న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించేందుకు లక్షలాది మంది విద్యార్థులు రాసే నీట్ యూజీ పరీక్ష విధానంలో త్వరలో కీలక మార్పు రానుంది. ఇకపై ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) నిర్వహించేందుకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) సిద్ధమవుతోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్,పేపర్ విధానం, ఓఎంఆర్ షీట్ల వినియోగానికి త్వరలో స్వస్తి పలకనున్నట్లు ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ తెలిపారు.
దేశంలో ప్రస్తుతం నీట్ యూజీ ప్రధానంగా పెన్,పేపర్ పరీక్షగా కొనసాగుతోంది. అయితే దీన్ని కూడా త్వరలో కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చనున్నట్లు అభిషేక్ సింగ్ వెల్లడించారు. ‘మా పరీక్షలన్నీ సీబీటీ’ విధానంలోనే జరుగుతున్నాయి. నీట్ మాత్రమే మిగిలింది. దీనినీ త్వరలో సీబీటీకి మారుస్తాం’ అని ఆయన తెలిపారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణకు పరీక్షా మౌలిక వసతులను మరింత విస్తరించాల్సి ఉంటుందని ఎన్‌టీఏ డీజీ చెప్పారు. భద్రతా చర్యలను కూడా బలోపేతం చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతం జేఈఈ, యూజీసీ నెట్, సీయూఈటీ, నిఫ్ట్ పరీక్షలు సీబీటీ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఎన్‌టీఏ నిర్వహించే అన్ని పరీక్షలూ సీబీటీ విధానంలోకి వస్తాయని పేర్కొన్నారు.
ఎన్‌టీఏ ప్రస్తుతం స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా కొనసాగుతోంది. కేంద్ర స్థాయిలో లక్షలాది మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే బాధ్యతను ఇది నిర్వర్తిస్తోంది. 2026లో జరిగిన పేపర్ లీక్ వ్యవహారం తర్వాత సంస్థపై తీవ్ర విమర్శలు, ప్రజాగ్రహం, న్యాయపరమైన ఒత్తిడి పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో జులైలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. భవిష్యత్తులో ఇతర దేశాలకు, ముఖ్యంగా బ్రిక్స్ దేశాలకు డిజిటల్ పరీక్షా పరిష్కారాలను అందించాలన్న ఆలోచన ఎన్‌టీఏ ఉందని సింగ్ తెలిపారు.
అయితే ప్రస్తుతం భారత్‌లోనే పరీక్షా వ్యవస్థను పటిష్ఠం చేయడం, ప్రక్రియలను మెరుగుపరచడం, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించడమే ప్రధాన ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు కృత్రిమ మేధ (ఏఐ), బయోమెట్రిక్ ధ్రువీకరణ కీలకంగా మారుతున్నాయని సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత ధ్రువీకరణతో పాటు ముఖ గుర్తింపు విధానాన్ని ఉపయోగిస్తున్నామని తెలిపారు. ఆధార్ డేటాబేస్, ఫేస్ ఆథెంటికేషన్ వ్యవస్థతో ఈ సమస్యను పరిష్కరించామని, ఎన్‌టీఏ నిర్వహించే దాదాపు ప్రతి పరీక్షలో ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.
ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ


