కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా? | Tpcc Chief Mahesh Goud Reaction On Konda Surekha Issue | Sakshi
Sakshi News home page

కొండా సురేఖను అధిష్టానం పిలిచిందా?

Sep 14 2026 1:26 PM | Updated on Sep 14 2026 1:48 PM

Tpcc Chief Mahesh Goud Reaction On Konda Surekha Issue

సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే స్పీకర్‌పై వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్‌పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమంలో దళిత కార్డును కేసీఆర్ ఎలా వాడారో చూశాం. గద్దర్, అందెశ్రీని ఏ రకంగా అవమానించారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ 2003లో ఇచ్చిన హామీలపై డాక్యుమెంట్ విడుదల చేస్తున్నా.. కేసీఆర్ ఇచ్చిన హామీలపై శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని మహేష్‌ గౌడ్‌ డిమాండ్‌ చేశారు.

‘‘దళిత బంధు ఎంతమందికి ఇచ్చారు? హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు. అంబేద్కర్ విగ్రహం పెడితే సరిపోదు ఆ మహాభావుని సలహాలు, విలువలు ఆచరణలో పెట్టాలి. దళితులు నడిచిన నేలను శుద్ధి చేయడం దారుణం. దళిత జాతిని కేసీఆర్ అవమానించారు. కేసీఆర్ రాజకీయాన్ని శుద్ధి చేయాలి. ప్రజాస్వామ్య దేశంలో ఇంతకంటే దారుణం మరోటి లేదు’’ అని మహేష్‌ గౌడ్‌ ధ్వజమెత్తారు.

‘‘దళితులకు అత్యున్నత పదవులు ఇచ్చి కాంగ్రెస్ గౌరవించింది. రీల్ మాక్ అసెంబ్లీ పెట్టడం కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను ప్రతిపక్ష నాయకుడిని చేయండి. పదేళ్ల బీఆర్ఎస్ బీసీ,దళిత, మైనార్టీ వ్యతిరేక పాలనను ప్రజలు మరిచిపోలేదు. దళిత స్పీకర్‌ను అధ్యక్ష అని పిలవాల్సి వస్తుందని కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. మీనాక్షీ విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు. మీనాక్షి విషయంలో అధిస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆ అంశంపై సమాచారం లేదు..
‘‘కొత్త ఇంఛార్జ్‌ విషయంలో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. కొండా సురేఖను అధిష్టానం పిలిచిందన్న అంశంపై నాకు సమాచారం లేదు’’ అని మహేష్‌ గౌడ్‌ పేర్కొన్నారు. కాగా, కొండా సురేఖ.. కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దలను కలిసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఢిల్లీలో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, వరంగల్‌ ప్రాంతంలో పార్టీ బలోపేతం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశముందని కాంగ్రెస్‌ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే, సురేఖకు కీలక బాధ్యత అప్పగించే అంశంపై పార్టీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీకి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన బాధ్యతను అప్పగించనున్నారా? లేక పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ప్రత్యేక పాత్ర కల్పించనున్నారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

ఇదీ చదవండి: కొండా సురేఖది.. నాది ఒకే మాట.. సుస్మితది మాత్రం..: కొండా మురళి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement