రంగారెడ్డి జిల్లాలో ఒక రైతు పదేళ్లుగా ఐదెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తు న్నాడు. విత్తనం కొనేది అతడే. ఎరువులు వేసేది అతడే. పంట ఎండిపోతే నష్టం భరించేదీ అతడే. కానీ ప్రభుత్వ రికార్డులో ఆ భూమి సాగు చేసే రైతు అతడు కాదు. అందుకే బ్యాంకు రుణం రాదు, పంటల బీమా రాదు, పెట్టుబడి సాయం రాదు, కరవు వచ్చినప్పుడు పరిహారమూ రాదు. దశాబ్దాలుగా మన కౌలు రైతుల కథ ఇదే. ఇప్పుడు అడగాల్సిన ప్రశ్న ఒక్కటే– దేశం మొత్తాన్ని డిజిటల్‌గా మారుస్తున్న కొత్త వ్యవస్థ ఈ కథను మారుస్తుందా?
అగ్రిస్టాక్ అంటే ఏమిటి?
కేంద్ర ప్రభుత్వం రూ. 2,817 కోట్లతో అగ్రిస్టాక్ అనే డిజిటల్ వ్యవస్థను నిర్మిస్తోంది. దేశంలోని 14 కోట్ల వ్యవసాయ కమతాలకూ, ప్రతి రైతుకూ ఆధార్‌తో ముడిపడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తారు. భూమి వివరాలు, ఏ పంట వేశారు, ఎంత దిగుబడివచ్చింది– అన్నీ ఉపగ్రహ చిత్రాలతో కలిపి ఒకచోట పెడతారు. దీని ఆధారంగా రాయితీలు, బీమా, రుణాలు, సలహాలు అన్నీ వేగంగా అందుతాయని చెబుతున్నారు. పంటల బీమా క్లెయిము రావడానికి ఇప్పుడు ఏళ్లు పడుతోంది. ఉపగ్రహ చిత్రాలతో పంట నష్టాన్నివెంటనే గుర్తిస్తే రైతుకు నిజంగానే మేలు జరుగుతుంది. కానీ ఒక్క ప్రశ్న.
మన వ్యవసాయ సమస్య నిజంగా సమాచారం లేక పోవడమేనా? దేశంలో ఇప్పటికే 22 కోట్ల భూసార కార్డులు ఇచ్చారు. కేంద్ర భూగర్భ జల మండలి 25 వేల బావులను ఏటా కొలుస్తోంది. వ్యవసాయ ఖర్చులను 1970ల నుంచీ ప్రతి ఏటా లెక్కిస్తున్నారు. రైతు ఆత్మహత్యల సంఖ్యను 1995 నుంచీ నమోదు చేస్తున్నారు. వాతావరణ శాఖకు 730 కేంద్రాలున్నాయి. మరి ఫలితం? నేలలో సేంద్రియ కర్బనం తగ్గుతూనే ఉంది. భూగర్భ జలం అడుగంటుతూనే ఉంది. రైతుల అప్పులు పెరుగు తూనే ఉన్నాయి. సమాచారం లేకపోవడమే అసలు అడ్డంకి అయితే ఈ సమస్యలు ఎప్పుడో తీరిపోయేవి.
ఎరువుల విషయమే చూడండి: నత్రజని తగ్గించమని భూసార కార్డు చెబుతుంది. కానీ యూరియా బస్తా ధర 85% రాయితీతోఅందుతుంది. నేల ఏం చెప్పినా, మార్కెట్లో అన్నింటికంటే చౌక అదే. అందుకే రైతు దాన్నే వాడతాడు. కంప్యూటర్ ఎంత తెలివైనదైనా ఈ లెక్క మార్చదు.
అసలు లోపం ఎక్కడుంది?
దేశంలో దాదాపు 40 శాతం వ్యవసాయ కుటుంబాలు తమవి కాని భూముల్ని సాగు చేస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో 60 నుంచి 80 శాతం చేసేది మహిళలు; కానీ భూమి ఉన్నది కేవలం 13.9 శాతం మందికే. అటవీ హక్కుల పత్రాలు రాని ఆదివాసీలు, భూమిలేని కూలీలు, వలస వెళ్లి కౌలుకు చేసేవాళ్లు– వీళ్లెవరూ భూ రికార్డులో కనిపించరు.
తెలంగాణ రైతు భరోసా అనుభవం మన కళ్ల ముందే ఉంది. అది భూ రికార్డులతో ముడిపెట్టిన పథకం. అందుకే లక్షలాది కౌలు రైతులు దాని పరిధిలోకి రాలేదు. ఇప్పుడు అదే లోపాన్ని దేశమంతటికీ, డిజిటల్ రూపంలో, శాశ్వతంగా అమర్చుతున్నాం. కాగితపు రికార్డును అప్పుడప్పుడూ సరిదిద్దుకోవచ్చు. కంప్యూటర్‌లో ఒకసారి నమోదైన తప్పును కదిలించడం చాలా కష్టం. తెలంగాణలో భూభారతి, ఆంధ్రాలో వెబ్ ల్యాండ్. దాని మీద అగ్రిస్టాక్. దాని మీద కృషి విస్తార్ అనే సలహాల వ్యవస్థ. కింది అంతస్తులో ఉన్న పగుళ్లు పైకి ఎక్కుతూ పెద్దవవుతాయి.
రైతు అనుమతితోనే సమాచారం పంచుకుంటామని చెబు తున్నారు. కానీ పీఎం–కిసాన్ డబ్బు, పంటల బీమా, కిసాన్ క్రెడిట్ కార్డు– ఇవన్నీ ఆ నమోదుతోనే ముడిపడితే, రైతుకు వద్దనే స్వేచ్ఛ ఎక్కడ? విత్తనం కొనడానికి డబ్బు కావాల్సిన రైతు ‘అంగీకరిస్తున్నా’ అని నొక్కడం సమ్మతి కాదు, తప్పనిసరి.ఆ సమాచారం చిన్నదేమీ కాదు. ఏ పంట వేశాడు, ఏ ఎరువు కొన్నాడు, ఎంత అప్పు ఉంది, ఎప్పుడు కట్టాడు– ఇదంతా ఎరువుల కంపెనీలకూ, రుణ సంస్థలకూ బంగారం లాంటిది. ఉపగ్రహ చిత్రంలో పంట ఎండినట్టు కనిపించిన మరుక్షణం రుణం వసూలుకు ఒత్తిడి మొదలవ్వొచ్చు.
ఇది ఊహాజనిత భయం కాదు. ప్రపంచంలో ఇలాగే జరిగింది. వాతావరణ సమాచారం ఇచ్చే ఒక చిన్న కంపెనీని మాన్ శాంటో వేల కోట్లు పెట్టి కొనుక్కుంది. ఆ తర్వాత అది రైతుల పొలాల సమాచా రాన్నంతా సేకరించే పెద్ద వేదికగా మారింది. ప్రజా ప్రయోజనం పేరుతో మొదలైన వ్యవస్థలు చివరికి వ్యాపార వేదికలుగా మారడం చాలాసార్లు చూశాం.
కృత్రిమ మేధతో సలహాలు ఇస్తామంటున్నారు. మన దగ్గర ఒక వ్యవసాయ అధికారికి వెయ్యి మంది రైతులు. ఇది సాంకేతిక లోపం కాదు, పెట్టుబడి లోపం. యాప్ ఉంది కదా అని సిబ్బందిని నియమించడం మానేస్తే, రైతుకు మిగిలేది పొలానికి రాని సలహా. పైగా ఆ సలహా ఇచ్చే వేదికలు ఎరువులు, పురుగుమందులు అమ్మే కంపెనీలతో కలిసి పనిచేస్తే– రసాయనాలు తక్కువ వాడమని అది ఎందుకు చెబుతుంది?
మరేం చేయాలి?
అగ్రిస్టాక్‌ను ఆపమని ఎవరూ అనడం లేదు. రైతు ప్రయోజ నాల చుట్టూ దాన్ని నిర్మించాలి. మొదటిది– భూమి యజమానిని కాక సాగు చేసేవారిని రైతుగా గుర్తించాలి. గ్రామసభ ధ్రువీకరణతో కౌలుదారుల పేర్లు నమోదు చేయాలి. ఒడిశా, కేరళ ఇలాంటి ప్రయత్నాలు చేశాయి. రెండోది– మహిళల పేర్లు తప్పనిసరిగా నమోదు కావాలి. కుటుంబంలో సాగుచేసే అందరికీ గుర్తింపు ఇవ్వాలి. మూడోది– సమాచారంపై బేరసారాలు ఒక్కో రైతు ఒంట రిగా చేయలేడు.
రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు, సహకార సంఘా లకు ఆ అధికారం ఇవ్వాలి. నాలుగోది– సలహాలు ఇచ్చే కంప్యూటర్ కార్యక్రమాలు బహిరంగంగా ఉండాలి. అవి ఎలా పనిచేస్తున్నాయో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ప్రజలు పరిశీలించగలగాలి. సలహాలు ఇచ్చే కంపెనీలు బాధ్యత వహించాలి. ఐదోది– ఎవరైనా అన్యాయంగా జాబితా నుంచి తప్పిపోతే, వారం రోజుల్లో సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. కంప్యూటర్ క్షణంలో పేరు తీసేస్తే, దాన్ని తిరిగి చేర్చడానికి ఏళ్లు పడితే ఆ సీజన్ పంట పోతుంది.
ఇవేమీ కొత్త ఆలోచనలు కావు. సేంద్రియ ధ్రువీకరణ కోసం మన దేశంలో ఇప్పటికే రైతులే పరస్పరం తనిఖీ చేసుకునే పద్ధతి నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసా యానికి మారింది యాప్‌ల వల్ల కాదు, గ్రామంలోని ఒక రైతు మరో రైతుకు నేర్పడం వల్ల. సాంకేతికత ఈ మానవ వ్యవస్థలకు తోడుగా రావాలే తప్ప, వాటి స్థానంలో కూర్చోకూడదు. మన వ్యవసాయ సంక్షోభం సమాచార సమస్య కాదు, పాలన సమస్య. భూమి పత్రం ఏం చెబుతుందో కాదు, పొలంలో ఎవరు చమట చిందిస్తున్నారో చూసే వ్యవస్థ కావాలి.
-వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త,‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
-డా‘‘ జి.వి.రామాంజనేయులు


