పత్రం తీసుకురావాలని సూచించడంతో ఏఎన్‌ఎంలు అది తీసుకొచ్చారు. అయినా తమను విధుల్లోకి తీసుకోకపోవడంతో గత సోమవారం పీజీఆర్‌ఎస్‌లో విన్నవించుకున్నారు. దీంతో విసిగిపోయిన ఏఎన్‌ఎంలు శుక్రవారం మధ్యాహ్నం కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. దాదాపు రెండుగంటలపాటు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నా జేసీ కిందికి దిగి రాలేదు. డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురిలను ఏఎన్‌ఎంల వద్దకు పంపారు. వారు సర్దిచెప్పే యత్నం చేసినా ఏఎన్‌ఎంలు వినలేదు. మూడు రోజుల వరుస సెలవుల అనంతరం ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.


