సముద్ర రవాణా ఇక ఆర్కిటిక్‌ వైపు? | Sakshi Guest Column On Sea transportation | Sakshi
Sakshi News home page

సముద్ర రవాణా ఇక ఆర్కిటిక్‌ వైపు?

Sep 4 2026 1:03 AM | Updated on Sep 4 2026 1:03 AM

Sakshi Guest Column On Sea transportation

విశ్లేషణ

ప్రపంచ సగటుతో పోలిస్తే వేగంగా పెరుగుతున్న ఆర్కిటిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గ్రీన్‌ లాండ్‌ను వశం చేసుకుంటామనే ట్రంప్‌ బెదిరింపులు, అసాధారణ స్థాయిలో కరిగిపోతున్న మంచు; రష్యా, ఇరాన్‌లపైన అమెరికా ఆర్థిక యుద్ధం క్రమంగా ప్రపంచ దేశాలను ఆర్కిటిక్‌ సముద్ర జలాల వైపు నడిపిస్తున్నాయి. అమెరికా నాయకత్వంలోని పాశ్చాత్య దేశాల అదుపాజ్ఞలలో ఉన్న హార్మూజ్, బాబెల్‌ మాండెబ్, సూయెజ్, మలక్కా జలసంధుల నుండి దూరంగా సురక్షిత ఆర్కి టిక్‌ సముద్ర మార్గం గుండా సరకుల రవాణాకు రష్యా, చైనా పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నాయి. ఆసియా, ఐరోపాలను కలిపే కేప్‌ ఆఫ్‌ గుడ్‌హోప్, సూయెజ్‌ కాలువ మార్గాలలో అశాంతి, అనిశ్చిత స్థితి వలన అందరి చూపు ఆర్కిటిక్‌ వైపు మళ్లింది. ప్రపంచ సగటుతో పోల్చితే ఆర్కిటిక్‌ సముద్రంలో ఉష్ణోగ్రతలు మూడు నుండి నాలుగు రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. దీనినే పర్యావరణ శాస్త్రజ్ఞులు ‘ఆర్కిటిక్‌ ఆంప్లిఫికేషన్‌ ’గా అభివర్ణిస్తున్నారు. పారిశ్రామిక విప్లవానికి ముందు ఉష్ణోగ్రతల కంటే ఐరోపాలో 2.4 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు పెరిగితే ఆర్కిటిక్‌ సముద్రంలో 3.3. డిగ్రీల సెల్సియస్‌ పెరిగింది. గత సంవత్సరంలో అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఆర్కిటిక్‌లో 5.8 శాతం మంచుపొర క్షీణించింది. వేగంగా క్షీణిస్తున్న మంచుపొర ఆర్కిటిక్‌ జలాలను నౌకాయానానికి మరింత అనుకూలంగా చేస్తున్నది. 

రష్యాకు సానుకూలం
ఆర్కిటిక్‌ జలాలలో మూడు ప్రధాన నౌకా మార్గాలున్నాయి. అవి. 1. నైరుతి మార్గం 2. వాయవ్య మార్గం 3. ధ్రువ ప్రాంతం మీదుగా వెళ్లే (ట్రాన్స్‌ పోలార్‌) మార్గం. కెనడా తీరంలోని వాయవ్య మార్గంలో అనువైన రేవు పట్టణాలు లేవు. అందువలదన ఈ ప్రాంతంలో కేవలం విహార యాత్రికుల క్రూయిజ్‌ షిప్పులు, పరిశోధనా నౌకలు మాత్రమే సంచరిస్తున్నాయి. ఉత్తర ధ్రువాన్ని ఆనుకుని ఉన్న ట్రాన్స్‌పోలార్‌ మార్గం పూర్తిగా మంచుతో కప్పబడి నౌకాయానానికి ఏ మాత్రం వీలుగా లేదు. ప్రస్తుత ప్రపంచ దృష్టి అంతా రష్యా తీరంలోని నైరుతి ఆర్కిటిక్‌ సముద్ర మార్గంపైననే ఉన్నది. రష్యా తీరంలో ముర్‌మన్‌స్క్‌నుండి వ్లాదివోస్తోక్‌ మధ్యలో 70కి పైగా రేవు పట్టణాలు ఉన్నాయి. ముర్‌మన్‌స్క్‌ రేవు పట్టణం సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటుంది. రష్యన్‌  న్యూక్లియర్‌ ఐస్‌ బ్రేకర్‌ నౌకాదళ ప్రధాన కార్యాలయం ఇక్కడనే ఉన్నది. 2025లో ఈ ఆర్కిటిక్‌ సముద్ర మార్గం గుండా 37 మిలియన్‌  టన్నులుగా ఉన్న రవాణా 2026లో ఇప్పటికే 40 మిలియన్‌  టన్నులకు చేరింది. ఈ రవాణా ప్రధానంగా రష్యన్‌  చమురు, గ్యాస్‌ ఎగుమతుల రూపంలో ఉన్నది. యామాల్‌ ద్వీపకల్పంలోని నోవాటెక్‌ చమురు క్షేత్రాలలో ఉత్పత్తి అవుతున్న చమురు, సహజవాయువులను ఈ మార్గం గుండా చైనాకు ఎగుమతి చేస్తున్నారు. రష్యా–చైనా మధ్య గత సంవత్సరం 103 నౌకలు ఈ మార్గంలో ప్రయాణించాయి. ఈ మార్గంలో చమురు ట్యాంకర్లే కాకుండా క్రమంగా సరకుల రవాణా చేసే భారీ కంటెయినర్‌ కార్గో షిప్పుల ప్రయాణం కూడా ప్రారంభమైంది. 2023లో 7 కంటెయినర్‌ షిప్పులు ప్రయాణిస్తే ఈ సంవత్సరం ఇప్పటికే 30 కంటెయినర్‌ షిప్పులు ప్రయాణించాయి.

చైనా వడి వడి అడుగులు
చైనా వ్యూహాత్మకంగా ఆర్కిటిక్‌ సముద్ర మార్గంపై అమితా సక్తిని చూపిస్తున్నది. చైనాకు ఆర్కిటిక్‌ తీరం లేదు. 2013లో ఆర్కిటిక్‌ కౌన్సిల్‌లో అబ్జర్వర్‌గా చేరింది. 2017లో చైనా తన ప్రతిష్ఠాత్మక బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనిషియేటివ్‌ (బీఆర్‌ఐ) పథకాన్ని ఆర్కిటిక్‌కు విస్తరిస్తూ ‘పోలార్‌ సిల్క్‌ రోడ్‌’ను ప్రతిపాదించింది. 2018లో ఆర్కిటిక్‌ విధాన శ్వేతపత్రంలో చైనా తనను తాను ‘నియర్‌ ఆర్కిటిక్‌ స్టేట్‌’గా అభివర్ణించుకున్నది. ఆర్కిటిక్‌ సముద్ర జల మార్గంలో 2024లో 15 చైనా నౌకలు ప్రయాణించగా, వాటి సంఖ్య 2026 నాటికి 30కి పైగా చేరింది. చైనాలో నింగ్‌బో నుండి కంటె యినర్‌ షిప్పులు సూయెజ్‌ కాలువ గుండా ప్రయాణిస్తే యూకేలోని అతిపెద్ద కంటెయినర్‌ టర్మినల్‌ ఫీలిక్స్‌స్టోవే చేరటానికి 40 రోజులు పడుతుంది. ఆర్కిటిక్‌ సముద్ర మార్గంలో నింగ్‌బో నుండి ఫీలిక్స్‌ స్టోవేకు 20 రోజుల్లో చేరుతున్నారు. చైనాకు చెందిన సీవోఎస్‌సీవో (కాస్కో) ఈ మార్గంలో కంటెయినర్‌ రవాణాను చేపట్టింది. నౌకల రవాణాను సుగమం చేయటానికి చైనా ఆర్కిటెక్‌ జలాలలోకి గ్జ్యూ లాంగ్, గ్జ్యూ లాంగ్‌–2 ఐస్‌బ్రేకర్‌ షిప్పులను ప్రవేశపెట్టింది. 2025లో రష్యా, చైనా ఆర్కిటిక్‌ సముద్ర రవాణాలో పరస్పరం సహకరించుకోవటానికి ఒప్పందం కుదుర్చుకొన్నాయి.

అంతర్జాతీయంగా రష్యన్‌  ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయటానికి రష్యాపై అమెరికా తీవ్ర ఆంక్షలను విధించింది. అంతర్జాతీయ నెఫ్ట్‌ చెల్లింపుల వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించింది. అయి నప్పటికీ చైనా, భారత్, ఇరాన్‌  వంటి దేశాలతో లావాదేవీల ద్వారా రష్యా తన వాణిజ్యాన్ని కొనసాగిస్తున్నది. ఆర్కిటిక్‌ జలాలలో రష్యా–చైనా వ్యూహాలను అమెరికా, ఐరోపాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుతం రష్యన్‌  ఆర్కిటిక్‌ ఎకానమీ, రష్యన్‌  జీడీపీలో పది శాతం కంటే తక్కువగానే ఉన్నది. కానీ రానున్న 20 సంవత్సరాలలో ఇది 60 శాతానికి చేరినా ఆశ్చర్యపడనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ గ్రీన్‌ లాండ్‌ వివాదాన్ని భుజాలకెత్తుకున్నాడు. ఆర్కిటిక్‌ జలాలలో రష్యా–చైనా లపై నిఘా వేయటానికి గ్రీన్‌ లాండ్‌ కీలకం. అందుకే గ్రీన్‌లాండ్‌ను అమెరికాలో అంతర్భాగం చేయాలని పట్టు బడుతున్నాడు. 2026 ఫిబ్రవరిలో నాటో ‘ఆపరేషన్‌  ఆర్కిటిక్‌ సెంట్రీ’ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఆర్కిటిక్‌ జలా లపై నాటో బలగాలు గట్టి నిఘాను పెడుతున్నాయి. అయితే ఆర్కిటిక్‌ రష్యాను ఎదుర్కొనే నౌకాశక్తిగానీ, ఐస్‌ బ్రేకింగ్‌ షిప్పుల సామ ర్థ్యాలుగానీ, యూఎస్, నాటోలకు లేవు. అదే రకంగా రష్యాకూ పరిమితులున్నాయి. రష్యా మీద ఆంక్షల వలన పాశ్చాత్య షిప్పింగ్‌ కంపెనీలు, బీమా కంపెనీలు ముందుకు రాకపోవడంతో ఆర్కిటిక్‌ ప్రపంచ రవాణా మార్గంగా అభివృద్ధి చెందటం కష్టం.

భారత్‌ కార్యకలాపాలు
1920 స్వాల్‌బార్డ్‌ ఒప్పందంపై సంతకం చేయటం ద్వారా భారత్‌ ఆర్కిటిక్‌ వైపు అడుగులు వేసింది. 2007లో తన మొదటి పరిశోధనా/ అన్వేషణ నౌకను ఆర్కిటిక్‌కు పంపించింది. 2013లో ఆర్కిటిక్‌ కౌన్సిల్‌లో అబ్జర్వర్‌గా చేరింది. 2022లో ఆర్కిటిక్‌ పాలసీని ప్రకటించింది. శాస్త్ర–వైజ్ఞానిక అంశాల లక్ష్యంగా ఉన్న ఆర్కిటిక్‌ సముద్ర జలాలను భారత్‌ 2022 తర్వాత వనరులు, ఆర్థిక లక్ష్యాలు, వ్యూహాత్మక కోణంలో నుండి పరిశీలించటం ప్రారంభించింది. 2024లో చెన్నై–వ్లాదివోస్తోక్‌ మార్గాన్ని ‘ఈస్టర్న్‌ మారిటైమ్‌ కారిడార్‌’గా అభివృద్ధి చేయటానికి రష్యాతో ఒప్పందం కుదుర్చు కున్నది. రష్యన్‌  ఆర్కిటిక్‌ తీరంలో ప్రాజెక్టుల అభివృద్ధికి ఒక బిలియన్‌  డాలర్ల లైన్‌  ఆఫ్‌ క్రెడిట్‌ను ఏర్పాటు చేసింది. వచ్చే సంవ త్సరం (2027)లో మొట్టమొదటి భారతీయ రవాణా నౌక ఆర్కిటిక్‌ జలాలలో ప్రయాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

గురజాల శ్రీనివాసరావు 
వ్యాసకర్త అడిషనల్‌ రిజిస్ట్రార్‌ (రిటైర్డ్‌);
సివిల్స్, గ్రూప్‌–1 పోటీ పరీక్షల నిపుణులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement